మహిషాసురుని చేతిలో పరాజితులైన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వెంటబెట్టుకుని కైలాసంచేరి పరమేశ్వరునికి నమస్కరించారు. పరమేశ్వరుడు కూడా దేవతలందరి యోగ క్షేమాలు విచారించిన తర్వాత.. వారి ఆగమన కారణం గురించి అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహాదేవా., ఈ ఇంద్రాది దేవతలు మహిషుడి వల్ల స్వర్గపదభ్రష్ఠులై, అడవులబడి తిరుగుతూ, నానా క్లేశాలు పడుతున్నారు. ఈ విషయం నీకు తెలియనిది కాదు. నీవు సర్వసమర్థుడవు. నీవే దేవతలను కాపాడాలి’ అన్నాడు. అప్పుడు శివుడు పకపకా నవ్వి ‘ఇది మరీ బాగుంది., మహిషుడు కోరిన వరాలు ఇచ్చి, దేవతలను కష్టాలకు గురి చేసింది నువ్వు., వారిని కాపాడాల్సింది నేనునా. నేను మాత్రం ఏం చెయ్యను? మహిషుణ్ణి చంపడానికి నేనేం స్త్రీని కాదే. పోనీ నీ భార్యకు, నా భార్యకు యుద్ధంచేసే శక్తి ఉందా అంటే..అదీ లేదే. శచీదేవికి కూడా మహిషుడిని ఎదిరించే శక్తి ఉందని నేనే అనుకోను. అయినా స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును వదిలి మనమందరం సమాలోచన చేయడం మర్యాదకాదు. శ్రీహరి కార్యసాధకుడు. మహామేధావి. మనమంతా కలిసివెళ్లి శ్రీహరిని సలహా అడుగుదాం. ఆయన చెప్పినట్టు చేద్దాం. రండి’ అన్నాడు.

అందరూ కలిసి వైకుంఠం వెళ్లి శేషశయనుడైన శ్రీహరికి నమస్కరించారు. శ్రీహరి వారందరినీ స్వాగతించి., ఉచితాసనాలిచ్చి గౌరవించి, కుశలం అడిగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు తమతమ కష్టాలు శ్రీహరికి విన్నవించుకుని, కాపాడమని అర్థించారు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి..‘ఒకసారి మనమంతా కలిసి మహిషుడితో యుద్ధంచేసి వాణ్ణి గెలవలేక యుద్ధరంగం వదిలి వచ్చేశాం. కనుక వాణ్ణి గెలవలేం. బ్రహ్మదేవుడిచ్చిన వరానుసారం మహిషుడు స్త్రీ చేతిలోనే మరణిస్తాడు.కనుక మన దేవతాంశల తేజోశక్తులను ఏకం చేసుకుని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్టయితే..మహిషుడి మరణం తథ్యం. కనుక మీమీ తేజోంశలను  స్త్రీమూర్తులుగా అవతరించమని అభ్యర్థించండి. అలా అవతరించిన స్త్రీమూర్తికి మనందరి ఆయుధాలు సమర్పిద్దాం. సర్వతేజసమన్వితయైన ఆ స్త్రీమూర్తి ..,మహిషాసుర సంహారంచేసి మీ కఫ్టాలు తొలగించగలదు’ అన్నాడు. దేవతలందరికీ ఈ ఆలోచన బాగా నచ్చింది. అందరూ తమతమ తేజోంశలను స్త్రీరూపం ధరించమని అర్థించారు. అప్పుడు.., అప్పుడు..,

బ్రహ్మదేవుని ముఖం నుంచి., పద్మరాగమణిద్యుతులతో.,సమశతోష్ణకాంతులు జల్లుతూ, ఆకృతి దాల్చిన రజోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి అవతరించింది. పరమశివుని ముఖం నుంచి రజతకాంతులీనుతూ.. కన్నులు మిరుమిట్లు గొలిపే ప్రభలతో, భీకరంగా, పర్వతాకారంగా, మూర్తీభవించిన తమోగుణమా అన్నట్టు ఒక తేజోరాశి ఉద్ధవించింది. శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నీలిరంగు కాంతులతో, రూపు దాల్చిన సత్త్వగుణమా అన్నట్టు హిమానీరాకాసుధాసదృశ శీతల తేజస్సుతో ఒక తేజోరాశి ఆవిర్భవించింది. ఇలా ఇంద్రాది దేవతలందరి ముఖాలనుంచీ చిత్ర విచిత్ర వర్ణాలతో రకరకాల తేజోమూర్తులు అవతరించాయి. ఆ తేజోమూర్తులన్నీ కలిసి ఒక మహాతేజోమూర్తిగా రూపుదాల్చాయి. సకలదేవతేజో సముద్ధూత అయన ఆ స్త్రీ మూర్తి అపురూప సౌందర్యరాశి. ఆమె సృష్టిస్థిత్యంతమాతృక. సర్వ వ్యాపకురాలైన ఆమె సాకార నిరాకార, సగుణ, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప. ఏకరూప అయిన ఆమె, దేవకార్యసిద్ధి కోసం ఈ రూపం ధరించింది.

