వైభవ గోదావరి – 7
త్రివేణీ సంగమ తీరంలోని కాళేశ్వరం
మన రాష్ట్రాన్ని త్రిలింగ దేశమని అనేవారనీ, త్రిలింగ దేశమంటే శ్రీ శైలం లోని మల్లికార్జునుడు, ద్రాక్షారామంలోని భీమేశ్వరుడు, కాళేశ్వరంలోని ముక్తేశ్వరుడు .. ఈ ప్రఖ్యాతిచెందిన మూడు శివ లింగాల మధ్య వున్న ప్రదేశమని, ఆ త్రిలింగ అనే పదంనుంచే తెలుగు అనే పదం వచ్చిందని చిన్నప్పుడు చదువుకున్నది గుర్తున్నదా త్రిలింగాలలో ఒకటైన కాళేశ్వరం గురించి ఇప్పుడు....
ఆలయనిర్మాణం: కాళేశ్వరం తెలంగాణా రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లాలో మహదేవ్ పూర్ మండలంలో మారుమూల అటవీ ప్రదేశంలో గోదావరి ఒడ్డున నెలకొన్నది. ఇది హైదరాబాదునుంచి 280 కి.మీ.లు, కరీంనగర్ నుంచి 130 కి.మీ.లు, మంధని నుంచి 65 కి.మీ.లు, వరంగల్ నుంచి 110 కి.మీ.ల దూరంలో వున్నది. చారిత్రక ఆధారాల ప్రకారం కాళేశ్వరానికి రెండు వేల సంవత్సరాలపైగా చరిత్ర వున్నట్లు తెలుస్తున్నది. క్రీ.శ. 892-921లో చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మింపజేసినట్లు ఆధారాలున్నాయి. తర్వాత కాలంలో శిధిలమయిన ఆలయాన్ని కాకతీయులు పునరుధ్ధరించారు. కాకతీయ ప్రతాపరుద్రడు తాను బంగారంతో తులాభారం వేసుకుని ఆ బంగారాన్ని కాళేశ్వరస్వామి ఆలయానికి సమర్పించినట్లు శాసనాలద్వారా తెలుస్తున్నది. తర్వాత కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయ పోషణకు ఏర్వాట్లు చేశారు.
ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. వీటితోబాటు సరస్వతీనది కూడా అతర్వాహినిగా వున్నదనీ, అందుకే ఇది త్రివేణీ సంగమమని చెబుతారు. ఇక్కడ గోదావరికి ఒక ఒడ్డున కాళేశ్వరం, రెండవ ఒడ్డున మహారాష్ట్ర వున్నాయి. ఏ దేవతామూర్తి ఆవిర్భవించటానికైనా, ఏ పుణ్యక్షేత్రం అభివృధ్ధి చెందటానికైనా వెనక పురాణగాధలు, చారిత్రక సత్యాలు వుంటాయి. అందరూ వాటిని నమ్మినా, నమ్మకపోయినా ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన సత్యమొక్కటే. పూర్వం ఋషులు, మహా పురుషులు, రాజులు ఏ పని చేసినా ప్రజోపయోగం గురించే ఆలోచించేవారు. అలాగే ఈ క్షేత్రం వెనక పురాణగాధ ఏమిటంటే...
పురాణగాధ: పూర్వం ఒకసారి యమధర్మరాజుగారు ఇంద్రలోకం వెళ్ళి, ఆ లోక వైభవాన్ని చూసి, ఇంత వైభవోపేతమైన ఈ లోకాన్ని పొందాలనే మనుషులంతా పరమశివుణ్ణి ప్రార్ధించి ఇంద్రలోకం వెళ్తున్నారు, నా లోకానికి వచ్చేవారు తగ్గిపోయారని ఆలోచించి, ఇంద్రలోకంకన్నా గొప్ప నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. విశ్వకర్మని రప్పించి స్వర్గాన్ని మించిన అందమైన నగరం నిర్మించమని కోరాడు. విశ్వకర్మ గోదావరి ఒడ్డున అత్యంత వైభవోపేతంగా వుండేటట్లు కాళేశ్వరం నిర్మించాడు. ఆ నగరాన్ని చూసిన పరమ శివుడు సంతుష్టుడై అక్కడ నివాస మేర్పరచుకున్నాడు
.
