కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం

Kalyana Venkateswara Swami Temple

 

తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళేదారిలో ఉంది. యాత్రికులు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రంలో వెలసిన దేవుడు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి. తిరుపతి నుండి బస్సు లేదా ఆటోలో ఈ గుడికి చేరుకోవచ్చు.


పద్మావతీ శ్రీనివాసుల పెళ్ళి అనంతరం కొత్త పెళ్ళికూతురైన పద్మావతిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖీ నది ఒడ్డునున్న అగస్త్యాశ్రమానికి విచ్చేస్తాదు శ్రీనివాసుడు. స్వర్ణముఖి, కల్యాణి, భీమనదుల త్రివేణీ సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.


అగస్త్యుడు నూతన దంపతులు ఆరు మాసాల వరకూ తీర్థయాత్ర క్షేత్ర సందర్శనం చేయడం నిషిద్ధం అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం శ్రీనివాసుడు తన ప్రయాణం ఆపుకుని అక్కడే ఉండి, ఆరుమాసాల తర్వాత మంగాపురం కాలిదారిగుండా పద్మావతిని తీసుకుని కొండకు వెళ్ళాడు. అలమేలుమంగ అయిన పద్మావతీదేవితో ఆరుమాసాలు విహరించిన స్థలంగా భక్తుల కోరిక మేరకు ఇక్కడ ''కల్యాణ శ్రీనివాసుని'' పేర వెలసి ఉండటంవల్ల ఇది ''శ్రీనివాస మంగాపురం'' అయిందని స్థల పురాణాలు రాస్తున్నాయి.


శ్రీనివాసుడు వెలసినందున శ్రీనివాస మంగాపురం అయినట్లే, అలమేలుమంగ వెలసి ఉన్నందున అలమేలుమంగాపురం అనే పేరు వచ్చింది. అలమేలుమంగాపురం, శ్రీనివాస మంగాపురం రెండూ తిరుపతి పట్టణానికి ఒకటి తూర్పున, రెండోది పశ్చిమాన అతి దగ్గర్లోనే ఉండటం విశేషం.


కల్యాణ శ్రీనివాసుని కిరీటంపై ఇతిహాసం

ఒకప్పుడు చంద్రగిరి రాజు ఈ శ్రీనివాసునికి పట్టు పీతాంబరాలతోబాటు, నగలను, కిరీటాన్ని కూడా బహూకరించి అలంకరించమని చెప్పి వెళ్ళాడు. దేవాలయ పూజారులు ఒక మంచిరోజు చూసి గుడి తలుపులు మూసి, గర్భగుడి ముందున్న మంటపంలో హోమగుండం నిలిపి హోమం చేసి, హవిస్సులు అర్పించి రాజు సమర్పించిన పట్టు వస్త్రాలను అగ్నికి అర్పిస్తారు. అలాగే ఒక్కొక్క నగను మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో వేస్తోంటే అవన్నీ లోపల దేవుడి విగ్రహానికి అలంకరించబడుతున్నాయట. ఈ విషయం తెలీని కొందరు వ్యక్తులు పరుగున వెళ్ళి రాజుకు ''మీరు దేవుడికి సమర్పించిన నగలూ నాణ్యాలన్నీ యజ్ఞాగుండానికి ఆహుతి చేస్తున్నారు'' అని చెప్పారట. రాజు ఇదేదో అప్రాచ్యపు పనిగా భావించి కోపోద్రిక్తుడై గుర్రంమీద వచ్చి ఆ దృశ్యం చూసి హతాశుడయ్యాడు. అప్పటికే అన్ని నగలూ, వస్త్రాలూ యజ్ఞగుండంలో ఆహుతైపోయి, చివరికి ఒక్క కిరీటం మాత్రమే మిగిలిపోయింది. రాజు పూజారుల దగ్గరికొచ్చి ఈ అకృత్యం ఆపమంటూ అరిచాడు. పూజారులు ''మేం మీరిచ్చినవన్నీ దేవునికి అర్పిస్తూ ఉన్నాం. కుండంలో వేసిన ప్రతిదీ లోపల దేవునికి అలంకరించబడుతున్నాయి. ఈ కార్యాన్ని మధ్యలో ఆపితే ఆ తర్వాత మిగిలిన కిరీటాన్ని దేవునికి అమర్చడం కష్టం'' అని చెప్పారు.


అయినా రాజుకు వారిపై నమ్మకం కుదరక బలవంతంగా తలుపులు తెరిపించి చూశాడు. వాళ్ళు చెప్పినట్లే కిరీటం తప్ప మిగిలిన నగలన్నీ దేవునికి అలంకరించబడి ఉండటం రాజు చూశాడు. ఆ కిరీటాన్ని మాత్రం అలాగే తిరుమలకు తీసికెళ్ళి అక్కడి వెంకన్నకు అర్పించారు. ఆ కిరీటం కొండపైన ఇప్పటికీ ఉందని చెప్తారు.


చారిత్రకాంశాలు

ఇది అతి ప్రాచీనమైన దేవాలయం. 1324 లో ఈ ప్రాంతంపై దండయాత్రలు చేసిన ఢిల్లీ సుల్తానుల కాలంలో ఇది దాడులకు గురై శిథిలమైపోయింది. అలా శిథిలమైన దేవాలయాన్ని తాళ్ళపాక అన్నమయ్య మనుమడు చిన్న తిరుమలాచార్యులు జీర్ణోద్ధరణ గావించి, ఆచార్య పురుషుల, ఆళ్వారుల, అన్నమాచార్య మొదలైన విగ్రహాలు ప్రతిష్ఠించబడినట్లు శాసనాలు తెల్పుతున్నాయి. ఆయనే నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేశాడని, 22.3.1540 నాటి శాసనం తెల్పుతోంది. ఇక అప్పటినుంచి దాదాపు 250 సంవత్సరాల వరకు దీని ప్రభ దేదీప్యమానంగా విలిగిపోయింది. తర్వాత చాలాకాలం పాటు పూజాపునస్కారాలు లేకుండా పుట్టలు పెరిగిన ఈ దేవాలయం 1940లో పునరుద్ధరించబడింది. ఆ తర్వాత అర్చకుల నుండి 1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించి, వైఖానసాగమ శాస్త్ర ప్రకారం నిత్యపూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.


తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల సందర్శనార్ధం బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు శ్రీనివాస మంగాపురం ఆలయానికి కూడా వెళ్తాయి.

 

Famous Kalyana Venkateswara Swamy Temple, Tirupati Srinivasa Mangapuram, Srinivasa Mangapuram Kalyana Venkateswara, Srinivasa Mangapuram famous pilgrimage, pilgrimage tour tirupati temples, Srinivasa Mangapuram pilgrimage


More Punya Kshetralu