శంకరుని తేజస్సు...ఆమె ముఖకమలం అయింది.
యముని తేజస్సు...కుటిల నీలాలక కుంతలాలు(ఉంగరాల జుత్తు) అయింది.
అగ్నిదేవుని తేజస్సు...కృష్ణశ్వేతరక్త వర్ణాలుగల మూడు కన్నులయ్యాయి.
ఉదయ ప్రాతస్సంధ్యా తేజస్సులు...మన్మథ చాపాన్ని మరపించే ఆమె కనుబొమలు అయ్యాయి.
వాయుదేవుని తేజస్సు... ఆమె కర్ణాలయ్యియి.
కుబేరుని తేజస్సు...నువ్వుపూవును మరపించే ఆమె నాసిక అయింది.
ప్రాజాపత్య తేజస్సుతో...మల్లెమొగ్గల్లా ప్రకాశించే దంతాలయ్యాయి
సూర్యుని తేజస్సుతో... క్రింది పెదవి - కార్తికేయుని తేజస్సుతో...పై పెదవి ఏర్పడ్డాయి.
విష్ణువు తేజస్సుతో...అష్టాదశ భుజాలు(పదునెనిమిది చేతులు) ఏర్పడ్డాయి.
వసువుల తేజస్సుతో...ఆమె చేతులకు చిగురుటాకుల్లాంటి వేళ్ళు ఏర్పడ్డాయి.
చంద్రుని తేజస్సు...చక్కని వక్షోజద్వయమైంది.
ఇంద్రుని తేజస్సుతో...మూడు మడతలు గల మధ్యభాగం(పొట్ట) ఏర్పడింది.
పృథ్వీ తేజస్సుతో... ఆమెకు విశాల జఘనం ఏర్పడింది.
వరుణుని తేజస్సుతో... ఆమెకు కాళ్ళు ఏర్పడ్డాయి.
 
ఇలా సర్వావయవ సౌందర్యశోభతో, శుభాకార, సుస్వర, సురూప అయిన ఆ స్త్రీమూర్తిని చూసి సకల దేవతలు మహదానంద భరితులయ్యారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరి వంక చూసి..,‘మీమీ ఆభరణాలు, ఆయుధాలు ఆ మహాదేవికి కానుకగా బహూకరించండి’ అని ఆదేశించాడు. క్షీరసాగరుడు...ఎర్రని పట్టు వస్త్రాలను, సువర్ణ హారాన్ని,కోటిసూర్యప్రభాసితమైన చూడామణిని, రత్నమయ కుండలాలను, కడియాలనూ బహూకరించాడు.
విశ్వకర్మ...నవరత్న మణిమయ కేయూర, కంకణాలను సమర్పించాడు.
త్వష్ట...సుస్వర, సుమధురంగా ధ్వనించే నూపురాలను కానుకగా ఇచ్చాడు.
మహాసముద్రుడు...కంఠాభరణాలను, ఉంగరాలనూ బహూకరించాడు.

వరుణుడు...నిత్య నూతనంగా ఉండే పద్మాలతో, సుగంథ సంభరితంగా ఉండే దివ్య వైజయంతీమాలను సమర్పించాడు. హిమవంతుడు...నానావిధ రత్నాలతోపాటు బంగారు కాంతులీను సింహాన్ని ఆమెకు వాహనంగా సమర్పించాడు.


శ్రీహరి...తన సుదర్శన చక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు.
శివుడు...తన త్రిశూలం నుంచి మరొక త్రిశూలాన్ని సృష్టించి ఇచ్చాడు.
వరుణుడు...శ్వేత చంద్రికలు వెదజల్లే  శంఖాన్ని, పాశాయుధాన్ని సమర్పించాడు.
అగ్నిదేవుడు...శతఘ్నిని బహూకరించాడు.
వాయువు...దివ్య దనుస్సును, అక్షయతూణీరాలను సమర్పించాడు.
దేవేంద్రుడు...తన వజ్రాయుధం నుంచి మరొక వజ్రాయుధాన్ని సృష్టించి ఇచ్చాడు.
యముడు...కాలదండాన్ని, ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును బహూకరించగా..,
బ్రహ్మదేవుడు పవిత్ర గంగాజలపూర్ణమైన కమండలాన్ని కానుకగా ఇచ్చాడు.
విశ్వకర్మ...గండ్రగొడ్డలిని  బహూకరించాడు.
కుబేరుడు...సురాపూర్ణమైన సువర్ణపాత్రను సమర్పించాడు.
త్వష్ట...చిరుగంటలు పొదిగిన కౌమోదకి అనే గదను, దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని కానుకగా ఇచ్చాడు.
సూర్యుడు...తన తేజస్సులను బహూకరించాడు.

ఇలా దివ్యాభరణాలతో..నానావిధ ఆయుధాలతో విరాజిల్లుతున్న ఆ జగజ్జనని చూసి సకల దేవతలు పరమ సంతుష్టులై ఇలా కీర్తించారు.

         నమః శివాయై కల్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమోనమః
         భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః 
         కాళరాత్ర్యై తథాంబాయా ఇంద్రాణ్యై తే నమోనమః
         సిధ్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమోనమః

ఆ సర్వమంగళ,  ఆ చతుర్దశ భువనాధీశ్వరి, ఆ జగజ్జనని, ఆ త్రిలోకైక వందిత, ఆ పరమపావని, ఆ కరుణా రసపూర్ణ త్రిలోచని, ఆ ఆర్తత్రాణపరాయణి, సకల దేవతల వంక చిరునవ్వులు చిందిస్తూ చూసి, అభయాశీస్సులు అందించింది.
                
- ‘మహాసంగ్రామానికి’ ముహూర్తం ముందుంది.
-  వీర,శృంగార,విక్రమ స్వరూపిణి అయిన ‘జగజ్జనని’ ప్రచండ పరాక్రమ విలాస వైభవాన్ని చదవాలని ఉవ్విళ్ళూరుతున్నారు కదూ.
అయితే, రేపు ఇదే‘వెబ్ సైట్’కి.. ‘లాగిన్’ అవ్వండి., చదివి ఆనందించండి.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం





More Durga Devi