కాళుడు (యమధర్మరాజు) చేత నిర్మింపబడి, ఈశ్వరుడు వున్న నగరం కనుక అది కాళేశ్వరం అయింది. భూలోకవాసులంతా పరమశివుణ్ణి సేవించి, పాప రహితులై స్వర్గలోకాన్ని పొందుతున్నారు. దానితో అక్కడి శివుడికి ముక్తేశ్వరుడనే పేరు వచ్చింది. పాపం యమధర్మరాజుగారి వ్యూహం ఫలించక ఆయన సరాసరి వెళ్ళి శివుడితోనే మొరపెట్టుకున్నాడు. స్వామీ, నువ్వు అందరికీ ముక్తిని ప్రసాదించేసరికి నాలోకానికెవరూ రావటంలేదు ఎలా అని. అప్పుడు శివుడు నువ్వు కాళేశ్వరం వెళ్ళి ముక్తేశ్వర లింగం వున్న పానువట్టం మీదనే ఇంకొక లింగాన్ని ప్రతిష్టించు. అక్కడికి వచ్చినవారు ఎవరైనా ముందు నువ్వు ప్రతిష్టించిన లింగాన్ని పూజించి తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజించాలి. అలా చేయనివారికి నీలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. యమధర్మరాజు శివాజ్ఞ ప్రకారం కాళేశ్వరం వెళ్ళి అక్కడ ముక్తేశ్వరుడి ప్రక్కన ఇంకొక లింగం ప్రతిష్టించాడు. కాళుడు ప్రతిష్టించిన లింగం కనుక కాళేశ్వరుడు. ఆలయం ప్రాంగణంలో వున్న యమకోణంనుంచీ దూరి వెళ్ళినవారికి యమబాధలు వుండవంటారు.
కాళేశ్వరుని అద్భుతం: ఇక్కడ ఒకే పానువట్టం మీద రెండు శివ లింగాలుండటానికి కారణం పైన చెప్పిన కధే. ఇక్కడికొచ్చినవారు ముందుగా కాళేశ్వరుణ్ణి అభిషేకించి, తర్వాత ముక్తేశ్వరుడిని పూజిస్తారు. ఇక్కడ ఇంకొక విశేషం ముక్తేశ్వర లింగానికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. దానిలో ఎంత నీరు పోసినా లోపలకి వెళ్తాయేగానీ ఆ రంధ్రాలు నిండవు. ఒకసారి ఆ చుట్టు ప్రక్కల ప్రదేశాలనుంచీ కడవలకొద్దీ పాలు తెప్పించి పోసి చూడగా అవి సంగమ ప్రదేశంలో కలిశాయిట. ఇక్కడ పార్వతీ దేవికి శుభానందాదేవి పేరుతో ప్రత్యేక ఆలయం వున్నది. ఉపాలయాలలో సరస్వతి, సూర్యుడు మొదలయినవారు పూజలందుకుంటున్నారు. ఇక్కడికి ఒక కిలో మీటరు దూరంలో పురాతన ముక్తేశ్వర ఆలయం వున్నది. నదీ సంగమం ఒడ్డున వున్న సంగమేశ్వరస్వామిని పూజించటంవలన ఉదర సంబంధమైన బాధలు తగ్గుతాయని ప్రతీతి. రేవు భద్రాద్రి రాముడు కొలువైన గోదావరీ తీరాన్ని దర్శిద్దాము.
దర్శన సమయాలు: ఉదయం 7 గం.లనుంచీ 12-30 దాకా, మధ్యాహ్నం 3-30 నుంచీ 6 గం.లదాకా.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)