ఏసీపీ సంజీవరావుపై దాడి.. టీఆర్ఎస్ వ్యూహం అదేనా?
posted on Nov 17, 2015 11:27AM
కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలో ఏసీబీ.. ఏసీపీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగానే సంజీవరావుకు ఉన్న అనేక అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇదంతా ఒకవైపు అయితే సంజీవరావు టీ టీడీపీ బంధువు అనే విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సోదా వెనుక రాజకీయ కోణం కూడా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కావాలనే ఏసీపీ ఇంటిపై దాడులు నిర్వహించిందని..ఆ రకంగా ఆ టీడీపీ నేతను ఇరుకున పెట్టాలని ఈ ప్లాన్ వేసిందని అనుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ,టీడీపీ తరుపున అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేందుకు గాను ఆ టీడీపీ నేత గ్రౌండ్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో.. మానసికంగా దెబ్బకొట్టేందుకే టీఆర్ఎస్ ఇలా చేసిందని.. దానివల్ల టీడీపీ నేత తన దూకుడిని తగ్గిస్తారని టీఆర్ఎస్ భావించి ఉండవచ్చని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వారి మాటలను ఖండించి ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే.. అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు అంటు చెబుతున్నారు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.