దానవ వంశానికి మూలపురుషుడైన ‘దనువు’కు... రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైనా.. గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న ఒకేఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు ‘పంచనదం’ అను మడుగులో దిగి ఒంటి కాలిమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతోపాటు వారిరువురి తపస్సుకూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్రతపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. అంతే.., మొసలి రూపం ధరించి, కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి, రంభుడు తీవ్రవేదనకు గురయ్యాడు. ఇంద్రుని చంపేయాలనిపించింది. కానీ, తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి.. శాంతచిత్తుడై ఆలోచించి., తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని., ఎడమచేతితో తన జుత్తు పట్టుకుని, కుడిచేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై., ‘రంభాసురా., ఏమిటీ నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో’ అన్నాడు.
‘హుతవాహనా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ, ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసికూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా దానవజాతికి తీరని మహాపరాథం చేసాడు. అందుకు ప్రతీకారంగా.,సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకలలోకవందితుడు, త్రిలోకవిజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు’ అని కోరుకున్నాడు రంభాసురుడు. ‘రంభాసురా., నీ మనసు ఏ కామినిమీద కామవశీభూతమౌతుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు’ అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యంలో యక్షవిహారభూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూసాడు. అక్కడ ఒక మహిషి(గేదె) కామార్తయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి, దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి, ఆ మహిషిని తన పాతాళనగరానికి పట్టమహిషిని చేసి, దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు.
ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూంటే, దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండుగర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహారభూమిని చేరి, అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగయితేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి, రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి, నిప్పుపెట్టారు. తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూంటే చూసి తట్టుకోలేక, ఆ రాజమహిషి పరుగుపరుగున వచ్చి, రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూండగా., ఆ చితిమంటలనుంచి ‘మహిషాసురుడు’ ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిష-రాక్షస సంగమ సంజాతుడు. ‘మహిషాసురుడు’ తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళరాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి ‘రక్తబీజుడు’ అనే పేరుతో ‘మహిషాసురుని’ ఆంతరంగిక అనుచరుడయ్యాడు.
- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం