రాముడి కోసం విలపించిన తండ్రి- దశరథుడు
రామాయణం అనగానే అందరికీ రాముడు పడ్డ కష్టాలే గుర్తుకువస్తాయి. సీతమ్మ ఓర్చుకున్న బాధలే స్ఫురిస్తాయి. ఆ సీతారాములను అడవులకి పంపి తాను మాత్రం రాజభవనంలో ఉండిపోయిన ధశరథుని తలచుకునేవారు ఎవ్వరు. రాముడంటే లోకకళ్యాణం కోసం అడవులకేగాడు. అంతిమంగా రావణాసురుని సంహరించి అవతార లక్ష్యాన్ని సాధించాడు మరి దశరథుడో...
హరిశ్చంద్రుడు, దిలీపుడు వంటి మహమహారాజులు జన్మించిన రఘువంశపు వారసుడు దశరథుడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించే ఆ దశరథుడు అసమాన పరాక్రమవంతుడు. పది దిక్కుల వైపూ రథాన్ని తోలగల సామర్థ్యం ఉన్నవాడు కాబట్టే ఆయనకు దశ-రథుడు అన్నపేరు వచ్చింది. అలాంటి దశరథుని పాలనలో అయోధ్యలోని కాలం సుభిక్షంగా సాగిపోతోంది. కానీ దశరథుని మనసులో ఒక్కటే చింత! అతని తరువాత రాజ్యాన్ని ఏలే సంతానం లేదు. దాంతో కులగురువులైన వశిష్టుల ఉపదేశంతో పుత్రకామేష్టి యాగాన్ని తలపెడతారు. ఆ యాగఫలంతో కలిగిన సంతానమే రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు.
లేకలేక కలిగిన కుమారులను అల్లారుముద్దుగా చూసుకునేవాడు దశరథుడు. వారిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండగలిగేవారు కాదు. కానీ అదేం చిత్రమో కానీ రాముడు ఇలా యవ్వనంలోకి అడుగుపెట్టాడో లేదో... వారివురి మధ్యా తొలి ఎడబాటు మొదలైంది. రాక్షసులు తమ యాగాలను పాడు చేస్తున్నారనీ, తాము యాగం చేసే సమయంలో వాటిని కాపాడుతూ ఉండేందుకు రామలక్ష్మణులను పంపమంటూ విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వస్తాడు. ఆ అభ్యర్థన దశరథునికి శరాఘాతంగా తోస్తుంది. కానీ అవతల అడుగుతున్నది విశ్వామిత్రుడయ్యే! ఆయన మాటను కాదంటే ప్రళయమే! అందుకని వశిష్టుల వారి సలహా మేరకు వారిని యాగరక్షణకు పంపేందుకు ఇష్టపడతాడు.
విశ్వామిత్రుని వెంట వెళ్లిన రామలక్ష్మణులకు ఆ ప్రయాణం చాలా మేలే చేస్తుంది. తాము నేర్చుకున్న విద్యలను పరీక్షించి చూసుకోవడానికీ, నేర్వని విద్యలను విశ్వామిత్రుని వద్ద అభ్యసించడానికీ అవకాశాన్ని ఇస్తుంది. పైగా యాగరక్షణ ముగిసిన తరువాత రాముని సీతా స్వయంవరానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ రాముడు సీతనీ, లక్ష్మణుడు ఊర్మిళనూ వివాహమాడి అయోధ్యకు తిరిగివస్తారు. ఇక ఇక్కడి నుంచి మరో కథ మొదలవుతుంది. తనకు వయసు మీరిపోవడం వల్ల, రామునికి పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న దశరథుని కోరికకు కైక అడ్డుపడుతుంది.
