• Next
  • ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 13 The Diary of LEKHA GUMMADI - 13

    ది డైరీ ఆఫ్ లేఖా గుమ్మడి - 13

    The Diary of LEKHA GUMMADI

     

    కొందరు ఎక్కువ మాట్లాడరు. తెగ బిల్డప్పులివ్వరు. అతి మామూలుగా, నిగర్వంగా, నిరాడంబరంగా ఉంటారు. కానీ వాళ్ళ మాటలు చాలా బాగుంటాయి. ఆలోచింపచేస్తాయి.

     

    పీ.గారు ఏ విషయానికీ ఎక్కువ ఆవేశపడరు. ఎందులోనయినా డిఫర్ అయినా చాలా నెమ్మదిగా తన అభిప్రాయం చెప్తారు. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కోపంతో చెలరేగిపోయే తత్వం కాదు.

     

    పీ.గారిది తెలంగాణా అనుకోలేదు. అతని మాటతీరు భలే మోసం చేస్తుంది. దాంతో ఒకసారి మాటల మధ్యలో "బుద్ధిలేక ఫలానా దాంట్లో అప్లై చేశాను.. టాలెంటు, ఎక్స్ పీరియన్స్ ల గురించి పొరపాటున కూడా అడగలేదు.. నేటీవ్ ప్లేస్ ఏదని అడిగి, ఆంధ్రావాళ్ళకి ఇవ్వడంలేదని చెప్పారు.. ఒళ్ళు మండిపోయింది.. అదే, ఆంధ్రా వాళ్ళయితే చాలా లిబరల్ గా, అందరికీ ఛాన్స్ ఇస్తారు..'' అంటూ నా కోపం వెళ్ళగక్కాను.

     

    అంతా కూల్ గా విని.. ''అసలు తెలంగాణా ఇస్తే ఈ తేడాలు, గొడవలు, ఘర్షణలు, రాద్ధాంతాలూ ఏమీ ఉండవు. అప్పుడు అందరూ కలిసికట్టుగానే ఉంటారు. ఇవ్వకపోబట్టే ఈ చెత్త పేరుకుపోతోంది..'' అన్నారు.

     

    ఈ సంగతి ఇంట్లో చెప్తే ''ఇంకానయం.. తెలంగాణా వాళ్ళని narrow minded మనుషుల కింద జమ కడ్తారా ఖబర్దార్'' - అంటూ తల్వార్ తో పొడవలేదు..'' అంటూ నవ్వేశారు.

     

    పీ. గారు ఇంకో సందర్భంలో ''మీ ఆంధ్రా వాళ్ళకి ఉన్నంత ఆశ మా తెలంగాణా వాళ్ళకి ఉండదు.. అందుకే మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు సామాన్యంగా ఉద్యోగాలు చేయరు..'' అన్నారు.

     

    ఇది మహా కాంట్రవర్షియల్ స్టేట్ మెంట్.. ఒకరకంగా ఆడవాళ్ళు job చేయకపోతే సుఖంగా, శాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే ఉద్యోగం చేసినా చేయకపోయినా ఇంటి పనులు తప్పవు కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. కానీ, ఉద్యోగం లేకపోతే financial freedom ఉండదు.. పైగా కెరీర్ అసలే ఉండదు.. వంట, అంట్లు తప్ప ఇంకో జీవితం ఉండదు.. personality development, personal development అన్నీ తుంగలో తొక్కాల్సిందే. కానీ ఈ రకమైన వాదాలు అన్నిసార్లూ, అందరిముందూ చేయాలనిపించదు.

     

    ఒకసారి గణేష్ గారు కూడా అంతే.. ''నాకు జీవితంలో పెద్ద ఆశలు, ఆశయాలు ఏమీ లేవు.. బతుకుతెరువుకు లోటు లేకుండా పొలంపుట్రా ఉన్నాయి. కాలక్షేపానికి ఈ ఉజ్జోగం ఉంది.. (ఆయన అలాగే అంటారు).. ఇద్దరు పిల్లలు, ఒక పెళ్ళాం.. ఇంతకంటే ఇంకేం కావాలి?” అన్నారు.

     

    ''అసలు ఈ రోజుల్లో సైకిల్ మీద రావడమేంటి.. హాయిగా పల్సర్ కొనుక్కోవచ్చుగా …'' అన్నారెవరో.

     

    “సైకిల్ని తలదన్నేది లేదు, రాదు.. పెట్రోలు, డీజిలూ తాక్కుండా నడుస్తుంది.. సైకిల్ దీపాలు, లైట్లు లాంటిది కాదు, సూర్యుడిలా స్వయం ప్రకాశం.. పైగా సైకిల్ తొక్కడం ఆరోగ్యం.. ఏ జబ్బులూ రావు..'' అన్నారు.

     

    మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా మంచివాళ్ళే కాదు, మాటకారులు కూడా. వాళ్ళతో నా అభిప్రాయాలు కలిసినా, కలవకపోయినా పేచీ లేదు. అసలయినా అందరి ఆలోచనలూ ఒకలా ఉంటే క్లాస్ రూంలో యూనిఫాంలా బోర్ కొట్టదూ?! ఎవరి ఆలోచన వారిది. ఎవరిష్టం వాళ్ళది. ఇష్టాయిష్టాలు కలవనంతలో కలబడతామా, కర్రలు పట్టుకు తన్నుకుంటామా? ఆ తేడాలు ఎత్తి చూపుకుంటూ కూడా హాయిగా నవ్వుకోవచ్చు. అదీ సంగతి.

     

    Diary writing art, fun in diary writing, art of diary writing, humorous diary, funny incidents in diary

  • Next