భోగి మంటల్లో వెలిగే సంప్రదాయం

 

 

తెలుగునాట పెద్ద పండుగ అయిన సంక్రాంతికి భోగిమంటతోనే అంకురార్పణ జరుగుతుంది. నెలరోజుల ముందర నుంచే మొదలయ్యే పండుగ హడావుడి భోగితో తారస్థాయికి చేరుకుంటుంది. గూటికి చేరుకునే పక్షుల్లాగా ఎక్కడెక్కడివారో భోగికి ఒక రోజు ముందరగా తమ ఊళ్లకి చేరుకుంటారు. భోగినాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేస్తారు. ఈ కాలంలో విపరీతంగా ఉండే చలి నుంచి కాచుకునేందుకు ఏదో అడపాదడపా నెగళ్లు వేసుకున్నా భోగిరోజున తప్పనిసరిగా మంటలు వేసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది.


- సంక్రాంతి నుంచి సూర్యడు ఉత్తరాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యడు దక్షిణాయనంలో గడిపే చివరి రోజు భోగి. ఈ రోజున చలి తీవ్రత పరాకాష్టకి చేరుకుంటుంది. ఉత్తరాయనం మొదలయ్యే దగ్గర నుంచి రాత్రివేళలు తగ్గుతూ, చలి నెమ్మదిస్తుంది. రథసప్తమినాటికి పగటివేళలలో చురుకుదనం మొదలవుతుంది. అలా చలిమంట వేసుకోవడానికి అత్యంత అనువైన సందర్భంగా భోగి నిలుస్తుంది. 

 

- చలికాలంలో క్రిమికీటకాలు విజృంభిస్తాయి. అంతేకాదు! ఈ సమయంలో పంటల్లో కోతపనులు జరగడం వల్ల, అప్పటివరకూ పొలాల్లో ఉన్న చిన్నపాటి రెక్కల పురుగులన్నీ ఊళ్ల వైపు మళ్లుతాయి. భోగి మంటల వల్ల ఇవి నశించిపోవడమో, తిరిగి పొలాల వైపుకి మరలడమో జరుగుతుంది.

- సంక్రాంతికి నెలరోజుల ముందర నుంచే గొబ్బెమ్మలను చేసే సంప్రదాయం తెలుగునాట ఉంది. ధనుర్మాసంలో గోదాదేవి పాడిన పాశురాలని తల్చుకుంటామో లేదో కానీ… ఆ గోదాదేవికీ, ఆమె తోటి గోపికలకీ ప్రతిరూపంగా గొబ్బెమ్మలని రూపొందించడం మాత్రం మానము. గోమయంతో గొబ్బెమ్మలను చేస్తూ, గొబ్బి పాటలు పాడుకుంటూ ఆ భగవంతుని తల్చుకోవడమంటే కృష్ణభక్తిని ఇంటి ముంగిట నిలపడమే! అలా రూపొందించిన గొబ్బెమ్మలని పిడకలుగా చేస్తారు. ఆ పిడకలను భోగిమంటల్లో వేస్తారు. అలా వాటికి ఒక పవిత్రతను కల్పించడమే కాదు, ఒకప్పుడు ఆ పిడకల నుంచి లభించిన భస్మాన్ని దాచుకునేవాళ్లు కూడా! ఈ భస్మాన్ని అనేక చర్మవ్యాధులకు ఉపశమనంగా వాడేవారు.

- భోగిమంటలు భగభగ మండాలంటే పిడకలు, తాటిఆకులు వేస్తే సరిపోదు. అగ్ని దేవుని ఆకలి సామాన్యమైంది కాదు కదా! అందుకే ఇళ్లలో పాడైపోయిన చెక్క సామానంతా పోటీలు పడుతూ మరీ భోగిమంటల్లో వేస్తారు. మామూలుగా అయితే ఇంట్లో పేరుకుపోయిన ఇలాంటి చిన్నాచితకా సామాన్లను వదిలించుకోవడానికి మనసు ఒప్పుకోదు. కానీ భోగి రోజున ఈ మోహం కాస్తా మాయమైపోతుంది. పనికిరాని పాతని తగలబెట్టి కొత్త జీవితాన్ని ఆరంభించాలనిపిస్తుంది.

- చలికాలం అన్న మాట వింటేనే చాలు మనకి చెప్పలేనంత బద్ధకం వేస్తుంది. బారెడు పొద్దెక్కిన తరువాత కానీ దుప్పటి ముసుగు తీయము. అలాంటి చలికాలంలో తెల్లవారుజామునే లేచి నలుగురితో కలిసి సందడిగా భోగిమంటలు వేసుకోవడం ఒక గొప్ప అనుభూతిగా మిగిలిపోతుంది. ఒక పక్క పొగమంచు, మరో పక్క భోగిమంటల పొగ కలిసి ఒక గొప్ప అనుభవాన్ని మిగులుస్తాయి. ఇకపై బద్ధకాన్ని వదిలిపెట్టి రోజూ ఉదయాన్నే లేచేందుకు ప్రేరణనిస్తాయి.

- నిర్జర.

 


More Sankranti