Home » Ladies Special » సీడ్ సైక్లింగ్.. మహిళలకు ఎంతో ఇంపార్టెంట్..!
సీడ్ సైక్లింగ్.. మహిళలకు ఎంతో ఇంపార్టెంట్..!

ప్రతి మహిళ ఏదో ఒక సమయంలో పీరియడ్స్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంది. కొన్నిసార్లు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి, కొన్నిసార్లు అవి మిస్ అవుతాయి. కొన్నిసార్లు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది, అది భరించలేని విదంగా ఉంటుంది. ఈ సమస్య కేవలం కొంతమంది మహిళలకే పరిమితం కాదు. పెద్ద సంఖ్యలో మహిళలు పీరియడ్స్ సక్రమంగా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కొంటున్నారు.
భారతీయ మహిళల్లో PCOS ఒక సాధారణ హార్మోన్ల సమస్యగా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం భారతదేశంలో 5 మంది యువతులలో ఒకరు PCOS బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో 6 నుండి 13 శాతం మంది PCOSతో బాధపడుతున్నారని WHO నివేదిక సూచిస్తుంది. ఈ మహిళల్లో దాదాపు 70 శాతం మందికి ఈ సమస్య నిర్ధారణ కాలేదు. ప్రపంచవ్యాప్తంగా, ఎనిమిది మంది మహిళల్లో ఒకరు PCOS బారిన పడుతున్నారని అంచనా.. ఇలాంటి మహిళలకు గొప్పగా సహాయపడేది సీడ్ సైక్లింగ్.. అసలు సీడ్ సైక్లింగ్ అంటే ఏంటి? ఇది మహిళలకు ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే..
సీడ్ సైక్లింగ్..
సీడ్ సైక్లింగ్ అనేది ఆహారం ఆధారిత వెల్నెస్ ట్రెండ్. ఇది ఋతు చక్రంలో ఉండే వివిధ దశలను బట్టి నాలుగు రకాల విత్తనాలను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మందులు లేకుండా హార్మోన్లు బాలెన్స్డ్ గా ఉంటూ నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే దీన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది. ఋతు చక్రంలోని ప్రతి దశకు సరైన పోషకాలను, అవసరమైన పోషకాలను శరీరానికి అందించడం దీని ప్రధాన ఉద్దేశం. సింపుల్ గా దీన్ని ప్రకృతి వైద్యంగా పరిగణించవచ్చు.
సీడ్ సైక్లింగ్ ఎప్పుడు.. ఎలా..
ఋతు చక్రం రెండు భాగాలుగా విభజించబడింది.
మొదటి భాగంలో శరీరానికి సరైన మొత్తంలో ఈస్ట్రోజెన్ అవసరం, రెండవ భాగంలో ప్రొజెస్టెరాన్ అవసరం. ఈ అవసరాలను తీర్చడానికి సీడ్ సైక్లింగ్ ద్వారా విత్తనాలను ఆహారంలో తీసుకోవడం జరుగుతుంది.
నెలసరి వచ్చిన మొదటి రోజు నుండి 14వ రోజు వరకు, అండోత్సర్గము దగ్గర పడుతుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలను తినాలి. ఈ విత్తనాలలోని పోషకాలు శరీరంలో అదనపు ఈస్ట్రోజెన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈస్ట్రోజెన్ తక్కువగా ఉన్నప్పుడు దానికి సపోర్ట్ ఇస్తూ అండోత్సర్గము జరగడానికి సహాయపడతాయి.
నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు 15వ రోజు నుండి తదుపరి నెలసరి వచ్చే వరకు తినాలి. ఇవి ప్రొజెస్టెరాన్ హార్మోన్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ఋతుస్రావాన్ని సకాలంలో తీసుకురావడానికి, కడుపు నొప్పి, మానసిక స్థితిలో మార్పులు, రొమ్ము నొప్పి వంటి ప్రీమెన్స్ట్రువల్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. రెండు దశలలో హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు శరీరం చక్రం షెడ్యూల్ ప్రకారం కొనసాగాలని సంకేతాన్ని అందుకుంటుంది. దీని వల్ల ఋతుస్రావం విధానం మెరుగుపడటం ప్రారంభమవుతుంది.
కాబట్టి సీడ్ సైక్లింగ్ ను ఫాలో అవ్వడం వల్ల మహిళలో నెలసరి సమస్యలు చాలా వరకు తగ్గిపోయి.. నెలసరి సజావుగా వస్తుంది.
*రూపశ్రీ.
