Home » Ladies Special » గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే విరగబూస్తాయి!
గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే విరగబూస్తాయి!

పువ్వులలో చాలామంది గులాబీ అంటే ఎక్కువ ఇష్టపడతారు. గులాబీ ప్రేమకు సంకేతం. ప్రతి ఇంట్లో కొన్ని గులాబీ మొక్కలు పెంచుకోవడం చాలామంది అలవాటు. అయితే ఇలా గులాబీ మొక్కలు పెంచేవారిలో చాలా మంది పువ్వులు పూయడం గురించి డిజప్పాయింట్ అవుతారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మొగ్గలు వేయడం లేదని కొందరు, మొగ్గలు వేసినా పువ్వులు పూయడం లేదని మరికొందరు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలంలో గులాబీలు బాగా పూస్తుంటాయి. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే గులాబీ మొక్కకు పువ్వులు పూయడం లేదు అనే ప్రశ్నే ఎదురు కాదు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
అరటి తొక్కలే ఎరువు..
గులాబీ చెట్టుక పువ్వులు విరివిగా పూయాలంటే అరటితొక్కలు చక్కని ఎరువుగా పనిచేస్తాయి. అరటి తొక్కలలో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. ఇది గొప్ప సహజ ఎరువుగా పనిచేస్తుంది. గులాబీ మొక్కలకు పువ్వులు పెరగడానికి పెద్ద మొత్తంలో పొటాషియం, భాస్వరం అవసరం. అరటిపండ్లు తిన్న తర్వాత వాటిని పారవేయకుండా నల్లగా, గట్టిగా మారే వరకు 2-3 రోజులు మంచి ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత వాటిని మిక్సర్‌లో మెత్తగా పొడి చేయాలి.
నెలకు ఒకసారి రెండు టీస్పూన్ల పొడిని కుండిలోని మట్టిలో కలపాలి. ఇది పువ్వుల పరిమాణాన్ని రెట్టింపు చేస్తుంది. రంగు కూడా చాలా మెరుపుగా ఉండేందుకు సహాయపడుతుంది.కావాలంటే ఎండిన తొక్కలను నేరుగా నేలలో పాతిపెట్టవచ్చు.
కత్తిరింపు..
శీతాకాలం మొదట్లోనే గులాబీ మొక్కను తేలికగా కత్తిరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చనిపోయిన కొమ్మలను, పసుపు ఆకులను తొలగించాలి. ఎప్పుడూ 45-డిగ్రీల కోణంలో కోతలు చేయాలి. ఇది కొత్త కొమ్మలు వేగంగా పెరుగడానికి సహాయపడుతుంది. కొత్త కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా పువ్వులు ఉత్పత్తి చేయవచ్చు. ఫంగస్‌ను నివారించడానికి కోసిన తర్వాత కోసిన ప్రదేశంలో కొద్దిగా పసుపు పొడి ఫంగస్ పట్టకుండా వేపనూనె లేదా వేప కషాయం లాంటివి వేయాలి.
సూర్య కాంతి..
గులాబీలు సూర్యరశ్మిని ఇష్టపడతాయి. శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గుతుంది కాబట్టి మొక్కను రోజుకు కనీసం 5 నుండి 6 గంటలు ప్రత్యక్ష సూర్యకాంతి పడే చోట ఉంచాలి. మొక్కను నీడలో ఉంచితే అది పువ్వులను కాదు ఆకులను మాత్రమే పెంచుతుంది. తగినంత సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మొక్కను బలపరుస్తుంది.
నీరు..
శీతాకాలంలో నీరు ఎక్కువగా పోస్తారు. ఇది వేర్లు కుళ్ళిపోవడానికి దారితీస్తుంది. గులాబీ నేల ఎల్లప్పుడూ తేమగా ఉండాలి, తడిగా ఉండకూడదు. మట్టిని తాకి, పైభాగం పొడిగా అనిపిస్తేనే నీరు పెట్టాలి. ఉదయం నీరు పోయడం ఎల్లప్పుడూ మంచిది. సాయంత్రం నీరు పెట్టడం వల్ల ఆకులపై తేమ మిగిలిపోతుంది, ఇది బూజు తెగులుకు దారితీస్తుంది.
కలుపు, నేల శుభ్రత..
గులాబీ వేర్లు గాలిని అందుకోవడం చాలా ముఖ్యం. వారానికి ఒకసారి కుండలోని మట్టిని 1-2 అంగుళాల లోతు వరకు వదులుగా చేయడానికి ఒక పారను ఉపయోగించాలి. ప్రధాన వేర్లు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. రాలిపడిన,చనిపోయిన ఆకులు లేదా పువ్వులను తొలగించాలి. నేలను శుభ్రంగా ఉంచడం వల్ల శీతాకాలపు తెగుళ్ళు, ఫంగస్ ప్రమాదాన్ని తగ్గుతుంది.
టీ ఆకులు, ఆవాలు..
అరటి తొక్కలతో పాటు, గులాబీలు ఆమ్ల నేలను ఇష్టపడతాయి. ఉపయోగించిన టీ ఆకులను కడిగి ఎండబెట్టి మట్టిలో కలపడం వల్ల నత్రజని లభిస్తుంది. అలాగే ఆవాల నూనెను తీసిన తరువాత వచ్చే పిప్పిని మార్కెట్ లో విక్రయిస్తారు. దీన్ని నీటిలో నానబెట్టి ద్రవ ఎరువును తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి వేయాలి. ఈ ఎరువు మొక్కకు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఎంత చలిలో అయినా పువ్వులు బాగా పూయడానికి సహాయపడుతుంది.
*రూపశ్రీ.
