వింధ్య పర్వతం గర్వమణిగింది!
మానవ విలువలకు సంబంధించిన అమూల్యమైన పాఠాలను చూడాలంటే ఎక్కడో వ్యక్తిత్వ వికాస పుస్తకాలలోనే కాదు... తరచి చూస్తే మన ఇతిహాసాలలోనే కోకొల్లలుగా ఉదంతాలు కనిపిస్తాయి. సరదా సరదాగా సాగిపోతూ చివర్లో చురుకు పుట్టించే కథలుగా దర్శనమిస్తాయి. కావాలంటే భారతంలో పేర్కొన్న ఈ వింధ్య పర్వతపు కథ చూడండి....
మన దేశంలోని ముఖ్యమైన పర్వతశ్రేణులలో వింధ్య పర్వతాలు ఒకటి! ఉత్తర దక్షిణ భారతదేశాలను విడదీస్తున్నట్లుగా మన దేశం మధ్యగా సాగుతాయి ఈ సమున్నత శిఖరాలు. అటు నుంచి ఇటు వైపు ఒక్క ఈగను కూడా దాటనివ్వనన్నట్లు ఉన్నతంగా ఉంటాయి. అసలు వింధ్య అంటేనే అడ్డుకోవడం అనే ఒక అర్థం ఉందట! అలాంటి వింధ్య పర్వతాలకు ఒకసారి గర్వం ఏర్పడింది. `సూర్యుడు నిరంతరం ఆ మేరు పర్వతం చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు కానీ నా శిఖరాన్ని విస్మరిస్తాడే?` అనుకున్నది వింధ్య. అనుకున్నదే తడవుగా ఆ సాయంత్రం వేళ సమయం చూసుకుని సూర్యుని నిలదీసింది కూడా.
`ఓ కర్మసాక్షీ! ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. నువ్వు ఆ మేరు పర్వతం చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటావు కానీ నా వంక చూసీ చూడనట్లు సాగిపోతావేం?` అని అడిగేసింది. `ఓ వింధ్యమా! నేను కేవలం లోకరీతిని అనుసరిస్తున్నాను. బ్రహ్మ ఆజ్ఞ మేరకు మేరు చుట్టూ పరిభ్రమిస్తూ ఈ లోకానికి వెలుగునీడలను అందిస్తున్నాను. ఈ రీతిని తప్పితే జీవుల మనుగడ అసాధ్యం అయిపోతుంది,` అని విన్నవించుకున్నాడు సూర్యుడు.కానీ వింధ్య, సూర్యుని వివరణలను వినే పరిస్థితిలో లేదు.
`అదంతా నాకు తెలియదు! లోకరీతి ప్రకారం నాలాంటి ఉన్నతులైనవారి మాట కూడా చెల్లుబాటు కావాల్సిందే కదా! అందుకని నువ్వు రేపటి నుంచి నా చుట్టూ కూడా తిరుగు,` అంటూ పంతం పట్టాడు. `అయ్యా అది నా వల్ల కానే కాదు! ఆ మేర పర్వతం మహోన్నతమైనది. పైగా సృష్టికర్తల ఆదేశం కూడా దానికి అనుకూలంగానే ఉంది. ఇక నేనేమీ చేయలేను,` అనేసి తన దారిన తను చక్కా పోయాడు సూరీడు. సూర్యుని మాటలకు వింధ్య అహం దెబ్బతిన్నది. `ఆ మేరు నాకంటే మహోన్నతుడా! అదీ చూస్తాను,` అనుకున్నది. వెంటనే తన రూపాన్ని ఇంతింతగా పెంచసాగింది. వింధ్య విజృంభణకు ఆకాశమనే హద్దు కూడా చెదిరిపోయింది. సూర్యచంద్రులు గతులు తప్పారు. లోకం అంధకారంలో మునిగిపోయింది. వింధ్య బరువుకి భూలోకమే గతి తప్పేలా ఉంది!
వింధ్య అహంకారపు విశ్వరూపాన్ని చూసిన దేవతలకు దిక్కు తోచలేదు. ఈ మహాప్రళయాన్ని తప్పించగల సమర్థుడు, సప్తరుషులలో ఒకరైన అగస్త్యుడే అనిపించింది. వెంటనే ఇంద్రుడు హుటాహుటిన అగస్త్యుని చెంతకు చేరుకుని తన చింతను వివరించాడు. ఇంద్రుని మాటలు విన్న అగస్త్యుని మోమున ఒక చిరునవ్వు విరిసింది. పిల్లవాడి కొంటె పనుల గురించి ఆరోపణలు వినే తండ్రిలా ఓ నవ్వు నవ్వాడు. ఆపై `ఓ స్వర్గాధిపతీ! నిశ్చింతగా నీ నగరానికి చేరుకో. వింధ్య సంగతి నేను చూసుకుంటాను,` అంటూ ఇంద్రునికి భరోసాని అందించి సాగనంపాడు.
అగస్త్యుడు వెంటనే తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్యను చేరుకున్నాడు. ఆ మహారుషిని చూసిన వింధ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. `మహాత్మా! నేను మీ చెంతకు తరలిరాలేనని మీరే నా జీవితాన్ని ధన్యం చేసేందుకు ఇక్కడకు వచ్చినట్లున్నారు. నేను మీకు ఏ విధంగా సేవ చేయగలనో ఆదేశించండి,` అంటూ వినయాన్ని పలికించింది. `ఓ పర్వతరాజమా! నేను కార్యార్థినై దక్షిణ దిక్కుగా వెళ్తున్నాను. మరి నువ్వేమో దారికి అడ్డుగా ఉన్నావయే! ఏమనుకోకుండా కాస్త తల వంచావంటే సులువుగా అటు పక్కకి చేరుకుంటాను,` అన్నారు అగస్త్యులవారు.
`ఓస్! అదెంత భాగ్యం!` అంటూ అగస్త్యుని మాటలకు తలవంచింది వింధ్య. వింధ్య శిరసు వంచడమే ఆలస్యం... అగస్త్యుడు అటుపక్కా చేరుకున్నాడు. ఆపై `మరో విన్నపం సుమా! నేను ఏ క్షణంలో అయినా తిరిగి రావచ్చు. నేను మళ్లీ తిరిగివచ్చే దాకా కాస్త ఇలాగే ఉన్నావంటే నేను సులువుగా ప్రయాణాన్ని పూర్తిచేసేయగలను,` అన్నారు అగస్త్యులవారు. `అయ్యో! అదెంత పని. మీరు మళ్లీ ఇటుగా వచ్చి, నన్ను దాటి వెళ్లేవరకూ... నేను ఇలాగే ఉంటాను,` అని మాట ఇచ్చింది వింధ్య. అగస్త్యునికి కావల్సింది ఆ మాటే! అలా వింధ్యను దాటుకుని దక్షిణ భారతానికి చేరుకున్న అగస్త్యుడు ఇక అక్కడే స్థిరపడిపోయాడు. వింధ్య తన మాటని నిలబెట్టుకునేందుకు, తలవంచుకుని ఉండిపోయింది. గర్వంలో మిడిసిపడేవారు చివరికి తలవంచుకోక తప్పదని వింధ్య గాధ రుజువు చేస్తోంది.
- నిర్జర.