మేకప్ పైకప్పుల మాటున … జీవితాల అర్ధాంతర ప్యాకప్!

గ్లామర్ ప్రపంచంలో వున్న వారి గురించి చెప్పేటప్పుడు క్యాండిల్ ఉదాహరణ చెబుతుంటారు! జాగ్రత్తగా గమనిస్తే క్యాండిల్ చుట్టూ మనకు నల్లటి నీడ కనిపిస్తుంది! కాని, దూరంగా మాత్రం తన వెలుగుల్ని ప్రసరిస్తుంది! గ్లామర్ లోకంలోని తారలు కూడా అంతే చేస్తుంటారు! తమ చుట్టూ చీకట్లు అలుముకునేలా చేసుకుంటూ… దూరం నుంచీ చూసే వారికి మాత్రం ధగధగా మెరిసిపోతూ కనిపిస్తారు! ఇందుకు తాజా ఉదాహరణ ఆత్మహత్య చేసుకున్న నటుడు ప్రదీపే!

 

సినిమా వాళ్లు , సీరియల్ వాళ్లు, మోడల్స్ … ఇలా ఎవరైనా సరే… ఆత్మహత్య చేసుకున్నారని వార్తొస్తే చాలు… దాని వెనుక అంతిమ కారణం ఒత్తిడే అయ్యి వుంటుంది! ఇప్పటికే దాదాపుగా ఆత్మహత్య అని పోలీసులు కూడా అంగీకరిస్తోన్న ప్రదీప్ ఉదంతంలో అతడి భార్యతో చిన్న గొడవే ప్రాణాలు తీసుకోటానికి కారణం అంటున్నారు. ఇలాంటి భార్యా, భర్తల గొడవలు అన్ని రంగాల్లోని వారికి వుంటాయి. అయితే, నటుల వద్దకి వచ్చే సరికి అవ్వి మరింత ఒత్తిడి తీసుకొస్తాయి. ఎందుకంటే, వాళ్లు నటించటంలో భాగంగా ప్రతీ రోజూ ముఖం మీద బలవంతపు చిరు నవ్వు పులుముకోవాల్సిందే! కాని, నిజ జీవితంలో బోలెడు ఆటుపోట్లు కొనసాగుతూ వుంటాయి! ఈ రెండిటీ మధ్యా రాపిడి పెరిగిన కొద్దీ నటుల జీవితం దుర్భరం అవుతు వుంటుంది! గ్లామర్ మెరుపులతో వాళ్లు పైకి అందరికీ ఆర్టిఫిషల్ ఆనందం చూపించినా… లోన రియల్ వెలితి వేటాడుతూ వుంటుంది!

 

ప్రదీప్ లాగే ఆ మధ్య బాలికా వధూ సీరియల్ హీరోయిన్ ప్రత్యూష ప్రాణాలు తీసుకుంది. ఆమె సూసైడ్ కి కూడా రిలేషన్ షిప్ లో వచ్చిన ఒత్తిడే కారణం! తాను సహ జీవనం చేస్తోన్న వ్యక్తితో ప్రత్యూష గొడవ పడ్డాకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇక ఉదయ్ కిరణ్ సంగతి కూడా మనకు తెలిసిందే. ప్రొఫెషనల్ లైఫ్లో ఫెయిల్యూర్ తో పాటూ పర్సనల్ లైఫ్ లో టెన్షన్స్ జీవితాన్ని చాలించేలా చేశాయి!

 

సీరియల్ ఆర్టిస్ట్ ప్రదీప్ ఆత్మహత్యలో అతను తాగి వుండటం కూడా కీలకమైన అంశం. ఒకప్పటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ దివ్యభారతి తాగి మేడ మీద నుంచి పడిపోయిందనే చెబుతారు. ఆమె ఆత్మహత్య విషయంలో అనేక అనుమానాలున్నప్పటికీ… మందు, డ్రగ్స్ లాంటి వాటి పాత్ర గ్లామర్ ప్రపంచంలో కొట్టిపారేయలేం. మత్తుకు లోనయ్యాక చిత్తయ్యే అవకాశాలు మరింత ఎక్కువవుతాయి.

 

ఇప్పటి ప్రదీప్ అయినా, మొన్నటి జియా ఖాన్ అయినా, నిన్నటి ప్రత్యూష బెనర్జీ అయినా… అందరూ చెప్పేది ఒక్కటే… గ్లామర్ ప్రపంచం ఇచ్చే వరాలతో పాటూ శాపాల్ని సమర్థంగా ఎదుర్కోవాలి. మానసిక ఒత్తిడిని తట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. క్షణికావేశం లేకుండా, నిరాశా, నిస్పృహ దరి చేరకుండా జాగ్రత్త పడాలి. లేదంటే అయినా వారందరికీ బాధను మిగులుస్తూ అర్ధాంతరంగా ప్కాకప్ చెప్పేయాల్సి వస్తుంది!