కాశీ కబుర్లు – 4

కాశీ వైశిష్ట్యం

 

 

                                                                                                   
కాశీలో వసతి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు కదా.  కొందరు కొత్త ప్రదేశాలకు వారంతటవారు వెళ్ళటానికి ఇబ్బంది పడతారు.  అలాంటివారి కోసం  ట్రావెలర్స్ వున్నారు.  వాళ్ళు వాళ్ళ పేకేజ్ ల ప్రకారం కాశీ తీసుకువెళ్ళి తీసుకు రావటమేగాక అక్కడ వసతి, భోజనం, వేరే వూళ్ళకి రవాణా, ఇలాంటి సౌకర్యాలుకూడా ఏర్పాటు చేస్తారు.  వీటిలో వుండే ఇబ్బందులు వీటిలోవున్నా, ఖర్చు తక్కువలో, కొత్త ప్రదేశంలో ఏమీ వెతుక్కోకుండా గడవాలంటే వీళ్ళద్వారా వెళ్తే మంచిది.  అనేకమంది ట్రావెలర్స్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తూనే వుంటారు.  మీకు అనువుగా వున్నవారిని చూసుకుని బయల్దేరండి.  వీటివల్ల ఉపయోగాలు

 

 

 

కాశీలో వుండే సమయమూ, చూసే ముఖ్య ప్రదేశాలు ఎలా వెళ్ళినా దాదాపు ఒకటేగనుక ఈ విషయంలో పెద్ద తేడా ఏమీ వుండదు.  ఇంకా ఎక్కువ ప్రదేశాలు చూడాలంటే ఖాళీ సమయంలో మీరు వెళ్ళి రావచ్చు. వసతి మీరు వెతుక్కోవక్కరలేదు.  అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళిచ్చినదానిలో వుండాలి..లేకపోతే డబ్బు ఖర్చు అయితే అవుతుందని వాళ్ళకే చెప్పి ఇంకొంచెం మంచి వసతి ఏర్పాటు చెయ్యమనాలి భోజనం…సాధారణంగా వాళ్ళు అక్కడే వండి పెడతారుగనుక బయట ఆహారం పడనివారికి కొంత సౌకర్యంగావుంటుంది.  ఇది నచ్చకపోతే మీ పర్సు, బయట హోటళ్ళు వుండనే వున్నాయి.  అప్పుడు అక్కడా డబ్బు చెల్లించాలి, బయటా ఖర్చు పెట్టాలి.

 

కాశీ వైశిష్ట్యం

కాశీ పట్టణానికి అనేక వేల సంవత్సరాల చరిత్ర వున్నది.  వాటన్నింటికీ ఆధారాలు దొరకటం కూడా కష్టమే.   బెనారస్ హిందూ యూనివర్సిటీ గ్రంధాలయంలో లభ్యమయ్యే కొన్ని గ్రంధాల  ప్రకారం చూస్తే దీని చరిత్ర 6 వేల నుంచి 7 వేల సంవత్సరాల క్రితంది.  ఇంకొక ప్రబలమైన సాక్ష్యం లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో వున్నదిట.  అది ఒక నాణెం.  అందులో శివుడు శూలాన్ని పట్టుకుని సిధ్ధాసనంలో కూర్చుని వుండగా వెనక మహిషం వున్నట్లు వున్నది.  ఈ నాణెం 12,400 సంవత్సరాలనాటిదని విదేశీ పురావస్తు శాస్త్రవేత్తలు లెక్క కట్టారుట.
కాశీ గురించిన అనేక విశేషాలు  వేదవ్యాస మహర్షి విరచిత పురాణాలలో వివరంగా ఇవ్వబడ్డాయి.  వీటిలో స్కంద పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం ముఖ్యమైనవి. 

