Home » Baby Care »  పిల్లలు పాలు తాగకపోతే కంగారు పడకండి.. ఈ కాల్షియం రిచ్ ఫుడ్ ఇస్తే చాలు..!

పిల్లలు పాలు తాగకపోతే కంగారు పడకండి.. ఈ కాల్షియం రిచ్ ఫుడ్ ఇస్తే చాలు..!

పిల్లలు శారీరకంగా ఎదిగే క్రమంలో ఎముకలు , దంతాలు బలంగా మారడానికి క్యాల్షియం చాలా అవసరం అవుతుంది. సాధారణంగా పిల్లలకు క్యాల్షియం అందేలా చేయడానికి అందరూ పాలకే ఓటు వేస్తారు. . కానీ చాలా మంది పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు లేదా పాలు చూస్తేనే మొహం చాటేస్తుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం పాలు మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ద్వారా కూడా పిల్లల శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందేలా చూసుకోవచ్చు. పిల్లల వయసును బట్టి వారికి ఎంత పరిమాణంలో క్యాల్షియం అవసరమో ,  పిల్లలకు కావాల్సినంత కాల్షియం లభించాలంటే ఏ ఆహారాలు ఇవ్వాలో  నిపుణులు చెబుతున్నారు.   ఆ విషయాలు వివరంగా తెలుసుకుంటే..

ఎంత వయసు పిల్లలకు ఎంత కాల్షియం అవసరం..

ఆరోగ్య నిపుణుల లెక్కల ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ వయసున్న శిశువులకు ప్రతిరోజూ 200 మిల్లిగ్రాముల క్యాల్షియం అవసరం అవుతుంది. అలాగే ఆరు నుంచి పన్నెండు నెలల వయసు ఉన్న పిల్లలకు 260 మిల్లిగ్రాములు, ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న చిన్న పిల్లలకు 700 మిల్లిగ్రాములు, నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నవారికి 1000 మిల్లిగ్రాములు,  తొమ్మిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న కౌమార దశ పిల్లలకు ప్రతిరోజూ 1300 మిల్లిగ్రాములు క్యాల్షియం అవసరం ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెర్త్ నివేదికలు చెబుతున్నాయి.

పిల్లలు పాలు తాగని పక్షంలో వారి రోజువారీ ఆహారంలో క్యాల్షియం సమృద్ధిగా ఉండే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చేర్చడం ద్వారా ఈ కొరతను సులభంగా తీర్చవచ్చు. ఆ ఆహార పదార్థాలు , వాటిలోని పోషకాలు ఇవే..

పనీర్:

పాలు తాగని పిల్లలకు పనీర్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇది ఎంతో సులభంగా జీర్ణమవుతుంది. ప్రతి వంద గ్రాముల పనీర్ లో దాదాపు 200 నుంచి 300 మిల్లిగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ప్రొటీన్, విటమిన్ బి12 , భాస్వరం వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పనీర్‌ను సాయంత్రం పూట స్నాక్స్ లాగా, పరాఠాలలో లేదా కూరలలో కలిపి పిల్లలకు సులభంగా పెట్టవచ్చు.

బాదం పప్పులు:

బాదంలో కేవలం జ్ఞాపకశక్తిని పెంచే గుణాలే కాకుండా క్యాల్షియం కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల బాదంలో దాదాపు 260 నుంచి 265 మిల్లిగ్రాములు క్యాల్షియం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది. అలాగే మెగ్నీషియం ఎముకల గట్టిదనానికి సహాయపడుతుంది.

ఉడికించిన శనగలు:

ఉడికించిన శనగలలో ప్రతి వంద గ్రాములకు దాదాపు 49 నుంచి 55 మిల్లిగ్రాములు క్యాల్షియం ఉంటుంది. వీటిలో క్యాల్షియంతో పాటు ప్రొటీన్ కూడా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. శనగలలో ఉండే ఐరన్ పిల్లల్లో రక్తహీనత సమస్య రాకుండా చూస్తుంది , ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

టోఫూ:

సోయా పాలతో తయారయ్యే టోఫూలో క్యాల్షియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల టోఫూలో సుమారు 350 నుంచి 400 మిల్లిగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ప్లాంట్ ప్రొటీన్ , ఐరన్ పిల్లల రక్త కణాల నిర్మాణానికి తోడ్పడతాయి. దీన్ని కూరల్లో లేదా భుర్జీ లాగా చేసి పెట్టవచ్చు.

రాగి:

రాగులు మన దేశంలో దొరికే అత్యంత శక్తివంతమైన ధాన్యాలలో ఒకటి. ప్రతి వంద గ్రాముల రాగిలో దాదాపు 344 నుంచి 347 మిల్లిగ్రాములు క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో అగ్రస్థానంలో ఉంటుంది. రాగిలో క్యాల్షియంతో పాటు ఐరన్, ఫైబర్, మెగ్నీషియం , భాస్వరం కూడా లభిస్తాయి. పిల్లలకు రాగి జావ, దోశ లేదా లడ్డులు చేసి తినిపించడం చాలా మంచిది.

ఉడికించిన పాలకూర:

ఆకుకూరలలో ఒకటైన పాలకూరను ఉడికించి పిల్లలకు పెట్టవచ్చు. ప్రతి వంద గ్రాముల ఉడికించిన పాలకూరలో సుమారు 150 నుంచి 153 మిల్లిగ్రాములు క్యాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే ఎముకల అభివృద్ధికి తోడ్పడుతుంది. అయితే పాలకూరలో ఆక్సలేట్లు ఉండే కారణంగా దీన్ని పరిమిత మోతాదులోనే పిల్లలకు ఇవ్వాలి , ఎప్పుడూ పచ్చిది కాకుండా ఉడికించి మాత్రమే పెట్టాలి.

ఉడికించిన రాజ్మా:

రాజ్మా గింజలలో ప్రతి వంద గ్రాములకు దాదాపు 25 నుంచి 30 మిల్లిగ్రాములు క్యాల్షియం ఉంటుంది. వీటిలో ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం , పొటాషియం వంటి పోషకాలు పిల్లల మొత్తం శారీరక అభివృద్ధికి తోడ్పడతాయి. ఇందులో ఉండే ఐరన్ పిల్లలకు రోజంతా శక్తినిస్తుంది.

పిల్లల ఆహారంలో ఏ మార్పులు చేసేటప్పుడైనా వారి వయసుకు తగినట్లుగా నిపుణుల సలహా మేరకు సరైన మోతాదును ఎంచుకోవడం మంచిది. కేవలం ఒకే రకమైన ఆహారంపై ఆధారపడకుండా, వివిధ రకాల పోషకాహారాన్ని అందించడం ద్వారా పిల్లలను ఆరోగ్యంగా , బలంగా ఉంచవచ్చు.

                                                                                                                                               *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.