వైభవ గోదావరి - 2
గోదావరి పుట్టిన త్రయంబకం
గోదావరి పుట్టింది మహారాష్ట్రలోని త్రయంబకంలో అని తెలుసుకున్నాముకదా. ఇవాళ త్రయంబకంలోని త్రయంబకేశ్వరుని ఆలయం గురించి కూడా చెబుతానన్నాను. ముందుగా తల్లి గోదావరికి నమర్కరించి, ఆవిడ జన్మస్ధలం గురించి తెలుసుకుందాము. త్రయంబకం మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో వున్నది. ఇక్కడ వున్న బ్రహ్మగిరి అనే పర్వత శిఖరం పైనే గోదావరి ఆవిర్భవించింది. ఆవిర్భవించింది అంటే ఆవిడేమీ ఆ పర్వతంమీద రాళ్ళు తప్పించుకుంటా బాపూగారి సినిమాలో గంగావతరణలాగా అలా అలా తేలిపోతూ, సాగిపోతూ రాలేదు. దానికీ ఒక కధ వున్నది. అదేమిటంటే......
పూర్వం గౌతమ మహర్షి, తన భార్య అహల్యతో ఇక్కడ తపస్సు చేసుకుంటూ వుండేవారు. ఒకసారి ఆ ప్రాంతమంతా చాలా తీవ్రమైన కరువు వచ్చింది. నీరు లేక, పంటలు పండక, ఆహారం లేక, అక్కడ నివసించే మిగతా ఋషులంతా పొట్ట చేతబట్టుకుని దిక్కుతోచిన విధంగా పోసాగారు. ఇది చూసి గౌతమ మహర్షికి చాలా బాధ కలిగి తన తపస్సెక్తిద్వారా వారి ఆకలి తీర్చసాగాడు. గౌతముడు చేస్తున్న ఈ మంచి పనులవల్ల ఆయనకి పుణ్యం పెరిగి, తన ఇంద్రపదవికి ఎక్కడ పోటీ వస్తాడోనని ఇంద్రులుంగారు ఒక మాయ ఆవుని సృష్టించి గౌతముని పొలాలని విధ్వంసం చెయ్యమని పంపుతాడు. ఆది తెలియని గౌతముడు దానిని సున్నితంగా అదిలించటానికి దర్భతో అలా అంటాడు. ఆ ఆవు మరణించింది. (ఈ మాయ ఆవుని పంపింది తోటి ఋషులని, వినాయకుడని రకరకాలుగా చెబుతారు.
ఎన్నో యుగాలక్రితం జరిగినది కదండీ ఆమాత్రం ఉప కధలు విస్తరిల్లుతాయి. మనకి కావలసినది మాయ గోవుని గౌతముడు దర్భతో అదిలించటంవలన అది చనిపోయింది.) గౌతమునికి గో హత్యా పాపం వస్తుంది. ఆయన ఇంట్లో అక్కడి బ్రాహ్మణులెవరూ భోజనం చెయ్యరు. దానికి బాధ పడిన గౌతముడు గోహత్యా దోష నివారణ మార్గం చెప్పమని కోరుతాడు. మిగతా ఋషులు పరమ శివుణ్ణి ప్రార్ధించి, ఆయన జటాజూటంలోని గంగని వదలమను. ఆ గంగలో స్నానం చేస్తే గోహత్యా దోషం పోతుందని చెబుతారు. గౌతముడు బ్రహ్మగిరిమీద శివుడికోసం తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుణ్ణి గంగని విడిచి పెట్టమని కోరుతాడు. ప్రసన్నుడైన శివుడు సరేనంటాడుగానీ, గంగాదేవి శివుని జటాజూటం వదలటానికి ఇష్టపడదు. శివుడు ఆగ్రహంతో తాండవం చేయగా జటాజూటం దాటి వచ్చింది గంగమ్మ.
కానీ గౌతముడు స్నానం చెయ్యటానికి వీలు లేకుండా అతనికి అందీ అందకుండా, కనిపించీ కనిపించకుండా మాయంకాసాగింది. గౌతముడుమాత్రం సామాన్యుడా!? మహా తపస్సంపన్నుడు. ఆయన కుశలను తీసి గంగ చుట్టూ వర్తులాకారంగా చుట్టి దీనిని దాటిపోరాదు అని అన్నాడు. పాపం గంగ ఏమీ చెయ్యలేకపోయింది. అదే కుశావర్తం. త్రయంబకేశ్వర ఆలయం వెనుక వున్న పుష్కరిణి. ఇక్కడ నీరు ఎప్పుడూ ఉబుకుతూ వుంటుంది. బ్రహ్మగిరినుంచి గంగ ముందు ఇక్కడే నేలకు దిగింది, ఇక్కడ అదృశ్యమయ్యే గోదావరి ప్రవాహం నాశిక్ దగ్గర ఉధృతమవుతుంది.
గో హత్యా దోషం పోగొట్టటానికి శివ జటాజూటంనుంచి కిందకి దిగిన గంగమ్మ ఆ గోవుమీదనుంచి పారంటంతో గోదావరి అనే పేరు వచ్చింది. గౌతముడు రప్పించాడు కనుక గౌతమి అయింది. గౌతముడు గోహత్యా దోషంనుంచి విముక్తుడైన ప్రదేశం కుశావర్తంకనుక ఇక్కడ చేసే అనేక శాంతులు, పితృకార్యాలు అమిత ఫలితాన్నిస్తాయంటారు. ముఖ్యంగా ఇక్కడ మాత్రమే చేసే నారాయణ నాగబలి వలన దీర్ఘకాల అనారోగ్యం, తీవ్ర ఆర్ధిక బాధలు, సంతానలేమి, ఇంకా అనేక తీవ్రమైన ఈతిబాధలు తొలగి పోతాయంటారు. ఇది మూడు రోజుల కార్యక్రమం, పైగా కొన్ని నిర్దిష్టమైన రోజులలో మాత్రమే చెయ్యాలి. అలాగే కాల సర్ప దోషానికి శాంతి, ఇంకా అనేక పూజలు భక్తులు ఇక్కడ చేయించుకుంటారు. ఈ కుశావర్తం ఒడ్డున చిన్న శివాలయం వున్నది.
