వెలుగులు వెదజల్లే ధ్రువకుమారుడు
ఇప్పటికి ఎవరో ఒకరు అబ్బా! ధృవ నక్షత్రంలా వెలిగిపోతున్నాడు అనే మాట వింటూనే ఉంటాం. ఎన్నో యుగాల ముందు జన్మించినా ఇప్పటికి ఆ ధృవుని మనం స్మరిస్తూనే ఉండటానికి గల కారణాలు తెలుసుకోకపోతే ఎలాగ? శ్రీ మహా విష్ణువు కోసం తపస్సు చేసి ఆయనని మెప్పించి చిన్న వయసులోనే వరాలు పొందిన ధ్రువుడు ఇప్పటి యువతరానికి మార్గదర్శకుడు.
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. వారిలో ఉత్తానపాదుడికి సునీతి వలన ధ్రువుడు,సురుచి వలన ఉత్తముడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కాలం గడచిన కొద్ది ఉత్తానపాదుడికి సునీతి పట్ల విముఖత ఏర్పడి ఎక్కువగా రెండో భార్య అయిన సురుచి దగ్గరే కాలం గడపసాగాడు. దానితో సురుచిలో గర్వం పెరిగి కన్ను మిన్ను కానక వ్యవహరించేది. ఒకరోజు చిన్నపిల్లవాడైన ధ్రువుడు, సురుచి కొడుకు ఉత్తముడు తండ్రి ఒళ్ళో కూర్చోవటం చూసి తను కూడా వెళ్లి కూర్చుంటాడు.
అది చూసిన సురుచి ఒక్కసారిగా ధ్రువుని రెక్క పట్టుకుని లాగి కిందకు పడేసి నీకు అలా తండ్రి ఒళ్ళో కూర్చునే అర్హతే లేదని చెప్తుంది. దేనికైనా పెట్టి పుట్టాలని వెళ్లి శ్రీహరికి తపస్సు చేసుకుంటే ఎలాంటి కోరికలైనా తీరుస్తాడని చెపుతుంది. తల్లి సునీతి దగ్గరకి వచ్చి తన బాధ వెళ్ళబుచ్చుకుని,సవతి తల్లి అన్న మాటలన్నీ చెపుతాడు. తల్లి కూడా అదే మంచిదని చెపుతుంది. దానితో జీవితంపై విరక్తి కలిగి ఆ శ్రీహరిని చూడటానికే నిశ్చయించుకుంటాడు ద్రువకుమారుడు. అడవికి వెళ్ళే దారి మధ్యలో నారద మహాముని కనిపించి మంచి మాటలు చెప్పి తిరిగి రాజ్యానికి పంపుదామనుకున్నా అతని మాటను కూడా వినక,శ్రీహరిని చూడాలన్న తన కోరికను వెళ్ళబుచ్చుతాడు. అప్పుడు నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహా మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ధ్రువుడు శ్రీహరి గురించి తపస్సు చేసే సమయానికి ఆయన వయసు ఐదు సంవత్సరాలని చెపుతుంటారు.
ఎన్నో రకాలుగా ఘోరమైన తపస్సు చేసి ఆఖరుకి నారాయణుడిని మెప్పిస్తాడు ఆ చిన్ని ధ్రువుడు. నారాయణుడు శంఖ, చక్ర, గధాధరుడై ద్రువునికి దర్శనమిచ్చి ద్రువక్షితిలో స్థానం ఇస్తాడు. అయితే ఆ స్థానాన్ని పొందే ముందు రాజ్య పాలన చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకొంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది, రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళ్తాడు. శింశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతి ని పెళ్లి చేసుకొని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు ధ్రువుడు.
ధ్రువుడు ఎన్నో దాన ధర్మాలు చేసి, యజ్ఞ యాగాదులు చేసి తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికాశ్రమానికి వెళ్ళిపోతాడు. ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు.ఇలా నారాయణుడిని చేరుకుంటాడు ధ్రువుడు. నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడికి నారాయణ మీదున్న భక్తి ఫలంగా లభించనదే అని చెబుతారు.
- కళ్యాణి