శివ క్షేత్రాల్లో అపురూపం అమరావతీ ఆలయం
పంచారామాల్లో అమరారామం ఒకటి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి అమరలింగేశ్వర ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం - ఈ ఐదింటినీ పంచారామాలు అంటారు.
ఇప్పుడు మనం అమర లింగేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా అమరావతీ క్షేత్రంలో కొలువయ్యాడు అమర లింగేశ్వర స్వామి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం పగిలి, ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడ్డాయని, అవి దివ్యమైన పుణ్యక్షేత్రాలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఐదు పుణ్య క్షేత్రాలే పంచారామాలు.
పంచారామాల వెనుక ఉన్న కధను కొంచెం వివరంగా తెలుసుకుందాం. మందరగిరిని వాసుకి సర్పంతో సముద్ర మధనం చేసిన తర్వాత అమృతం వచ్చింది కదా! విష్ణుమూర్తి మోహినీ రూపం ధరించి అమృత భాండాన్ని చేపట్టి దేవతలకు, రాక్షసులకు పంచసాగాడు. అప్పుడు అమృతం అందరికీ సమానంగా లేదని, తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ రాక్షసులు ఆందోళన చెందారు. త్రిపురాసురులు, నాధుల నేతృత్వంలో తపస్సు చేశారు. బోళాశంకరుడు వారి తపస్సుకు ముగ్దుడై వరాలు ప్రసాదించాడు. ఇకనేం ఈ వరాలతో రాక్షసులు మరింత ఉత్తేజాన్ని పొంది, దేవతలను హింసించసాగారు.
కధ మళ్ళీ మొదటికొచ్చింది. దేవతలు శివునికి మొరపెట్టుకున్నారు. బోళాశంకరుడికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేడు కదా! శివుడు కాలరుద్రుడై రాక్షసులను, వారి రాజ్యాన్ని క్షణంలో బూడిద చేసి, త్రిపురాంతకుడు అయ్యాడు.
ఆ సమయంలో త్రిపురాసురుడు మింగిన పెద్ద లింగం ఐదు ముక్కలై, ఐదు ప్రదేశాల్లో ప్రతిష్టింపబడ్డాయి. ఈ ఐదు ప్రదేశాలూ పంచారామాలుగా వర్ధిల్లుతున్నాయి.
అమరావతిలో పడిన శివలింగం తునక ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టుగా పెరగసాగింది. అది చూసిన దేవేంద్రుడు శివలింగం పై తన గోరుతో పొడిచాడు. దాంతో శివలింగం పెరగడం ఆగిపోయింది. అయితే ఇంద్రుని గోరు గుచ్చుకుని శివలింగానికి రక్తం కారింది. ఆ రక్తపు చారల చిహ్నంగా ఇప్పటికే అమరావతి క్షేత్రంలోని శివలింగానికి గుర్తులు కనిపిస్తాయి.
శాతవాహనుల కాలంలో అమరావతీ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో అమరావతి వారి రాజధాని. ఈ నగరాన్ని ధాన్యకటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఈ పవిత్ర దేవాలయంలో అపురూపంగా మలచిన అనేక విగ్రహాలు ఉన్నాయి. అమరావతి దత్త క్షేత్రం కూడా. ఇక్కడ దత్తాత్రేయుని కూడా ఆరాధిస్తారు.
అమరావతి పుణ్యక్షేత్రం క్రుశ్న్నది పక్కనే ఉంది. భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించి, పునీతమై అమరేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో పై అంతస్తులో అభిషేకం చేస్తారు. అమరేశ్వర లింగం ఎంతో ఎత్తుగా ఉండటాన కిందినుండి అభిషేకం చేయడం వీలవదు. ఇక్కడి బాల చాముండేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
అమరేశ్వరునికి సంబంధించి మరో కధ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక చెంచు రాజుగారిని కొట్టి, ఆ చుట్టుపక్కల గ్రామాలను కొల్లగొట్టాడట. దాంతో రాజు కోపంతో ఊగిపోయాడు. సైనికులను పిలిచి చెంచు తెగవారిని హతమార్చమని ఆజ్ఞాపించాడు. సైనికులు వారందరినీ వరుసగా నిలబెట్టి, నిర్దాక్షిణ్యంగా తలలు నరికేశారు. దాంతో అమరేశ్వరునికి కోపం వచ్చింది. రాజు చేసిన పాపానికి శిక్షించాలి అనుకున్నాడు. అంతే, రాజు కంటిచూపు పోయింది. అంధుడైన రాజుకు తనముందు ఉన్న ఆహారం పురుగుల్లా అనిపించేది. దాంతో ఆయనకు ఆహారం అంటే వెగటు పుట్టింది. రాజు చిక్కిశల్యమైపోయాడు. మంత్రులు పండితులు, జ్యోతిష్యులను పిలిపించారు. వారు అధ్యయనం చేసి అసలు సంగతి చెప్పారు. అమాయకులను చంపడం మహా పాపమని, దాని ఫలితమే ఇదని సెలవిచ్చారు. ఇందుకు మానవమాత్రులు ఏమీ చేయలేరని, అమరేశ్వరుడు మాత్రమే కరుణించగలడని చెప్పారు.
రాజుకు కనువిప్పు కలిగింది. అమరేశ్వరునికి రోజుకు 11 సార్లు చొప్పున 11 రోజులపాటు అంకితభావంతో రుద్రాభిషేకం చేశాడు. అమరేశ్వరుడు సంతోషించి, రాజుకు తిరిగి చూపు తెప్పించాడు. అప్పుడే రాజుకు ఆహారం పురుగుల్లా కనిపించడం పోయి, మామూలుగా తినసాగాడు. అమరేశ్వరుడు రాజుగారికి కలలో కనిపించి, చెంచులను చంపిన ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించమని ఆజ్ఞాపించాడు. రాజు వెంటనే శివలింగాన్ని స్థాపించాడు.
పురాణ కధనాల సంగతి ఎలా ఉన్నా అమరావతి పరమ పవిత్ర క్షేత్రం. అమరేశ్వరుని దర్శించుకుంటే, అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల అపార విశ్వాసం.