మొదటిసారి వెళ్ళినప్పుడు గోదావరి పుట్టిన ప్రదేశాన్ని చూడాలని అత్యంత ఆసక్తితో మేము 720 మెట్లెక్కి గోముఖ్ అనే ప్రదేశాన్ని చేరుకున్నాము.
అక్కడ గోదావరికి చిన్న ఆలయం, గోవు ముఖం వున్నాయి. ఆ గోవు నోట్లోంచి సన్న ధారగా నీరు వస్తుంది. అన్నారు. మేము వెళ్ళినప్పుడు సన్నగా కాదుకదా ఒక్క చుక్కకూడా రాలలేదు. కానీ అక్కడున్న చిన్న గుంటలో కొన్ని నీళ్ళున్నాయి. నీరసంగా తిరిగి వస్తుంటే దోవలో ఎవరో చెప్పారు ఆ పక్కన వున్న కొండమీదకెళ్తే నీళ్ళు రావటం కనబడుతుంది, అదే గోదావరి జన్మస్ధలమని. గౌతముడితో ఆడుకున్నట్లు మనతోకూడా ఆడుకుంటోంది గంగమ్మ. ఎండలో అన్ని మెట్లెక్కినా దర్శనమివ్వలేదు అనుకున్నాము. సరైన సమాచారం లేకపోతే వచ్చే తిప్పలు ఇవ్వేనండీ.
గోదావరి జన్మ స్ధలం గురించి తెలుసుకున్నాంకదా. ఇప్పుడు ఇక్కడ వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వరుడి గురించి తెలుసుకుందాము.
త్రయంబకేశ్వర ఆలయం
నాశిక్ జిల్లాలో నాశిక్ కి 28 కి.మీ. ల దూరంలో వున్న త్రయంబకంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన త్రయంబకేశ్వరుడు కొలువుతీరి వున్నాడు.
ఆలయ నిర్మాణం
ఈ ఆలయ నిర్మాణం ముందు హేమాడ్ పంతీ శైలిలో కట్టబడింది. తర్వాత దీనిని మరాఠా పేష్వా నానా సాహెబ్ పునరుధ్ధరించారు. విశాలమైన మైదానంలో 270/217 అడుగుల విస్తీర్ణంలో నిర్మింపబడిన ఈ మందిరం బయట నక్షత్రాకారంలో వుంటుంది. ఈ నిర్మాణానికి పూర్తిగా నల్లరాతిని వుపయోగించారు. క్రీ.శ. 1755-1786 మధ్య ఈ మందిర నిర్మాణం జరిగింది.
త్రయంబకేశ్వరుడు
గర్భగుడిలో పానవట్టంపై ఒక గుంటలాగా వుంటుంది. ఈ గుంటలో ఎప్పుడూ నీరు వూరుతూనే వుంటుంది. అందులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా మూడు చిన్న లింగాలు వుంటాయి. అయితే ఈ మూడు లింగాల గురించి అనేక వ్యాఖ్యానాలున్నాయి.
అంబక అంటే కన్ను అని అర్ధం. త్రయంబకేశ్వరుడంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని .. ఈ మూడు తేజస్సులు నేత్రాలుగా వెలిసిన దేవుడు. శివుని ఫాలభాగంలో వుండే మూడో నేత్రం అగ్ని. ఈ నేత్రంతోనే ఆయన మన్మధుణ్ణి దహించింది.
స్వర్గం, ఆకాశం, భూమి అనే మూడు స్ధానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు, అందుకే అలా మూడు లింగాల రూపంలో వున్నాడని కొందరంటారు.
పరమేశ్వరుడు నిష్ట, జ్ఞానం, న్యాయానికి ప్రతిరూపం. వాటి ప్రతీకలుగానే ఇక్కడ ఈ రూపంలో వెలిశాడని ఇంకొందరు. అభిషేక సమయంలో ఈ మూడు లింగాలను చూడవచ్చు. జనం ఎక్కువగా వుండి సరిగా కనబడకపోతే దిగులు చెందకండి. గర్భగుడి ఎదురుగా గోడపైన వున్న అద్దంలో చూడండి...స్పష్టంగా దర్శనమిస్తాడు స్వామి.
ఈ పానవట్టంమీద పంచముఖ శివుని విగ్రహం పెట్టి దానికి ఇదివరకు విశేష సందర్భాలలో వజ్రకిరీటం అలంకరించేవారుట. ఆ వజ్ర కిరీటం పాండవాగ్రజుడు ధర్మరాజు చేయించాడని ప్రతీతి. ప్రస్తుతం అది వదులు అవటంతో భద్రపరచి సోమవారాలు భక్తులకు దర్శనావకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక్కడ భైరవుడు, నీలాంబిక, దత్తాత్రేయుడు వగైరావారి ఉపాలయాలున్నాయి.
గోదావరి జన్మస్ధలం, జ్యోతిర్లింగ దర్శనం అయిందికదా. రేపు నాసిక్ లో గోదావరి పరవళ్ళు, రామగాధలు దర్శిద్దాము.
- పి.యస్.యమ్.లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)
Godavari Pushkaralu
History of Indian Festival Pushkaram