ఒకప్పుడు శంబరాసురుడు అనే రాక్షసుని మీద యుద్ధం జరిగే సమయంలో అతని మాయలను ఛేదించేందుకు కైక, దశరథునికి సాయపడింది. ఆ సందర్భంగా ఏవైనా రెండు వరాలను కోరుకొమ్మని అడుగుతాడు దశరథుడు. కానీ కైక మాత్రం సమయం వచ్చినప్పుడు కోరుకుంటానంటూ దాటవేస్తుంది. ఇప్పుడు రాముడు పట్టాభిషేకం అనగానే స్వతహాగా అయితేనేం, చెడు మాటల వల్ల అయితేనేం... తన కొడుకు భరతునికే పట్టాభిషేకం జరగాలని కోరుకుంటుంది కైక. పైగా కైకేయిని వివాహం చేసకునే సమయంలో ఆమె సంతానాన్నే తన వారసునిగా చేస్తానంటూ దశరథుడు ఒక వాగ్దానం కూడా చేసి ఉన్నాడు. వీటన్నింటి నేపథ్యంలో తన కుమారుడే అయోధ్యకు రాజు కావాలనీ, రాముడు ఆ రాజ్యానికి దూరంగా అరణ్యవాసం గడపాలనీ కోరుకుంటుంద. కైకకు ఇచ్చిన వరం మేరకు రాముడు అడవులకు ఏగడం, అక్కడ సీతాపహరణం జరగడం, వానరసేనతో పరిచయం, రావణ సంహారం ఇవన్నీ కూడా తెలిసిన ఘట్టాలే! అయితే దశరథుడు రాముని నుంచి దూరం కావడానికి మరో కారణం కూడా ఉంది. అదే శ్రవణకుమారుని వృత్తాంతం.
దశరధుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒకనాడు సరయూనదీ తీరాన వేటకు బయల్దేరాడు. వేటలో ముందుకు సాగుతుండగా అతినికి ఏదో జంతువు నీరు తాగుతున్న చప్పుడు వినిపించింది. దశరథునికి శస్త్రవిద్యలో శబ్దబేధి అనే విద్య కొట్టిన పిండి. అంటే శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించడం అన్నమాట. అలా శబ్దబేధి విద్య ద్వారా ఆయన నీటి శబ్దం వస్తున్న దిశగా బాణాన్ని విడిచాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఏముంది. ఒక బ్రహ్మచారి, గుండెల్లో తను విడిచిన బాణంతో విలవిల్లాడుతూ కనిపించాడు. అతడే శ్రవణుడు! గుడ్డివారైన తన తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రవణుడు వారిని కావడిలో ఉంచుకుని పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్నాడు. అలాంటి సమయంలో వారి దాహార్తిని తీర్చేందుకు కావడిని ఒక చోట ఉంచి నీటి కోసం బయల్దేరి, దశరథుని బాణానికి బలయ్యాడు. శ్రవణుని బదులుగా అతని తల్లిదండ్రుల దాహార్తిని తీర్చేందుకు వెళ్లిన దశరథుని, వారితో విషయాన్ని చెప్పక తప్పలేదు.
శ్రవణుని మరణవార్తను విన్న అతని తల్లిదండ్రుల గుండెపగిలిపోయింది. శ్రవణుడు తమకు దూరం అయినట్లే నీ కుమారుడు కూడా నీకు దూరమైన పుత్రశోకంతో మరణిస్తావంటూ శపించి తనువు చాలించారు. కాలక్రమేణా దశరథుడు ఈ వృత్తాంతాన్ని మర్చిపోతాడు కానీ రాముని వియోగంతో విలపిస్తున్న సమయంలో ఆ శాపం మళ్లీ గుర్తుకువస్తుంది. రాముని పదేపదే తల్చుకుంటూ తుదిశ్వాసను విడుస్తాడు దశరథుడు. రాముడు తొలిసారి అడవులకు వెళ్లి రాక్షససంహారాన్నీ, సీతాస్వయంవరాన్నీ సాధించాడు. రెండోసారి అడవులకు వెళ్లి రావణ సంహారాన్ని, ఆంజనేయుని మైత్రినీ సాధించాడు. కానీ ఈ రెండు సందర్భాలలో రాముని ఎడబాటుతో విలపిస్తూ, ఎదురుచూస్తూ ఉండిపోయింది మాత్రం దశరథుడే! చివరికి ఆ ఎడబాటుతోనే తనువు చాలించాడు.
- నిర్జర.