అష్టాదశ భుజాలతో, నవరత్నమణిమయ భూషణాలు ధరించి, సముజ్వల కాంతితో, సింహవాహినియై తమ ముందు సాక్షాత్కరించియున్న ఆ జగజ్జననిని చూసి ఇంద్రాది దేవతలందరూ పరిపరి విధాల ప్రస్తుతించారు. ఆ మహాదేవి దర్శనంతోనే మహిషుని పీడ తొలగినట్టుగా భావించారు. అప్పుడు మహేంద్రుడు వినయంగా చేతులు జోడించి., ఆమెతో ‘జగన్మాతా.,బ్రహ్మవరప్రసాదితుడైన మహిషాసురుడు సకల దేవతలను యుద్ధరంగంలో పరాజితులను చేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. యఙ్ఞయాగాదుల్లో దేవతలకు చెందవలసిన  హవిర్భాగాలను అపహరిస్తున్నాడు. మునిజనహింస, ధర్మనాశనం వాడి నిత్యకృత్యాలు. కామరూపియైన మహిషుడు స్త్రీ వధ్యుడు. వాడిని నీవే సంహరించాలి. నీవే మాకు దిక్కు. కాపాడు తల్లీ’ అని ప్రార్థించాడు. ‘దేవతలారా.. మీకందరికీ అభయం ఇస్తున్నాను. ధైర్యం వహించండి. చూసారా..విధి ఎంత బలీయమైనదో. పరాజయమే ఎరుగని త్రిమూర్తులంతటి వారుకూడా మహిషుని చేతిలో ఓటమిని రుచి చూసారంటే..అది కాలమహిమ కాక మరేమనాలి. అందుకే మహిషసంహారం కోసం నేను కాలంలో నుంచే ఉద్భవించాను. మహిషాసురుని నేను సంహరిస్తాను. ధైర్యం వహించండి’ అని మహాదేవి పలికి ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. ఆ భీకర ధ్వని దశదిశలు వ్యాపించింది. భూమి కంపించింది. మహాపర్వతాలు గడగడలాడాయి.మహాసముద్రాలు అల్లకల్లోల మయ్యాయి. ఇంద్రాదిదేవతలు సంతోషంతో జయజయధ్వానాలు చేసారు.

ప్రళయకాల కాలాభ్ర గర్జనలాంటి మహాదేవి వికటాట్టహాసధ్వని అలలు అలలుగా వచ్చి మహిషాసురుని కర్ణపుటాలను విద్యుద్ఘాతంలా తాకింది. మహిషుడు భయంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. కోపంతో అసహనంగా తనవారి వంకచూసి..‘ఎవరురా ఇంత భీకరంగా గర్జించింది. ఆ అహంకారిని వెంటనే బంధించి నా దగ్గరకు తీసుకుని రండి. వాడి అంతు చూస్తాను’ అని అరిచాడు. వెంటనే రాక్షస అనుచరులు నలుదిక్కులకు పరుగులెత్తి వెతకసాగారు. అప్పుడు వారికి అష్టాదశ భుజాలతో, వివిధాయుధాలు, సర్వాభరణాలు ధరించి, సింహవాహనం మీద కూర్చుని, మథుపానం చేస్తూ, వికటాట్టహాసం చేస్తున్న మహాదేవి కనిపించింది. ఆమెను చూడగానే దానవదూతలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగుపరుగున రెప్పపాటు వ్యవధిలో మహిషాసురుని ముందు నిలబడి.,మాటతడబడుతూండగా..‘దానవేశ్వరా.,ఆ వికటాట్టహాసం చేసినది దేవ,దానవ, సురాసుర,యక్ష,కిన్నెర,గంథర్వాది జాతులలో ఏ ఒక్కరు కాదు. ఆమె ఒక దివ్యాంగన. మధ్యస్థ యవ్వన. సువర్ణరత్నాభరణ విరాజిత. సింహవాహని. అంతరిక్ష సంచారిణి. మధుపాన మధిరాసక్త. దేవతల జయ జయ ధ్వానాలు చేస్తూంటే, ఆ సుందరాంగే  ఇంత భీకరంగా నవ్వుతోంది’ అని చెప్పారు. 

రాక్షసదూతల మాటలు వినగానే మహిషాసురుని మనస్సు కామవశీభూతమైంది. వెంటనే తన ప్రక్కనున్నఆంతరంగిక మంత్రి వంకచూసి ‘విన్నావు కదా మహామంత్రీ..  నీవు వెంటనే సర్వసేనాసమేతుడవై ఆ సుందరి దగ్గరకు వెళ్లి, నీ బుద్ధిచతురతతో సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి ఆ మోహనాంగిని బంధించి..వద్దు, వద్దు, సగౌరవంగా నా దగ్గ్రకు తీపుకుని రా’ అని చెప్పి పంపాడు. ఆ దానవమంత్రి చతురంగ బలాలతో ఆ జగన్మాత దగ్గరకు వెళ్ళి ‘ఓ మోహనాంగీ..నీ సుమనోహర దరహాస విలాసం మా ప్రభువుకు గిలిగింతలు పెట్టి మరులు రేకెత్తించాయి. అందుకే నన్ను నీ దగ్గరకు రాయబారిగా పంపాడు. నా దానవేశ్వరుడు జగదేకవీరుడు.సకలశస్త్రాస్త్రసమన్వితుడు. సురూప సుందరాకారుడు. త్రిలోకసార్వభౌముడు. నీ వయో,రూప, యవ్వనాలకు సార్థకత కలగాలంటే నీవు మా మహిషాసురుని చేపట్టి మన్మథుని మదమణచాలి’ అని మృదుమధురంగా పలికాడు. అప్పుడు ఆ జగన్మాత ...

‘దానవమంత్రివర్యా..నన్ను సామాన్య మానవకాంతగా భావిస్తున్నావు కాబోలు. నేను దేవమాతను. సర్వదైత్య సంహారంకోసం నేను ఉద్భవించాను. నీవు దూతవు కనుక, నా వీరత్వం నీ ముందు ప్రదర్శించక నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నీ ప్రభువు ఒక పశువు. ఆడదాని చేతిలో మరణం కోరుకున్న మూర్ఖుడు. అట్టి నీచునితో నాకు వివాహమా? వాడికి మరణం ఆసన్నమైంది కనుకనే నేను వచ్చాను. నీ ప్రభువుకు ప్రాణాలమీద ఆశ ఉంటే పాతాళానికి పోయి అఙ్ఞాతంగా జీవించమని నా మాటగా చెప్పు’ అని హుంకరించింది. ఆ హుంకారధ్వనికి ఆ రాక్షసమంత్రి భయంతో బెంబేలెత్తిపోతూ, వెనుతిరిగి చూడకుండా పరుగుతీసాడు.

- రాక్షసమంత్రి మాటలు విని మహిషాసురుడు పాతాళానికి పారిపోయాడా?
- లేక, జగజ్జనని చేతిలో మరణించాడా?
తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే, రేపు ఇదే‘వెబ్ సైట్’కి.. ‘లాగిన్’ అవ్వండి., చదివి ఆనందించండి.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం

 

   


More Durga Devi