• Prev
  • Next
  • Prema Pandem part 37

     

    అతను నవుతూ ఆమె ప్రక్కన కూర్చున్నాడు. వెంటనే ఆమె తన మొహంలోని ఫీలింగ్ మార్చేసి సీరియస్ గా పెట్టి “ఆవునుగానీ నువ్వు అంత బిజీ మనిషివి అయిపోయావా? రెండు రోజులనుండి ఫోన్ కూడా చెయ్యలేదేం?’’ అంటూ అడిగింది. “ఈ రెండ్రోజులూ చాలా చికాకులో వున్నాను ... ఆఫీసులో లోన్ శాంక్షన్ చేయించుకునే గొడవలో వున్నాను ...’’ అంటూ అతను ఆత్మానందంని కలవడం జనరల్ మేనేజర్ కి తన కేసు రికమెండ్ చెయ్యడం మొదలైన విషయాలన్నీ ఆమెకు చెప్పాడు. అంతా విని ఆమె నిట్టూర్చింది. “మీ ఆఫీసులో నీకు లోన్ ఎట్టి పరిస్థితిలో శాంక్షన్ కాదు. నాకు తెలుసు’’ అంది. “ఎలా?’’ ఆశ్చర్యంగా అడిగాడతను. “మీ జనరల్ మేనేజర్ మా నాన్నగారికి ఫ్రెండు. మా నాన్నగారు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను ... మా నాన్నగారు ఆయనతో అన్నారు నీకు ఆఫీసులో ఏ విధమైన లోనూ శాంక్షన్ కాకుండా చూడమని.’’ “ఇది అన్యాయం ... అక్రమం’’ అరిచాడతను.

    “అసలు నేను వెంటనే మా నాన్నగారితో పోట్లాట పెట్టుకుందామని అనుకున్నాను ... కానీ అది లాభం లేదని వూరుకున్నా ... ఆయన టెలిఫోన్ సంభాషణ విననట్టే ప్రవర్తించాను ... ఆయన ఎత్తుకు పైఎత్తు వేయాలేగానీ పోట్లాట పెట్టుకుని ప్రయోజనం లేదు ... అప్పుడు అసలు మొండికేస్తారు నువ్వు చచ్చినా ఆ అబ్బాయిని చేసుకోడానికి వీల్లేదు అని అంటారు’’ “మరిప్పుడు ఏం చేయాలి?’’ అడిగాడతను. “అది చెప్దామనే వచ్చాను. నాకు ఆంధ్రాబ్యాంకులో అక్కౌంట్ వుంది. దాంట్లో బ్యాలెన్స్ ఎనభై వేలు పైగానే వుంటుంది. నా దగ్గర ఎంత డబ్బుంది ... ఏం ఖర్చు పెడుతున్నాను అన్న విషయం మా నాన్నగారు పట్టించుకోరు ... కాబట్టి రేపు నేను నా అక్కౌంట్ లోంచి యాభైవేలు డ్రా చేసి నీకిస్తాను ... దాంతో నెక్లెస్ కొనేయ్’’

    “ నీ డబ్బుతో నీకే నెక్లెస్ కొనివ్వమంటావా?’’ బాధగా అన్నాడు అతను. “చూశావా నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావ్? నీదీ నాదీ ఏమిటి? కాబోయే భార్యాభర్తలం ... నీది నాది అంటూ మనిద్దరికీ విడివిడిగా ఏమీ వుండవ్?’’ మందలిస్తూ అంది ఆమె. “మీ నాన్నగారి షరతు ప్రకారం నేను కష్టపడి సంపాదించి నీకు ప్రజెంట్ చేయాలిగానీ ఇలా చేయడం మోసం చేసినట్టు కాదా?’’ “నువ్వు న్యాయమైన మార్గంలో లోన్ పెట్టి ఆ డబ్బుతో నెక్లెస్ కొందామని అనుకుంటుంటే మా నాన్న తెర వెనుకనుండి నీకు ఆటంకాలు సృష్టించడం లేదా ...? అది మాత్రం మోసం కాదా ...? నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయమని అన్నారు ... మనం ఒక అబద్ధమే ఆడ్తాం అంతే!’’ అతను ఆలోచనల్లో పడ్డాడు. “రేపు నేను డబ్బు డ్రాచేసి మీ ఆఫీసుకు తీసుకొచ్చి నీకిస్తాను’’ “ఏ టైముకి?’’ “మధ్యాహ్నం పన్నెండులోపు’’ అంటూ లేచి నిలబడింది ఆమె వెళ్ళడానికి సిద్ధపడ్తూ’’ *****

    మర్నాడు ఉదయం పదిగంటలకు .... సరోజ అలమారా మొత్తం చిందరవందర చేసి వెతుకుతూంది. అయినా ఆమెకు కావలసింది కనిపించలేదు. అప్పటికి పావుగంట నుండి అతి వెతుకుతూనే వుంది. “ఏంటీ వెతుకుతున్నావ్?’’ వెనుకనుండి వ్యాఘ్రేశ్వరరావు గొంతు వినిపించింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆయన గుమ్మంలో నిలబడి వున్నాడు. “నా చెక్ బుక్ కనిపించడంలేదు. ఇక్కడే పెట్టాను ... ఏమైందో ఏంటో’’అంది ఆమె. “నీ చెక్ బుక్కే కాదు .. పాస్ బుక్ వెతికినా కనిపించదు ... ఎందుకంటే అవి రెండూ నా దగ్గర వున్నాయ్. ఉండు ... తెచ్చిస్తాను’’ వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళాడు ఆయన. ‘హమ్మయ్య ... అయితే నొ ప్రాబ్లం’ అనుకుంది ఆమె. నిమిషంలో ఆయన పాస్ బుక్, చెక్ బుక్కూ తీసుకొచ్చి ఆమెకి యిచ్చాడు. “నీ పాస్ బుక్ అప్ టు డేట్ చేయించాను. నీ అక్కౌంటులో ఎనభై నాలుగువేల రెండువందల పదిహేను రూపాయలు వున్నాయ్ ... దీన్ట్లోంచి ఒక్కపైసా అయినా సరే నువ్వు విత్ డ్రా చేసి రాంబాబుకు యివ్వడానికి వీల్లేదు ... నీకేమైనా అవసరం వుంటే డబ్బులు నన్ను అడిగి తీసుకో ... నీ అక్కౌంటులో బ్యాలెన్స్ ఎంతుందో నేను ఎప్పటికప్పుడు బ్యాంక్ మేనేజర్ని అడిగి తెల్సుకుంటానన్న విషయం మర్చిపోవద్దు’’ ఆయన వెనక్కి తిరిగి రెండడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ ఆగి వెనక్కి చూసి ‘’ఆఫ్ కోర్స్ ... ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ నీ పుట్టినరోజు అంటే జనవరి ఫిఫ్త్ వరకే’’ అని అనేసి వెళ్ళిపోయాడు. సరోజ చేతిలోంచి చెక్ బుక్కూ పాస్ బుక్కూ జారి క్రిందపడిపోయాయ్. *****

  • Prev
  • Next