కాళికా రూపంలో అంతరార్థం ఇదే.!
అమ్మవారి అవతారాలలో కాళిక అవతారం చాలా ప్రత్యేకమైనది. జగత్తులోని బ్రహ్మాండశక్తికి ప్రతీక కాళికా రూపం. వెల్లకిలా పడుకొన్న శివునిపై నిలబడినట్లు ఆమెను చిత్రీకరిస్తారు. ఏ మార్పూ చెందని బ్రహ్మానికి ప్రతీక శివుడు. ఆయన శాంతంగా, ఆత్మలీనుడై ఉంటాడు. తన వక్ష స్థలంపై జరుగుతున్న విలయతాండవం ఆయన ఎరుగడు. దేశకాల పరిధిలోనున్న విశ్వంలో చోటు చేసుకొంటున్న పరిణామం యావత్తుకూ శివుడే ఆధారం అని తెలియజేస్తుంది శివశక్తులు కలసి ఉన్న ఈ ప్రతిమ.
కాళిక రంగు ముదురు నీలం, లేదా కృష్ణవర్ణం. అది రంగులన్నిటినీ తనలో ఇముడ్చుకొంటుంది. అంటే అన్నీ కాళికలోనే ఉన్నాయి. కనుక కాళికరంగు అనంతత్వానికి ప్రతీక. శ్రీరామకృష్ణుల అభిప్రాయం ప్రకారం..
దూరం నుండి వీక్షిస్తే ఆకాశం, నీరు నీలంగా కనపడినా, దగ్గర నుండి చూస్తే ఏ రంగూ ఉండదు. ఆ విధంగానే దూరం నుండి చూస్తే, అంటే మనస్సు అశుద్ధంగా ఉంటే కాళిక కృష్ణవర్ణంలో కనపడుతుంది. కానీ ఉన్నత శ్రేణికి చెందిన సాధకులకు ఆమె వర్ణరహితం.
కాళిక అనంతరూపిణి. అనంతత్వాన్ని దేనితోను కప్పలేం కనుక, కాళిక దిగంబరి. దిక్కులే ఆమె అంబరాలు. ఆమె తన దీర్ఘశిరోజాలను విరబోసుకొని ఉంటుంది. కనుక ఆమెను 'ముక్తకేశి' అని పేర్కొన్నారు. ఒక్కొక్క శిరోజం ఒక జీవి. రక్తమోడుతూ, చంచలంగా ఉన్న నాలుక రజస్సును సూచిస్తుంది. ఆమె తెల్లని దంతాలు ఎర్రని నాలుకను నొక్కిపెట్టి ఉంచుతాయి. అంటే మనశ్చాంచల్యాన్ని సత్త్వగుణ సహాయంతో అదుపులో పెట్టాలి.
కాళిక వామహస్తంలో ఉన్న ఖడ్గం, తెగిన మానవ శిరస్సు సృష్టి నియమాలను ఉల్లంఘించే తన భ్రష్ట సంతానాన్ని ఆమె సంస్కరిస్తుందని తెలియజెప్పడానికి సంకేతం. రెండు దక్షిణ హస్తాలు వరదాభయాలను సూచిస్తాయి.
కాళిక ధరించే ముండమాలలో యాభై శిరస్సులు ఉంటాయి. సంస్కృత భాష కూడా ఏభై అక్షరాలతో కూడుకొని ఉంటుంది. ఈ అక్షరాలే శబ్దానికీ, భాషకూ పునాది. మన శ్రమను ఆమెకు అర్పిస్తే ఆమె సంతసిస్తుందని మానవ హస్తాల మేఖల సూచిస్తుంది.
కాళి త్రినయన. ఆమె మూడు కన్నులు త్రికాలజ్ఞతకు ప్రతీకలు. వదనారవిందంపై చిరునవ్వు. మెడలో ముండమాల. నడుము చుట్టూ తెగిన చేతులతో రచింపబడిన మేఖల. నోటి వెలుపలకు వచ్చి, ఆడుతున్న, నెత్తురు ఓడుతున్న నాలుక. క్రింది వామహస్తంలో నరకబడిన శిరస్సు, పై చేతిలో ఖడ్గం, కుడివైపు వరదాభయహస్తాలు. ఈ విధంగా, ఒక ప్రక్క భీషణం, మరొక ప్రక్క కారుణ్యం ప్రదర్శిస్తుంది.
ఈ లక్షణాలు ఒక ప్రక్క వైభవోపేతంగా, మరొక ప్రక్క భయోత్పాదకంగా ఉంటాయి. పోతే, వీటిని పరస్పర విరుద్ధాలుగా భావించకూడదు. జగన్మాతకు తన సంతానం పట్ల గల గాఢానురాగ ప్రేమలను ఇవి సూచిస్తాయి. ఆమె విద్య, అవిద్యల ద్వారా ఈ జగత్తులో వ్యవహరిస్తుంది. విద్యావిద్య, జీవన్మరణాలు, సుందర వికృతాలు, శుభాశుభాలు మొదలైనవి మన జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేసే ద్వంద్వాలు. ఇవన్నీ పరాశక్తి ప్రకటనలే, ఆమె ఆవిర్భూతాలే. ఈ జగత్తులో ఏదీ ఆమె కన్నా భిన్నం కాదు సమస్తానికి ఆదిమూలం ఆమే! ఇదీ కాళికా రూపం విశిష్ఠత.
*నిశ్శబ్ద.