Home » Fashion » పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఇలాంటి దుస్తులు వేసుకుంటే.. లుక్ అంతా నాశనమే.. !
వస్త్రధారణ ఫ్యాషన్ లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అమ్మాయిలు తమ పొడవును, లావును ఆధారంగా ఎంచుకునే దుస్తులను బట్టి, వారి లుక్ ఉంటుంది. ముఖ్యంగా పొట్టిగా ఉండే అమ్మాయిలు ఎప్పుడూ తమ ఎత్తు గురించి ఆలోచిస్తూ సరిగ్గా సూట్ కాని దుస్తులను ఎంచుకుంటూ ఉంటారు. ఎలాంటి దుస్తులు ధరిస్తే అందంగా, కాస్త పొడవుగా కనిపిస్తారో తెలియక చాలామంది ఫ్యాషన్ విషయంలో ఇబ్బంది పడుతుంటారు. సరియైన మోడల్స్ , రంగుల సెలెక్షన్ ద్వారా పొట్టిగా ఉండేవారు కూడా చాలా ఆకర్షణీయంగా, పొడవుగా కనిపించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న రకరకాల ఫ్యాషన్ ట్రెండ్స్ లో పొట్టిగా ఉన్న అమ్మాయిలకు ఏవి మ్యాచ్ అవుతాయి, ఏవి ఎత్తును ఇంకా తగ్గించి చూపుతాయో తెలుసుకోవడం చాలా అవసరం.
పొట్టిగా ఉన్న అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరించకూడదు?
పొట్టిగా ఉండే అమ్మాయిలు ఎలాంటి దుస్తులు వేసుకోకూడదో తెలుసుకోవాలి.. పొడవు తక్కువగా ఉన్నవారు బాగా వదులుగా ఉండే బిగ్ సైజ్ దుస్తులు ధరించకపోవడమే మంచిది. ఇవి శరీరాన్ని ఇంకా పొట్టిగా, లావుగా చూపిస్తాయి. అలాగే పెద్ద పెద్ద ప్రింట్లు లేదా పెద్ద డిజైన్లు ఉన్న దుస్తులు కూడా ఎత్తును తగ్గించి చూపిస్తాయి. కాళ్ళ వరకు కవర్ అయ్యే పెద్ద పెద్ద ఘాగ్రాలు లేదా ఎక్కువ లేయర్లు ఉన్న డ్రెస్సులు వేసుకోవడం వల్ల శరీరం క్రింది భాగం బరువుగా కనిపిస్తుంది. అలాగే మోకాళ్ల వరకు వచ్చే డ్రెస్సులు వేసుకుంటే కాళ్లు చిన్నవిగా కనిపిస్తాయి. సమాంతరంగా అంటే హారిజాంటల్ గీతలు ఉన్న టీషర్టులు లేదా డ్రెస్సులు ధరించడం వల్ల ఉన్నదాని కంటే ఎక్కువ వెడల్పుగా కనిపిస్తారు.
ఇక చెప్పుల విషయానికి వస్తే యాంకిల్ స్ట్రాప్స్ అంటే కాళ్ల చీలమండ వద్ద పట్టీ లాగా ఉండే చెప్పులు వేసుకుంటే కాళ్ల పొడవు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ఎలాంటి దుస్తులు వేస్తే చాలా ఆకర్షణీయంగా , పొడవుగా కనిపిస్తారు?
పొట్టిగా ఉన్నవారు నిలువుగా అంటే వర్టికల్ గీతలు ఉన్న దుస్తులను ఎంచుకోవాలి. ఇవి పొడవుగా కనిపించేలా మ్యాజిక్ చేస్తాయి. చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్లు లేదా చిన్న డిజైన్లు ఉన్న దుస్తులు పొట్టిగా ఉండే అమ్మాయిలకు చాలా బాగా సరిపోతాయి. బాటమ్ వేర్ విషయంలో హై వేస్ట్ జీన్స్ లేదా హై వేస్ట్ ప్యాంట్లు ఎంచుకోవడం వల్ల కాళ్లు పొడవుగా కనిపిస్తాయి. డ్రెస్సుల విషయంలో వి నెక్ లేదా డీప్ నెక్ ఉండే టాప్స్ ధరించడం వల్ల మెడ భాగం పొడవుగా కనిపిస్తుంది.
అలాగే పైన వేసుకునే టాప్ , కింద వేసుకునే ప్యాంట్ లేదా స్కర్ట్ ఒకే రంగులో ఉండేలా చూసుకుంటే శరీరంలో ఒకే రకమైన ఫ్లో ఉన్నట్లు అనిపించి పొడవుగా కనిపిస్తారు. దీనినే మోనోక్రోమ్యాటిక్ లుక్ అంటారు.
డ్రెస్సుల పొడవు విషయానికి వస్తే తొడల వరకు ఉండే షార్ట్ డ్రెస్సులు లేదా పూర్తిగా కింది వరకు ఉండే మాక్సీ డ్రెస్సులు చాలా బాగా సెట్ అవుతాయి. మోకాళ్ల కన్నా కాస్త పైన ఉండేలా చూసుకోవడం మంచిది.
పాదరక్షల విషయానికి వస్తే వి షేప్ లో ఉండే హీల్స్ లేదా పాయింటెడ్ టో షూస్ ధరిస్తే కాళ్లు ఇంకా పొడవుగా కనిపించి లుక్ చాలా స్టైలిష్ గా మారుతుంది. సరియైన రంగులు, సరైన కొలతలతో దుస్తులను ఎంచుకుంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు కూడా అందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

