చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు తెచ్చారు?
posted on Aug 31, 2015 1:18PM
ఈరోజు ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో ప్రత్యేక హోదా అంశంపై వైకాపా రాద్దాంతం చేస్తుందని ప్రభుత్వం ముందే ఊహించింది. ఊహించినట్లే జగన్ తెదేపా, బీజేపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ అధిష్టానం-జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య ఒప్పందం ప్రస్తావన చేసి జగన్ బండారాన్ని బయటపెట్టారు.
అక్రమాస్తుల కేసుల్లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డిపై ఏకంగా 11 చార్జ్ షీట్లు నమోదు చేయబడ్డాయి. ఒకవేళ ఆ సమయంలో రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికలు జరగకపోయినట్లయితే బహుశః ఆయన ఇప్పటికీ జైల్లోనే ఉండేవారేమో కూడా. తెలంగాణాలో ఉద్యమాలు ఉదృతం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొంది. అయితే కేవలం ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గే తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సిద్దపడిందని అనుకోవడానికి లేదు. మోడీ ప్రవేశంతో కేంద్రంలో తిరిగి అధికారం నిలబెట్టుకొనే అవకాశాలు సన్నగిల్లాయనే వాస్తవాన్ని చాలా ముందే పసికట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేక వ్యూహం అమలుచేయడం ద్వారా తన విజయావకాశాలను మెరుగుపరుచుకోవాలనుకొంది.
ఆ ప్రయత్నాలలో భాగంగానే రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం ద్వారా అక్కడ విజయం సాధించవచ్చని భావించింది. కానీ రాష్ట్ర విభజన చేసినట్లయితే ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని గ్రహించడంతో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను జగన్ కి అనుకూలంగా మలిచి ఎన్నికల అనంతరం వైకాపా మద్దతు పొందవచ్చని ఎత్తు వేసింది.
కాంగ్రెస్ అధిష్టానం-జగన్ మధ్య రహస్య అవగాహన కుదరడం వలననే జగన్ పై 11 చార్జ్ షీట్లు నమోదు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ అకస్మాత్తుగా మహారాష్ట్రాకి బదిలీ అయిపోయారు. ఆయన బదిలీ అయిపోవడం, తరువాత జగన్ తో సహా అందరికీ బెయిలు మంజూరు అవడం, ఆ కేసులను ఎక్కడో చెన్నైలో సీబీఐ అధికారికి బదలాయించడం, క్రమంగా అవన్నీ అటకెక్కడం, ఎన్నికలు జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
కాంగ్రెస్-వైయస్సారో కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలో డ్డీ కొనబోతున్న తరుణంలో కూడా “జగన్ నా కొడుకు వంటివాడు,” అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్ అనడం గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య అవగాహనా ఉందని అర్ధమవుతోంది. అలాగే “ఎన్నికల తరువాత వైకాపా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది,” అని వైకాపాలో చేరాలనుకొన్న సబ్బం హరి విస్పష్టంగా ప్రకటించడం మరో ఉదాహరణ. కానీ ఆయన తమ రహస్య అవగాహనని బయటపెట్టడంతో, ప్రజలలో కాంగ్రెస్ పట్ల నెలకొన్న వ్యతిరేకత తన పార్టీకి ఎదురవుతుందనే భయంతో సబ్బం హరికి పార్టీలో రాకముందే తలుపులు మూసేశారు.
చివరికి కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టింది. తెరాస, వైకాపాలు రెండూ హ్యాండిచ్చాయి. వైకాపా వ్యూహం కూడా బెడిసి కొట్టింది. ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారం నిలబెట్టుకొని ఉండి ఉంటే బహుశః ఆ రెండు పార్టీలు ఇప్పుడు యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉండేవేమో? కానీ కాంగ్రెస్ ఓడిపోవడంతో రహస్య ఒప్పందాలన్నీ బుట్ట దాఖలయ్యాయి. ఈ రాజకీయ చదరంగాన్ని మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీయే చివరికి అన్ని చోట్లా ఓడిపోగా అందులో పాల్గొన్న తెరాస, వైకాపాలు లబ్ది పొందాయి.
కానీ కాంగ్రెస్ అధిష్టానంలాగే జగన్ మోహన్ రెడ్డి కూడా కొంచెం అతి తెలివితేటలు, అతి విశ్వాసం ప్రదర్శించడంతో ఎన్నికలలో బోర్లాపడ్డారు. కానీ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ చాలా తెలివిగా పావులు కదుపుతూ విజయం సాధించగలిగారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలకి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం బలయిపోయింది. కానీ సరిగా ఆ కారణంగానే జగన్ జైలు నుండి విముక్తి పొందడమే కాకుండా, కాంగ్రెస్ కోరుకొన్నట్లే దాని ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకొని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదగగలిగారు. కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకోలేకపోయారు. దానికి చంద్రబాబు నాయుడు సైందవుడిలా అడ్డుపడ్డారనే దుగ్ధతో అందివచ్చిన ప్రతీ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొంటూ ఆయనపై ప్రయోగిస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయనని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు, రాష్ట్ర విభజన సమయంలో జగన్ నిర్వాకాన్ని ఎండగట్టారు. పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసివేసి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లుని ఆమోదిస్తున్నప్పుడు జగన్ ఎక్కడ దాకొన్నారు? అని ప్రశ్నించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న రహస్య ఒప్పందం లేదా అవగాహన కారణంగానే, అత్యంత ముఖ్యమయిన సమయంలో జగన్ పార్లమెంటుకి వెళ్ళకుండా డుమ్మా కొట్టారని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. రాష్ట్ర విభజనకి పరోక్షంగా కారకుడయిన అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఉద్యమించడం, దాని ద్వారా తనను, తన ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని భావించిన చంద్రబాబు నాయుడు కూడా క్రమంగా మరుగునపడుతున్న కాంగ్రెస్-వైకాపాల మధ్య జరిగిన ఈ తెరచాటు వ్యవహారాన్ని ఆయనకు శాసన సభ సాక్షిగా మరొక్కమారు గుర్తు చేసారు.