కాశీ కబుర్లు - 5

కాశీ నగరం
         

    

 

కాశీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగానది ఒడ్డున ఉంది. ఇది వారణాసి జిల్లాకు కేంద్రం. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంటుంది. ఇక్కడి వాతావరణంలో వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య వేసవి కాలంలో ఋతుపవనాల వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. హిమాలయ ప్రాంతంనుండి వచ్చే చలి గాలుల మూలంగా  డిసెంబరు - ఫిబ్రవరి మధ్య శీతాకాలంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది.  చలికాలంలో దట్టమైన పొగమంచు, వేసవి కాలంలో వడగాడ్పులు ఉంటాయి.

 

నగరంలో వాతావరణ కాలుష్యం  కన్నా నీటి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది.  నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.

 

ఒకప్పుడు కాశీ నగరం ఎంతో సుందరమైన నగరం. కేవలం ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రంగానే గాక ఉల్లాస జీవితానికి కూడా పేరు పొందింది.  

 

 

పూర్వం ఈ నగరం పాండిత్యానికి ప్రసిధ్ధి చెందింది.  వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వంటివాటికి వ్యాపార కేంద్రంగా వుండేది.  కాశీ ఒకప్పుడు కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు హ్యూవాన్ సంగ్ ఈ  నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో .. బారనాసి .. అని వ్రాశేవారు. కాలక్రమేణా అది  బవారస్‌గా మారింది.  వారణాసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉన్నది.  ఇక్కడ వరుణ అనే నది ఉత్తరాన, అస్సి అనే చిన్న నది దక్షిణాన గంగానదిలో కలవటం వల్ల ఈ రెండు నదుల మధ్య వున్న ప్రదేశం కనుక రెండు నదుల పేర్లు కలిపి వారణాసి అన్నారు.  ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

 

వారణాసి నగరాన్ని  పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

 

పంచభూతాలను, నాడీ కేంద్రాలను ఆధారంగా చేసుకుని కాశీ నగరాన్ని నిర్మించారంటారు.   ఒకప్పుడు కాశీ నగరంలో 25 వేలకి పైగా ఆలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 2వేలకు మించి లేదు. అంతేగాక వీటిలో చాలావరకు పునర్నిర్మాణం జరుపుకున్నవే. కాశీ విశ్వనాథుని ఆలయం అలా పునర్నిర్మింపబడిందే. ఔరంగజేబు ఇక్కడకు వచ్చినపుడు విశ్వనాథ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఒక మసీదును నిర్మించాడు. శివ లింగాన్ని ఆలయం నుంచి బయటకు తరలించాడు.  ప్రస్తుతం కాశీ విశ్వనాథుని ఆలయం ఉన్న ప్రదేశం మొదట ఆలయం ఉన్న ప్రదేశం కాదు.  బయట ప్రదేశం.

 

 

బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలని బుద్ధుడు బోధించాడు. వారణాసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకుని కంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థలంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

 

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుడి జన్మ స్థలం ఇదే.  అందుకే వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలం. వారణాసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. 

 

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి.

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
 


More Kashi Yatra