Home » Beauty Care » కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి!
కనుబొమ్మలు, కనురెప్పలు దట్టంగా పెరగాలంటే ఏం చేయాలి!

ముఖారవిందాన్ని పెంచడంలో కళ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. అమ్మాయిలు అందంలో బాగంగా కళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కంటి అందాన్ని పెంచడంలో కనుబొమ్మలు, కనురెప్పలు కీలక పాత్ర పోషిస్తాయి. కళ్లు అందాన్ని పెంచడమే కాకుండా, మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తాయి. అందుకే అమ్మాయిలు తమ కళ్లను సంరక్షించుకోవడానికి, కనుబొమ్మలను తీర్చిదిద్దుకోవడానికి , కనురెప్పలను దట్టంగా చేసుకోవడానికి రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. అయితే, మార్కెట్లో లభించే అనేక ఉత్పత్తులు చాలా ఖరీదు మాత్రమే కాదు.. చాలా రసాయనాలతో ఉంటాయి. ఇవి మంచి చేయకపోగా కళ్లకు హాని చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే కళ్లు, కనుబొమ్మలు దట్టంగా పెరిగేలా చేయడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
ఆముదం..
ఆముదం నూనెను చాలా కాలంగా వెంట్రుకల సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. దానిలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి?
పడుకునే ముందు దూదితో కనుబొమ్మలకు, కనురెప్పలకు కొద్దిగా ఆముదం నూనె రాయాలి. ఉదయం శుభ్రమైన నీటితో కడిగేయాలి.
ప్రయోజనాలు..
కనుబొమ్మలు మరింత ఒత్తుగా, దట్టంగా మారతాయి. . కనురెప్పల వెంట్రుకలకు తేమ అందుతుంది. జుట్టు రాలడం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.
అలోవెరా..
చర్మ, జుట్టు సంరక్షణకు కలబందను చాలా ప్రజాదరణ పొందిన ఇంటి చికిత్సగా పరిగణిస్తారు.
ఎలా అప్లై చేయాలి?
శుభ్రమైన బ్రష్‌ను ఉపయోగించి తాజా కలబంద జెల్‌ను కనుబొమ్మలకు , కనురెప్పలకు రాయాలి. 20-30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు..
జుట్టుకు తేమ అందుతుంది. కనుబొమ్మలు, కనురెప్పలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. కళ్ల చుట్టూ ఉన్న చర్మం కూడా చల్లబడుతుంది.
గ్రీన్ టీ బ్యాగ్..
కళ్ల కింద ఉబ్బుగా లేదా అలసటగా అనిపిస్తే, గ్రీన్ టీ బ్యాగులు ఉపయోగపడతాయి.
ఎలా ఉపయోగించాలి?
గ్రీన్ టీ బ్యాగ్‌లను ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తర్వాత 10-15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి.
ప్రయోజనాలు..
కంటి వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. కళ్ళకు తాజాదనం కలిగిన అనుభూతి ఉంటుంది. కళ్ల కింద నల్లటి వలయాల సమస్య నుండి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంటుంది.
విటమిన్-ఇ..
విటమిన్ ఇ చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. ఇది బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఎలా ఉపయోగించాలి?
విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను తీసి, కనుబొమ్మలకు , కనురెప్పలకు సున్నితంగా రాయాలి.
ప్రయోజనాలు..
జుట్టుకు పోషణ లభిస్తుంది. కనురెప్పలు మరింత దట్టంగా మారతాయి. కనుబొమ్మల సహజ మెరుపు పెరుగుతుంది.
*రూపశ్రీ.
