Home » Fashion »  పటాన్ పటోలా చీర.. 300 ఏళ్లు.. మూడు తరాలు దర్జాగా కట్టగలిగే ఈ చీర ధర తెలుసా.!

పటాన్ పటోలా చీర 300 ఏళ్లు మూడు తరాలు దర్జాగా కట్టగలిగే ఈ చీర ధర తెలుసా.!

భారతీయ సాంప్రదాయ వస్త్రధారణలో చీరకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మన దేశంలో ఎన్నో రకాల చేనేత చీరలు లభిస్తున్నప్పటికీ, కొన్ని రకాల చీరలకు ప్రపంచవ్యాప్తంగా సాటిలేని గుర్తింపు ఉంది. అందులోనూ గుజరాత్‌లోని పటాన్ ప్రాంతానికి చెందిన పటోలా చీర అత్యంత విశిష్టమైనదిగా నిలుస్తుంది. సాధారణంగా మార్కెట్‌లో నాణ్యమైన చీరల ధర కొన్ని వేల రూపాయల్లో ఉంటుంది. కానీ, ఒక అసలైన పటాన్ పటోలా చీరను కొనాలంటే లక్షల రూపాయలు వెచ్చించాల్సిందే. సాధారణంగా లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు, అంతకంటే ఎక్కువ ధరకు కూడా ఈ చీరలు అమ్ముడవుతుంటాయి. ఇంత ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేసేంతగా ఈ పటాన్ పటోలా చీరలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, 300 ఏళ్లు గడిచినా సరే   ఇది ఎందుకు చెక్కుచెదరకుండా ఉంటుంది?   వివరంగా తెలుసుకుంటే..

తయారీ విధానం..

ఈ చీర ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ప్రధాన కారణం దీని ప్రత్యేకమైన తయారీ విధానం. పటాన్ పటోలా చీరను డబుల్ ఇకత్ అనే కష్టమైన చేనేత టెక్నిక్ ను ఉపయోగించి తయారు చేస్తారు. సాధారణంగా చాలా రకాల చీరలను నేసిన తర్వాత రంగులు వేయడం లేదా దారాలతో నేరుగా డిజైన్లను రూపొందించడం చూస్తుంటాం. కానీ పటోలా తయారీ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో మగ్గంపై నేయడానికి ముందే నిలువు, అడ్డు దారాలకు ఎంతో నైపుణ్యంతో రంగులు వేస్తారు. ఏ దారం ఏ స్థానంలోకి వస్తే ఎలాంటి డిజైన్ ఏర్పడుతుందో చేనేత కళాకారులు ముందే ఎంతో కచ్చితత్వంతో లెక్కిస్తారు. ఒక్క దారం స్థానం మారినా మొత్తం డిజైన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి, ఈ ప్రక్రియలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

చీర ఎలాగైనా కట్టుకోవచ్చు..

పటాన్ పటోలా చీరలో ఉన్న మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దీనికి సీదా, తిరుగు అనే తేడా ఉండదు. సాధారణంగా ప్రతి చీరకు ముందు వైపు, వెనుక వైపు తేలికగా గుర్తుపట్టవచ్చు. కానీ ఈ చీరను రెండు వైపులా చూసినా ఒకేలా కనిపిస్తుంది. డిజైన్, రంగులు, మెరుపు రెండు వైపులా సమానంగా ఉండటం వల్ల ఏ వైపు నుంచైనా దీనిని ధరించవచ్చు. అంతటి క్లిష్టమైన నేత పనితనం ఇందులో దాగి ఉంటుంది.

కేవలం చేతి మగ్గమే..

యంత్రాల ప్రమేయం లేకుండా కేవలం చేతులతో మాత్రమే నేసే ఈ చీరల తయారీకి తీవ్రమైన శ్రమ, సమయం అవసరమవుతాయి. ఒక సాధారణ పటోలా చీర నేయడానికి కనీసం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు సమయం పడుతుంది. డిజైన్ డిమాండ్ ఆధారంగా మరింత ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. చేనేత కళాకారుల నెలల తరబడి కష్టం, నైపుణ్యం ఈ చీరలకు అంతటి విలువను తెచ్చిపెడతాయి.

మన్నిక..

ఈ చీరల మన్నిక కూడా అద్భుతమైనది. ఎంతటి ఖరీదైన చీర అయినా కొన్నేళ్ల తర్వాత తన మెరుపును లేదా రంగును కోల్పోవడం సహజం. కానీ పటాన్ పటోలా చీరలు మాత్రం శతాబ్దాలు గడిచినా కొత్తవాటిలాగే మెరుస్తుంటాయి. ఈ చీరల తయారీలో ఎలాంటి రసాయన రంగులను ఉపయోగించకుండా, కేవలం సహజ సిద్ధమైన రంగులను మాత్రమే వాడతారు. అందుకే అసలైన పటోలా చీర సుమారు ముప్పై ఏళ్లు కాకుండా ఏకంగా మూడు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా తన రూపాన్ని నిలబెట్టుకుంటుంది. అంటే తరతరాలుగా, దాదాపు మూడు తరాల పాటు ఒకే చీరను ధరించినా దాని రూపురేఖలు, రంగులు మారకపోవడం ఈ పటాన్ పటోలా ప్రత్యేకత.


                            *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.