సత్యాన్ని నమ్మినవాడు – ఋషిగా మారాడు!
వేదాలు అపౌరుషేయాలు అని నమ్ముతారు. అంటే వాటిని ఎవరూ ప్రత్యేకంగా రాయలేదనీ, స్వయంసిద్ధంగా వెలువడ్డాయనీ అర్థం. కానీ వేదాంతాలు అనదగ్గ ఉపనిషత్తులకి అనేకమంది కర్తలు ఉన్నారు. వేదాలలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక విషయాలను ఉపనిషత్తులు వెలువరించాయి అని కొందరు అంటే, అసలు వేదాలలో చెప్పకుండా వదిలేసిన విషయాలను ఇవి పూర్తి చేశాయి అని మరికొందరు అంటారు. ఏది ఏమైనా జ్ఞానసంబంధమైన గొప్ప చర్చలను లేవనెత్తిన పాఠాలు ఈ ఉపనిషత్తులు. ఉపనిషత్ మంత్రాలు జ్ఞానాన్ని సూటిగా చర్చించడమే కాదు. కొన్ని చక్కటి కథలను, ఉపమానాలను కూడా అందించాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది సత్యకామ జాబాలుని కథ. ఈ కథ ఛాందోగ్య ఉపనిషత్తులో కనిపిస్తుంది.
ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే జాబాలికి కూడా జ్ఞానాన్ని అర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని గౌతముడు అనే ఋషి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. ‘సరే నీ తల్లిదండ్రులు ఎవరో, నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు గౌతముడు. ఆ ప్రశ్నకి జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే చిన్ననాటి నుంచి అతను తన తండ్రిని ఎరుగడయ్యే! ఇక తన గోత్రమూ తనకు తెలియదు. అందుకని దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి గౌతముని ప్రశ్నలకు జవాబుని కోరాడు. ‘నాయనా! నిజానికి నీ పుట్టుకకు కారణం ఎవరో నాకు కూడా తెలియదు. నేను యువతిగా ఉన్నప్పుడు ఎందరితోనో గడిపాను. వారిలో ఎవరి గోత్రం నీదని చెప్పను! కానీ ఒకటి. నా పేరు జాబాల కాబట్టి నా కుమారుడమైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటూ వస్తున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా నీకు ‘సత్యకాముడు’ అన్న పేరుని అందిస్తున్నాను’ అని చెప్పి పంపింది.
తన తల్లి చెప్పిన మాటలను యథాతథంగా సత్యకామజాబాలి, గౌతమునితో చెప్పాడు. జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు. జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ అతనికి విద్యను అందించేందుకు సిద్ధంగా లేడు గౌతముడు. అందుకోసం జాబాలికి ఆవులు, ఆంబోతులు ఉన్న పశుమందను అప్పగించి. ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు.
గురువుగారి ఆదేశం మేరకు సత్యకాముడు పశువుల మందను మేపుతూ అడవులలో తిరగసాగాడు. కానీ అతని మేధోశక్తికి ప్రకృతిలోని ప్రతి అణువూ ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్ని ఇచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ, కాలం గడుపుతూ…. తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు సత్యకాముడు. ఇలా ఉండగా ఒకరోజున అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ ఆ బ్రహ్మతత్వంలోని భాగమే!’ అని చెప్పింది.
సత్యకాముడు ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండో పాదం’ అని విశదీకరించాడు. ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి వెలుతుర్ని ప్రసాదించే రూపాలు (అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు) కూడా బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి ఎగిరిపోయింది. ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది. అలా సత్యకాముడు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.
సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సుని అల్లంత దూరాన చూసిన గురువుగారు జరిగింది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అన్నారు. కానీ సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం లేశమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా సత్యకామునికి అందించాడు.
సత్యకాముని కథ కేవలం ఛాందోగ్య ఉపనిషత్తుతోనే ముగిసిపోలేదు. సత్యాకముడు, పిప్పలాదుడు అనే ఋషికి చెప్పిన మంత్రాలతో కూడిన ‘జాబాలి ఉపనిషత్తు’ కూడా ప్రముఖమైందే. ఇక రామాయణంలోనూ జాబాలి ప్రస్తావన వస్తుంది. అయితే జాబాలిని ఒక నాస్తికునిగా రామాయణం ఎంచుతుంది. తనలో ఉన్న బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందన్న జాబాలి భావన వల్ల అతడిని నాస్తికునిగా ఎంచి ఉండవచ్చు. అతనికి ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి అందించిన బ్రహ్మజ్ఞానంలోని సారం ఇదే కదా! నర్మదా నదీతీరాన జాబాలి తపస్సు చేసుకున్న ప్రాంతమే ఇప్పటి జబల్పూరుగా మారిందని చెబుతారు. తిరుమలలోని జాబాలి తీర్థం వద్ద కూడా ఆయన కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో గోత్రమంటూ లేని జాబాలి తనే ఒక గోత్రానికి స్థాపకుడు అయ్యేంతటి ఋషిగా మారాడు.
- నిర్జర.