మాతృమూర్తులకు మోక్షధామం మాతృగయ
మేము ఇటీవల ద్వారక, సోమనాథ్ వెళ్ళాము. ఎంతో ఆహ్లాదకరంగా సాగిన మా యాత్ర విశేషాలు గురించి నలుగురితో పంచుకోవాలనిపించింది. హైదరాబాద్ నుంచి ఒక గంట ప్రయాణం విమానం లో చేసి అహ్మదాబాద్ చేరుకున్నాము. అహ్మదాబాద్ ఏర్ పోర్ట్ నుంచి ట్రావలర్ వెహికల్ లో 12 మందిమి మాతృగయ చేరుకున్నాము. సిద్దపూర్ గుజరాత్ రాష్ట్రం లో ఉత్తరాన పాటన్ (Patan)జిల్లాలో వుంది. గుజరాత్ లో వున్న సిద్ద్ పూర్ నే మాతృ గయ అంటారు. మాతృగయ చాలా విశేషవంతమైన ప్రదేశం. ఇక్కడ గంగ సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. సిద్ద్ పుర్ పవిత్రమైన స్థలమని శ్రీ స్థల్ అని భావిస్తారు. పురాణాల కాలం నుంచి ఈ ప్రదేశ గురించిన ప్రస్తావన వుంది. పురాణాల ప్రకారం దధీచి మహర్షి తన అస్తికలను ఇంద్రుడికి సమర్పించిన ప్రదేశంగా కూడా చెబుతారు. పాండవులు ఇక్కడికి వచ్చినట్లు చెబుతారు. ఋగ్వేదం లోను దీని ప్రస్తావన వుంది
స్థల పురాణం :
బ్రహ్మ మానస పుత్రుడైన కర్దమ మహర్షి కి మనువు పుత్రిక దేవహుతికి వివాహం జరిగిన చోటు ఇదే అంటారు. . వీరికి తొమ్మిది మంది పుత్రికలు. వీరిని తొమ్మిదిమంది మహర్షులకి ఇచ్చి వివాహం చేశారు. వీరి పుత్రికలలో అనసూయ కూడా వుంది. అంతేకాదు ఈ దంపతులు చాలా కాలం తపస్సు చేసి విష్ణుమూర్తి చే భగవంతుడే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొందుతారు. ఆ పుత్రుడే భగవంతుడి అవతారమైన కపిల మహర్షి. పదహారేళ్ళ వయసులో కపిల మహర్షి తన తల్లికి వివరించిన సంఖ్యా శాస్త్ర సూత్రాలే కపిల గీత! గా ప్రసిద్ది చెందింది. తండ్రి కర్దమ ప్రజాపతి తన భోగ ఉపకరణాలు, సంపద అన్నీ వదిలి తపస్సు చేసుకోవడానికి వెళ్లి పోతాడు. దేవహుతి కుడా తన భర్త లేని ఈ సంపద భోగ వస్తువులు తనకి వలదనుకుని వైరాగ్యం తో కపిలుని వద్దకు వెళ్లి తను కూడా ఏమి చేస్తే మోక్షం పొంద గలనని వివరించమని అడుగుతుంది. అప్పుడు తల్లికి వివరించిన గీతోపదేశమే కపిల గీత .
తల్లి మరణానంతరం కపిలుడు తల్లి శ్రాద్ధ కర్మలు ఇక్కడే నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయ గా ప్రసిద్ది చెందింది. ఇక్కడే పరశురాముడు కుడా తన తల్లి శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. తల్లికి పెట్టే పిండ ప్రదానాలలో దాదాపు 20 చిన్న చిన్న పిండాలు పెడతారు . ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు, జీవితాన్ని ఇచ్చిన తమ తల్లికి కృతజ్ఞతగా ఇన్ని పిండాలు పెట్టిస్తారు. కొంతమంది 27 పిండాలు పెట్టిస్తారు. తెలిసి తెలియక తమ తల్లిని బాధ పెట్టినందుకు అంటే నవమాసాలు మోసినందుకు, కన్నందుకు, అన్నం తిననని మారం చేసినపుడు చదువు కునేటప్పుడు, ఇంకా అనేక విధాలుగా తాను చేసిన తప్పులు క్షమించినందుకు, కృతఙ్ఞతలు చెబుతూ పిండాలు సమర్పిస్తారు. తల్లికి మాత్రమె నిర్వహించే శ్రాద్ధకర్మలు నిర్వహించే ప్రదేశం ఇది ఒక్కటే! తమ తల్లికి పిండ ప్రదానం ఇక్కడ చేస్తే తల్లికి మోక్షం కలుగుతుందని అందరు నమ్ముతారు. మన సంప్రదాయం ప్రకారం పుత్రులు మాత్రమే తల్లికి కర్మకాండలు నిర్వహిస్తారు. చుట్టూ పక్కల కాని ఇక్కడ కొంతమంది స్త్రీలు కూడా తమ తల్లికి పిండ ప్రదానాలు చేస్తుంటారు.
