Home » Baby Care » పటాసుల వల్ల కాలిన చర్మానికి టూత్ పేస్ట్ పూయవచ్చా..పిల్లల కోసం దీపావళి జాగ్రత్తలు!
పటాసుల వల్ల కాలిన చర్మానికి టూత్ పేస్ట్ పూయవచ్చా..పిల్లల కోసం దీపావళి జాగ్రత్తలు!

దీపావళి పండుగ అనగానే మనందరికీ టపాసుల చప్పుళ్ళు, రంగురంగుల దీపాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ఆనందాల మధ్య చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల ఒక్కోసారి ప్రమాదవశాత్తు చర్మం కాలడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు చేతులు లేదా శరీరం ఇతర భాగాలపై చిన్నపాటి కాలిన గాయాలు అవ్వడం సర్వసాధారణం. అలా కాలిన వెంటనే చాలామంది ఇంట్లో అందుబాటులో ఉండే టూత్‌పేస్ట్‌ను తీసుకుని గాయంపై రాస్తుంటారు. టూత్‌పేస్ట్ రాస్తే మంట తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుందని చాలాకాలంగా ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. కానీ ఇది ఎంతవరకు నిజం? దీనివల్ల ఆరోగ్యానికి మంచిదా లేక ప్రమాదమా అనే దానిపై వైద్యులు కీలకమైన నిజాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే..
కాలిన గాయాల మీద టూత్ పేస్ట్..
దీపావళి సమయంలో టపాసుల కారణంగా చర్మం కాలినప్పుడు టూత్‌పేస్ట్ పూయడం వైద్యపరంగా చాలా ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టూత్‌పేస్ట్‌లో ఉండే రసాయనాలు, పుదీనా ఫ్లేవర్, , ఇతర పదార్థాలు దెబ్బతిన్న చర్మానికి తీవ్రమైన హాని చేస్తాయి. టూత్‌పేస్ట్ రాసిన వెంటనే అందులోని మెంథాల్ లేదా ఇతర కూలింగ్ ఏజెంట్ల వల్ల కొద్దిసేపు చల్లగా అనిపించినప్పటికీ, అది లోపలి వేడిని బయటకు పోనివ్వకుండా ఆపుతుంది. దీనివల్ల చర్మం లోపలి పొరల్లో మంట మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, టూత్‌పేస్ట్‌లో ఉండే కఠినమైన పదార్థాలు సున్నితంగా మారిన కాలిపోయిన చర్మాన్ని మరింత చికాకు పెట్టి ఇన్ఫెక్షన్లకు దారితీసే అవకాశం ఉంది.
కాలిన గాయాలపై ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేని ఇలాంటి ఇంటి వైద్యాలు చేయడం వల్ల సమస్య మరింత జటిలం అవుతుంది. గాయంపై టూత్‌పేస్ట్ వంటి పదార్థాలు పూయడం వల్ల వైద్యులు గాయం తీవ్రతను అంచనా వేయడం కూడా కష్టమవుతుంది. గాయంపై బ్యాక్టీరియా చేరి చీము పట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి టపాసులు కాల్చేటప్పుడు ఏవైనా కాలిన గాయాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టూత్‌పేస్ట్, నూనెలు, వెన్న లేదా ఇతర ఇంటి చిట్కాలను వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టపాసుల వల్ల కాలిన చర్మానికి జాగ్రత్తలు..
ఒకవేళ టపాసుల వల్ల చర్మం కాలితే వెంటనే పాటించాల్సిన సరైన పద్ధతులు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
గాయమైన వెంటనే ఆ ప్రాంతాన్ని సుమారు పది నుంచి ఇరవై నిమిషాల పాటు చల్లటి టాప్ వాటర్ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని వేడి తగ్గి మంట నుండి నిజమైన ఉపశమనం లభిస్తుంది.
నేరుగా ఐస్ ముక్కలను మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదు.
నీటితో శుభ్రం చేసిన తర్వాత ఎటువంటి క్రీమ్స్ రాయకుండా శుభ్రమైన కాటన్ గుడ్డతో గాయాన్ని కప్పి ఉంచాలి.
గాయం పెద్దదిగా ఉంటే లేదా బొబ్బలు ఎక్కువగా వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.
*రూపశ్రీ
