Home » Beauty Care » వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి!
వర్షాకాలంలో మొటిమలు పెరుగుతున్నాయా.. ఈ సింపుల్ స్కిన్ కేర్ ను ఫాలో అయిపోండి!

వర్షాకాలం వేడి నుండి ఉపశమనాన్ని తెస్తుంది, కానీ అనేక సమస్యలను కూడా తెస్తుంది, వాటిలో ఒకటి మొటిమలు. ఈ కాలంలో చిన్న, ఎర్రటి లేదా చీముతో నిండిన మొటిమలు చాలామందికి వస్తుంటాయి. కానీ వర్షాకాలానికి, మొటిమలకు మధ్య ఉన్న సంబంధం చాలా మందికి తెలియదు. అసలు అవి ఎందుకు వస్తాయో.. వాటిని ఎలా వదిలించుకోవాలో కూడా చాలామందికి తెలియదు. వర్షాకాలంలో వచ్చే మొటిమల ఆట కట్టించడానికి చాలా సింపుల్ స్కిన్ కేర్ టిప్స్ ను పాలో అవ్వచ్చు. అసలు వర్షాకాలంలో మొటిమలు ఎందుకు వస్తాయి, వీటిని నివారించడానికి ఏ స్కిన్ కేర్ పాటించాలి? తెలుసుకుంటే..
వర్షాకాలంలో మొటిమలు..
వర్షపు నీటికి ఆమ్ల గుణం ఉండటం వల్ల అది చర్మానికి చికాకు కలిగించి, ఎరుపుదనాన్ని కలుగజేస్తుంది. తేమ కారణంగా చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి, దీనివల్ల చర్మం నేరుగా కాలుష్యం, ధూళి కణాలు , మురికితో రియాక్ట్ అవుతుంది. గాలిలోని తేమలో వృద్ధి చెందే వైరస్‌లు , బ్యాక్టీరియా మొటిమలకు కారణమవుతాయి. మరీ ముఖ్యంగా ఈ కాలంలో తీసుకునే అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ సెబమ్ ఉత్పత్తిని పెంచుతుంది. జిడ్డు చర్మం మొటిమలు రావడానికి మరింత ఎక్కువ కారణం అవుతుంది.
మొటిమలను ఎలా నివారించాలి?
తేలికగా ఉండే, pH సమతుల్యత గల క్లెన్సర్‌ను ఉపయోగించి, రోజుకు కనీసం రెండుసార్లు ముఖాన్ని కడుక్కోవాలి. ఇది అదనపు నూనె, మురికి , కాలుష్యాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
ముఖం కడుక్కున్న తర్వాత, మొటిమలను నివారించే టోనర్‌ను అప్లై చేయాలి. టీ ట్రీ , కలబంద వంటి పదార్థాలు చాలా బాగా పని చేస్తాయి.
చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి రెండుసార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి. చర్మ రకాన్ని బట్టి ఎక్స్‌ఫోలియేటర్‌ను ఎంచుకోవాలి.
తేమతో కూడిన వాతావరణంలో కూడా చర్మానికి తేమ అవసరం. ఇందుకోసం, తేలికైన , చర్మరంధ్రాలను మూసివేయని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
బయటకు వెళ్లే ముందు SPF 30 కంటే ఎక్కువ ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను రాసుకోవడం మర్చిపోకూడదు.
ముఖ్యంగా ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి, ముఖ చర్మం అత్యంత సున్నితంగా ఉంటుంది , దానిని పదేపదే తాకడం వల్ల చేతులకు ఉన్న మురికి ముఖానికి అంటుకుని మొటిమలకు కారణం అవుతుంది.
జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం, అలాగే జుట్టు ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే జిడ్డుగా ఉండే జుట్టు చర్మాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. మొటిమలు రావడానికి కారణం అవుతుంది.
వర్షాకాలంలో మొటిమలకు చెక్ పెట్టాలంటే పై చెప్పుకున్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.
*రూపశ్రీ.

