Home » Beauty Care » వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ!

వర్షం నీరు జుట్టుకు హాని చేస్తుందా.. అసలు నిజాలు ఇవీ!

వేసవిలో ఎండలు బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత వచ్చే వర్షాకాలం చాలా ఊరట ఇస్తుంది. చాలామంది వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారు కూడా. కానీ అమ్మాయిలు వర్షానికి భయపడతారు. చాలామంది వర్షంలో  తడిస్తే హెయిర్ ఫాల్ అవుతుందని, డాండ్రఫ్ వస్తుందని అనుకుంటారు. ఈ కారణాలతోనే వర్షం అంటే ఇష్టం ఉన్నా వర్షంలో తడవడానికి భయపడతారు. పైగా వర్షంలో తడిస్తే వెంటనే ఇంటికి వచ్చి మళ్లీ తలస్నానం చేయాలని కూడా అంటుంటారు. కానీ ఇవన్నీ నిజమేనా? వర్షం గురించి ఉన్న అపోహలు, వాస్తవాలు ఏమిటో తెలుసుకుంటే..

వర్షంలో తడిస్తే జుట్టు రాలుతుందా?

వర్షపు నీరు మాత్రమే జుట్టు రాలడానికి ప్రత్యక్ష కారణం కాదని అంటున్నారు నిపుణులు.  ఒత్తిడి, పోషకాహార లోపాలు, హార్మోన్ల మార్పులు, జన్యుపరమైన కారణాలు , కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. తల చర్మం ఎక్కువసేపు తడిగా ఉన్నా లేదా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోయినా జుట్టు రాలే సమస్య పెరుగుతుందట.

తొలకరి జల్లులు ఎక్కువ నష్టం కలిగిస్తాయా?

వేసవి కాలం కారణంగా చాలా కాలం తర్వాత పడే వర్షాలను తొలకరి జల్లులు అంటారు. చాలాకాలం పొడి వాతావరణం తర్వాత కురిసే తొలినాళ్ల వర్షాలు వాతావరణంలోని దుమ్ము, కాలుష్య కారకాలను కిందకు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది.  అలాంటి తొలి వర్షంలో ఎక్కువ సేపు తడవకుండా ఉండటం హెయిర్ కేర్ విషయంలో ఒక మంచి జాగ్రత్త. అయితే, ప్రతీ తొలి వర్షం ఒకేలా ఉండదు.  స్థానిక కాలుష్యం, వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

వర్షంలో తడిచిన తర్వాత జుట్టు కడుక్కోవడం అవసరమా?

 కలుషితమైన గాలిలో పడిన వర్షం లో తడిస్తే.. జుట్టును తేలికపాటి షాంపూతో లేదా  శుభ్రమైన నీటితో కడుక్కోవడం చాలామంచిది.  ఇది దుమ్ము, ధూళి , ఇతర కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్కువగా షాంపూ చేయడం , లేదా పదే పదే తలకు షాంపూ  చేసుకోవడం  కూడా జుట్టును పొడిబారేలా చేస్తుంది.

వర్షపు నీరు జుట్టును పొడిగా మారుస్తుందా?

వర్షపు నీరు జుట్టును పొడిగా మార్చడం అందరి విషయంలో జరగదు.  జుట్టు ఇప్పటికే  పొడిగా ఉన్నా,  జుట్టుకు ఎలాంటి ప్రోడక్ట్ వాడుతున్నారనే విషయం మీద, వర్షం తర్వాత హెయిర్ ను ఏ విధంగా కేర్ తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవసరమైతే తేలికపాటి కండీషనర్ లేదా సీరమ్ ఉపయోగించవచ్చు.

తడి జుట్టుకు మళ్లీ షాంపూ చేయవచ్చా?

తడి జుట్టును ఎక్కువసేపు కట్టి ఉంచడం వల్ల తల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. దీనివల్ల దురద, దుర్వాసన లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు.  ముందుగా జుట్టును పూర్తిగా ఆరబెట్టుకోవడం మంచిది.

వర్షంలో తడిశాక హెయిర్ కేర్ ఎలా ఉండాలి?

వర్షంలో తడిశాక  ఇంటికి చేరుకున్న వెంటనే  జుట్టును శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.  టవల్‌తో మెల్లగా అద్దాలి, అంతే తప్ప , గట్టిగా రుద్దకూడదు.  హెయిర్ డ్రైయర్ ఉపయోగిస్తే ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచాలి.

తడి జుట్టును బలంగా దువ్వకూడదు.  తల చర్మాన్ని ఎక్కువ సేపు తడిగా ఉంచకూడదు.  అవసరమైతే  వారానికి ఒకసారి డీప్ కండిషనింగ్ చేయాలి.

వీళ్లకు జాగ్రత్త తప్పనిసరి..

తల చర్మం జిడ్డుగా ఉండేవారు,  ఇప్పటికే చుండ్రు ఉన్నవారు,  తల చర్మం సున్నితంగా ఉన్నవారు.
తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తులు, జుట్టుకకు ఎక్కువ రసాయన ఉత్పత్తులు వాడేవారు వర్షంలో తడిసిన తరువాత జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

                                  *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.