బిందు సరోవరం:
మన భారత దేశం లో వున్న 5 పవిత్రమైన సరోవరాల్లో గుజరాత్ లోని బిందు సరోవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్ లోని మానస సరోవరం , రాజస్తాన్ లోని పుష్కర్ సరోవరం, కచ్ (గుజరాత్)లోని నారాయణ సరోవరం, కర్ణాటక లోని పద్మ సరోవరం. భగవంతుడు ప్రత్యక్షమైనపుడు దేవహుతి కనుల వెంట జారిన ఆనందాశ్రవులే బిందు సరోవరం గా మారింది అని, మరి కొంతమంది కపిలుడు బోధించిన గీత వల్ల ఆనందంతో రాలిన బిందువులే బిందు సరోవరం అని అంటారు. ప్రస్తుతం అక్కడి నీరు అపరిశుభ్రం గా వుంది. ఈ ఆలయాల కి పక్కనే అదే ప్రాంగణం లో గుప్త సరోవర్ అని పెద్దది వుంది. విశాలమైన ఆ తటాకం లో నీరు కూడా ఆకుపచ్చగా వుంది. అక్కడే వున్న అశ్వద్ద వృక్షంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారిచే మంత్రాలూ చెబుతూ ఒక చెంబుతో నీళ్ళు పోయించారు అక్కడి బ్రాహ్మలు. దీని significance తెలీదు కాని అందరు తమకి తోచిన దక్షిణ సమర్పించారు.
ముక్తి ధామ్:
ముక్తి ధామ్ గా పిలిచే ఈ సిద్దాపూర్ గ్రామానికి చుట్టుపక్కల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికి వచ్చి వారికి అగ్ని సంస్కారాలు చేస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. మరణించిన వారి అస్తికలను సరస్వతి నదిలో కలుపుతారు. అలాగే చివరి కర్మకాండలు నిర్వహించి మరణించిన వారికి ముక్తి ప్రసాదించమని వేడుకుంటారు. ప్రతి ఏటా వేలాదిమంది తమ మాతృ మూర్తులకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. గంధర్వ స్మశానం అని కుడా పిలుస్తారు ఇక్కడి స్మశానాన్ని. ఉజ్జయిన్, కాశీ, ప్రయాగ లలో కూడా ఇటువంటి ముక్తి ధామ్ వుంది.
రవాణా సౌకర్యాలు: సిద్ద్ పుర్ అహ్మదాబాద్ కి 114 కి.మీ, దూరం లో వుంది. ముంబై నుంచి ఆరావళి ఎక్స్ ప్రెస్, ఇతర ప్రదేశాలు ఓకా , డెహ్రాడున్, బెంగళూరు, మొదలైన ప్రధాన నగరాల నుంచి కూడా రైళ్ళు వున్నాయి. విశేషమైన చరిత్ర కలిగిన సిద్దపూర్ లో అక్కడ వున్నఉత్తరాధి మఠ్ లో అందరు (మగవారు మాత్రమే) తమ మాతృమూర్తులకి పిండ ప్రదానాలు చేశాక అక్కడే భోజనాలు ముగించాము. బిందు సరోవరానికి చుట్టూ కపిల, దేవహుతి, కర్దమ మహర్షి శివ, పార్వతి, గణపతి మొదలైన ఆలయాలు వున్నాయి. ఈ ఆలయాలు కాక దగ్గరలోనే సత్యనారాయణ మందిరం, శ్రీకృష్ణ ఆలయం, బాలాజీ మందిరం, ఇంకా ఎన్నో చిన్న చిన్న ఆలయాలు వున్నాయి....
.
...Maninath Kopalle