 

 

 

కాశీ సృష్ట్యాదినుంచి..కాదు కాదు…సృష్టికన్నా ముందునుంచీ వున్నది.  శివ పురాణం ప్రకారం సృష్టికి పూర్వము ఈ జగమంతా నీటితో నిండిపోయివుంది.  బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి తగిన జ్ఞానం, శక్తి సంపాదించుకోవటానికి కావలసిన  తపస్సు చేయటానికి కూర్చోవటానికి ఒక ప్రదేశం కావాల్సి వచ్చింది.  అప్పుడు మహా శివుడు తన త్రిశూలంమీద కొంత భూ భాగాన్ని సృష్టించాడు.  బ్రహ్మదేవుడు ఆ భూ భాగం మీద కూర్చుని తపస్సు చేసిన తర్వాత సంకల్ప మాత్రంచేత తన శరీరంలోని వివిధ భాగాలనుంచి మహర్షులను, దేవతలను, ఆనేక లోకాలను, భూమితోసహా సమస్త గ్రహాలను, జీవజాలాన్ని ఇంకా అనేకం సృష్టించాడు.  దేవతలు, మహర్షులు అందరూ ప్రార్ధించగా పరమ శివుడు త్రిశూలం మీదనుంచి తను సృష్టించిన భూభాగాన్ని కూడా బ్రహ్మ సృష్టించిన భూమి మీదకి దించాడు.  అదే కాశీ క్షేత్రం.  ఈ క్షేత్రం వైశాల్యం 10 కి.మీ.లు.  ఈ కాశీ క్షేత్రం మహాదేవుడు సృష్టించినది కనుక బ్రహ్మకుగానీ, ఆయనచే సృష్టింపబడిన ఏ ప్రాణికిగానీ శివుడు సృష్టించిన ఈ కాశీ క్షేత్రంమీద ఎటువంటి అధికారంలేదు.  

 ఈ కాశీ క్షేత్రం పరమ శివునికి చాలా ప్రీతి పాత్రమయింది.   ఆయన ఎల్లవేళలా ఈ క్షేత్రాన్ని విడువకుండా వుంటాడు.  అందుకే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని, అవిముక్తేశ్వరం అనీ అంటారు.   బ్రహ్మచే సృష్టింపబడిన దేవతలందరూ మహా శివుని సేవించుటకు కాశీక్షేత్రంలో నివసిస్తుంటారు. ప్రళయకాలంలో బ్రహ్మదేవుడి సృష్టి సమస్తం నాశనమవుతుందికానీ  ఈ కాశీ క్షేత్రానికి ఎలాంటి ఇబ్బందీ వుండదు.  కారణం ఇది బ్రహ్మదేవుని సృష్టి కాదు.  దీని సృష్టికర్త సాక్షాత్తూ పరమ శివుడు.  సకలదేవతా నిలయమైన కాశీ ఎంత పుణ్య క్షేత్రమో, దాని మహత్యం ఎంత గొప్పదో మనంకూడా తెలుసుకుందాము.    

 

కాశీలో అనేక దేవతలు, ఋషులు, ఇంకెందరో మహనీయులు తాము పూజ, తపస్సు చేసుకోవటంకోసం శివ లింగాలను ప్రతిష్టించారు.  అలాంటి లింగాలు కాశీ క్షేత్రంలో ఎన్నున్నాయో తనకి కూడా తెలియదని పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఒక సందర్భంలో చెప్పాడుట.  ఇంతటి పుణ్యక్షేత్రం ఇంకొకటి వుంటుందా!?  ఇప్పటికీ అక్కడ ఎందరో మహనీయులు తపస్సు చేసుకుంటూ వుంటారు.  అందుకే ప్రతి హిందువూ తమ జన్మలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటారు.  కొందరైతే తమ అంతిమ శ్వాస అక్కడే విడవాలనికూడా తపన పడతారు.  ఎందుకో తెలుసా  పురాణోక్తి ప్రకారం  “కాశ్యాంతు మరణాత్ ముక్తి”   కాశీలో మరణించినవారికి అంతిమ సమయంలో సాక్షాత్తూ పరమేశ్వరుడే చెవిలో ఉపదేశం చేస్తాడుట.  దీనితో వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుందిట.  ఈ నమ్మకం మనవారిలో ప్రగాఢంగా వుండటంతో, అవకాశం వున్నవారు తమ జీవిత చరమాంకంలో కాశీలో గడుపుతుంటారు.  ఎంత గొప్పదో కదా ఈ కాశీ.

 

 

 

 

 

 

.. పి.యస్.యమ్. లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
 


More Kashi Yatra