శాకంభరి నవరాత్రులు ఎప్పటినుండి..పూజా విధానం ఏంటి!
సాధారణంగా అమ్మవారిని అలంకరించేటప్పుడు కొన్ని చోట్ల శాకంభరి దేవి అలంకారం చేస్తారు. శాకం అంటే కూరగాయలు. అమ్మవారికి ఆభరణాలతో కాకుండా కూరగాయలతో అలంకరణ చేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని చోట్ల శాకంభరి దేవి నవరాత్రులు జరుపుతారు. ముఖ్యంగా రాజస్ఠాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో శాకంభరి దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. ప్రకృతి ప్రాముఖ్యతను తెలిపే ఈ నవరాత్రుల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. శాకంభరి నవరాత్రుల గురించి, పూజా విధానం గురించి, ఈ నవరాత్రుల కథ గురించి తెలుసుకుంటే..
శాకంభరి నవరాత్రులు పుష్య మాసంలో అష్టమి నుండి పూర్ణిమ వరకు జరుపుకుంటారు. శాకంభరి దేవత ప్రకృతికి అనుబంధమైనది. ఈ దేవత ఆహారానికి, వృక్షాలకు అధిదేవతగా పరిగణించబడుతుంది. తీవ్రమైన కరువు సమయంలో ఆహారం, నీరు, కూరగాయలు వంటివి అనుగ్రహించడంలో ఈ దేవత కీలకమని నమ్ముతారు. ప్రకృతి ఇచ్చే ఆహారం పట్ల కృతజ్ఞత ఉండాలని శాకంభరి దేవత చెబుతుంది.
క్షుద్భాదను తీర్చేది శాకంభరి దేవత. శాకంభరి దేవత అన్నపూర్మ స్వరూపం. ఈ అమ్మను ఆరాధించడం వల్ల జీవితంలో శ్రేయస్సు, ఆనందం, ఆధ్యాత్మిక శాంతి లభఇస్తాయట. రైతులకు, వ్యవసాయానికి శాకంభరి దేవి చాలా ముఖ్యమైనది. ఈ అమ్మవారి అనుగ్రహంతో వ్యవసాయ భూమి సారవంతమై పంటలు బాగా పండుతాయని అంటారు. శాకంభరి నవరాత్రులలో ఉపవాసం ఉండటం, అమ్మవారి మంత్ర పఠనం వల్ల ఆత్మ శుద్ది అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
శాకంభరి నవరాత్రులు జనవరి 7వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రపరచడం, పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పూజ గదిలో కలశం ఏర్పాటు చేయడం, ఇంటిని మామిడి ఆకులు, కొబ్బరి ఆకులతో అలంకరించడం మొదలైనవి చేయాలి. తరువాత శాకంభరి దేవి విగ్రహం లేదా చిత్రపటంపై ఉంచి అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలి. నవరాత్రులు భక్తితో కొలవాలి. వీలున్నవారు ఉపవాసం చేయాలి. శాకంభరి అష్టకం దుర్గా సప్తశతి, దేవి మహత్యం వంటి అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేయాలి. పచ్చని కూరగాయలు, పండ్లు, ధ్యానం, పాలు.. మొదలైనవి అమ్మవారికి సమర్పించాలి. దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. నవరాత్రుల పూజ చేసిన తరువాత శాకంభరి దేవి కథ చదివి తరువాత కలశాన్ని నిమజ్జనం చేస్తారు.
*రూపశ్రీ.
