ఆనాడు సమైక్యం ఈనాడు ప్రత్యేకం...

 

రాష్ట్ర విభజన చేసినందుకు ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతికించుకొనేందుకు ఆ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొంది. బహుశః కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితిని ముందే పసిగట్టి దానిని తిరిగి బ్రతికించుకోవడానికే బహుశః ఈ ప్రత్యేక ఆయుధాన్ని ముందే రూపొందించిందేమో? బహుశః అందుకే అసాధ్యమని తెలిసి ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేస్తున్నట్లు ఆనాడు డా. మన్మోహన్ సింగుతో పార్లమెంటులో ప్రకటింపజేసిందేమో?

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని మళ్ళీ బలపడే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, దానిని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పసిగట్టడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చును. అందుకే ఆయన ఇంతకాలం ఆ ప్రసక్తే ఎత్తలేదు. కానీ రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా విఫలం అవడంతో ఆ పార్టీ నిర్వహించాల్సిన బాధ్యతని తమ పార్టీ నిర్వర్తిస్తోందని చెప్పడంతో ఉలిక్కిపడిన జగన్ ఆనాటి నుండే ఈ ప్రత్యేక పోరాటాలు మొదలుపెట్టిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.

 

రాహుల్ గాంధీ విమర్శలు చేసిన కొన్ని రోజులకే జగన్ హడావుడిగా డిల్లీ వెళ్లి ధర్నా చేసి రావడం, తరువాత మొన్న 29న దీని కోసం రాష్ట్ర బంద్ నిర్వహించడం, అసెంబ్లీలో దీనిపై రభస చేయడం, త్వరలో ఆమరణ నిరాహార దీక్ష అన్నీ కూడా ప్రత్యేక హోదా పోరాటంలో తను ఛాంపియన్ అనిపించుకొని ప్రజల మెప్పు పొందడానికేనని స్పష్టం అవుతోంది. ఇదివరకు సమైక్యాంధ్ర ఛాంపియన్ అనిపించుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డితో పోటీ పడ్డ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్నారు. అప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తే ఇప్పుడు తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని దెబ్బ తీసేందుకు ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నట్లున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడునే లక్ష్యంగా చేసుకొని జగన్ యుద్ధం చేస్తున్నారు తప్ప ఈ సమస్యను పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వంపై పల్లెత్తు మాటనడం లేదు. ప్రశ్నించడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమయితే ఆయన చంద్రబాబుని నిలదీయడం, ఆయనకి 15రోజులు గడువు విధించడం గమనిస్తే ఆయన పోరాటం దేని కోసమో ఎవరి మీదనో అర్ధం అవుతోంది.

 

ఈనెల 15లోగా ప్రత్యేక హోదా సాధించలేకపోయినట్లయితే 16 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని జగన్ నిన్న ప్రకటించారు. అయితే ఆయన డిల్లీలో ఐదు గంటలపాటు చేసిన ధర్నాపై మోడీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు కూడా. మరి ఆయన దీక్ష చేసి ఏమి సాధించగలిగారు? అంటే మీడియాని, తద్వారా రాష్ట్రప్రజలని ఆకట్టుకొని “ప్రత్యేక ఛాంపియన్” అనిపించుకోవడం తప్ప సాధిందేమీలేదనే చెప్పవచ్చును. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఆ తరువాత బంద్, మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దపడుతున్నట్లుంది.

 

వైకాపాకి ఈ విషయంలో నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే దీని గురించి పోరాటం మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి, నటుడు శివాజీకి ఎందుకు బేషరతుగా మద్దతు ఈయలేదు? అనే సందేహం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తే ఆ క్రెడిట్ అంతా ఆ పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా సినిమా హీరో శివాజీకి మద్దతు ఇస్తే ఆయన ప్రజల్లో నిజమయిన హీరోగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై పూర్తి క్రెడిట్ తనకే దక్కాలని జగన్ ఆశిస్తున్న కారణంగానే వారి పోరాటాలకి మద్దతు ఇవ్వలేదని భావించవచ్చును. వారి ప్రత్యేక పోరాటాలను హైజాక్ చేసిన తరువాత ఇప్పుడు తనే ప్రత్యేక ఛాంపియన్ గా ప్రజలలో గుర్తింపు సంపాదించుకోనేందుకే జగన్ ఆరాటపడుతున్నట్లున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

చేసే పనిలో చిత్తశుద్ది లోపిస్తే దాని కోసం ఎంత కష్టపడినా వృధాయేననే సంగతి నేటికీ జగన్ గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకు ముందు జగన్ వంటి రాజకీయ నాయకులు చాలా సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేసారు. చివరికి అవి ఏవిధంగా ముగుస్తాయో ప్రజలకీ అర్దమయిపోయింది. అయినా జగన్ మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి పూనుకొంటున్నారంటే ‘ప్రత్యేక ఛాంపియన్’ అనే గుర్తింపు కోసమేనని సర్దిచెప్పుకోక తప్పదు.