Home » Ladies Special » వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేయవచ్చా
వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేయవచ్చా!

తీవ్రమైన ఎండ, దుమ్ము, చెమట కారణంగా వేసవి కాలంలో జుట్టు పొడిబారడం , జిగటగా మారడం జరుగుతుంది. వేసవిలో ఇది సాధారణ సమస్య . ఈ సమస్య నుండి ఉపశమనం కోసం చాలామంది వేసవిలో రోజు తలస్నానం చేస్తుంటారు. తలకు షాంపూతో తలస్నానం చేయడం సహజమే.. గ్లని ప్రతిరోజూ వేసవిలో ప్రతిరోజూ షాంపూ చేయడం సరైనదేనా? అని చాలా మంది గందరగోళం పడుతుంటారు. ప్రతిరోజూ షాంపూ తో జుట్టు కడగడం వల్ల అది ఆరోగ్యంగా ఉంటుందా? జుట్టు ఆరోగ్యానికి ఏది సరైనది? ఏది మంచిది కాదు.. వివరంగా తెలుసుకుంటే..
ప్రతిరోజూ తలస్నానం మంచిదేనా?
వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల తలపై మురికి పేరుకుపోతుంది. ఈ మురికిని తొలగించడానికి తలస్నానం చేయడం చాలా అవసరం. అయితే ప్రతిరోజూ షాంపూ తో తలస్నానం చేయడం జుట్టుకు మంచిది కాదు. మన తలలో జుట్టుకు తేమను అందించే సహజ నూనెలు ఉంటాయి. ప్రతిరోజూ రసాయన ఆధారిత షాంపూలను ఉపయోగించినప్పుడు, ఈ సహజ నూనె పూర్తిగా తొలగిపోతుంది. దీనివల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా, బలహీనంగా, సులభంగా విరిగిపోయేలా తయారవుతుంది.
ప్రతిరోజూ షాంపూ చేస్తే కలిగే నష్టాలు..
ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తే తల చర్మం చాలా పొడిబారిపోతుంది. ఈ పొడిదనాన్ని ఎదుర్కోవడానికి, తల చర్మం మరింత నూనెను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ప్రతిరోజూ షాంపూ తో జుట్టు కడగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, జుట్టు రాలడానికి దారితీసే అవకాశం ఉంటుంది.
వేసవిలో జుట్టును ఎలా శుభ్రం చేయాలంటే..
వేసవిలో జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం, కానీ ప్రతిరోజూ షాంపూ చేయాల్సిన అవసరం లేదు. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే షాంపూ వాడటం మంచిది. కొన్ని రోజులు జుట్టు మరీ జిడ్డుగా అనిపిస్తే తప్ప.. సాధారణంగా షాంపూ లేకుండా కేవలం శుభ్రమైన నీటితో కడుక్కోవచ్చు. అయితే ఎప్పుడు కూడా తేలికపాటి లేదా సహజమైన పదార్థాలతో తయారు చేసిన షాంపూనే వాడటం మంచిది.
జుట్టును ఆరోగ్యంగా ఉంచే చిట్కాలు..
షాంపూ చేసిన తర్వాత జుట్టుకు తప్పకుండా కండిషనర్ రాయాలి. కండిషనర్ తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఎండలోకి వెళ్ళేటప్పుడు, జుట్టును ఒక దూది గుడ్డతో లేదా స్కార్ఫ్‌తో కప్పుకోవాలి. అంతేకాకుండా తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
*రూపశ్రీ
