Home » Fashion » డ్రెస్‌కు సరిపోయే పర్ఫెక్ట్ జ్యువెలరీని ఎలా ఎంచుకోవాలి.!

 డ్రెస్‌కు సరిపోయే పర్ఫెక్ట్ జ్యువెలరీని ఎంచుకోవడం అనేది ఒక కళ. సరైన జ్యువెలరీ లుక్‌ను మరింత అందంగా మార్చడమే కాకుండా,  ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. దుస్తుల రకం, సందర్భం,  పర్సనల్ స్టైల్ కు తగినట్లుగా జ్యువెలరీని  ఎంచుకోవడంలోనే అమ్మాయిల ఫ్యాషన్ టేస్ట్ బయటకు వస్తుంది.  దుస్తులకు తగ్గట్టు జ్యువెలరీ ని ఎలా ఎంచుకోవాలి అనే విషయాన్ని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే..

నెక్ లైన్ ఆధారంగా నెక్లెస్ సెలెక్షన్...

మీరు వేసుకునే టాప్ లేదా బ్లౌజ్ నెక్ లైన్ మీ నెక్లెస్ ఎంపికలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది.

వి-నెక్ (V-Neck)..

ఈ రకమైన నెక్ లైన్‌కు వి-షేప్‌లోనే ఉండే పెండెంట్లు లేదా డిజైన్లు బాగా సరిపోతాయి. ఇది  గొంతు భాగాన్ని మరింత సన్నగా, అందంగా చూపిస్తుంది.

రౌండ్ లేదా బోట్ నెక్..

బోట్ నెక్‌కి సాధారణంగా నెక్లెస్‌లు వేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ వేసుకోవాలనుకుంటే పొడవైన చైన్లు లేదా హారాలు ఎంచుకోవచ్చు. రౌండ్ నెక్‌కి పొట్టిగా ఉండే చోకర్లు లేదా గుండ్రటి నెక్లెస్‌లు బాగుంటాయి.

ఆఫ్-షోల్డర్ లేదా స్ట్రాప్‌లెస్..

 ఈ రకమైన డ్రెస్సులకు గొంతుకు అతుక్కుని ఉండే చోకర్లు లేదా హెవీ నెక్లెస్‌లు అద్భుతంగా మ్యాచ్ అవుతాయి. ఇవి  భుజాల అందాన్ని హైలెట్ చేస్తాయి.

హై నెక్ లేదా కాలర్ నెక్..

 కాలర్ లేదా హై నెక్ ఉన్న దుస్తులకు నెక్లెస్ అవసరం లేదు. దీనికి బదులుగా చెవులకు కాస్త పెద్ద స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే లుక్ కంప్లీట్ అవుతుంది.

దుస్తుల రంగు , మెటల్ మ్యాచింగ్..

డ్రెస్ రంగును బట్టి ఎలాంటి మెటల్  జ్యువెలరీ వేసుకోవాలో నిర్ణయించుకోవాలి.

బంగారం..

ఎరుపు, పసుపు, నారింజ, మెరూన్ వంటి వామ్ కలర్స్ దుస్తులకు బంగారు ఆభరణాలు చాలా బాగుంటాయి. ఇవి పసిడి కాంతిని మరింత పెంచుతాయి.

వెండి , ప్లాటినం..

 నీలం, ఆకుపచ్చ, ఊదా,  తెల్లటి రంగుల దుస్తులకు వెండి, ప్లాటినం లేదా వైట్ గోల్డ్ జ్యువెలరీ బాగా సరిపోతుంది.

రోజ్ గోల్డ్..

నాజూకైన రంగులు లేదా పేస్టల్ షేడ్స్ అయిన  పింక్, పీచ్, క్రీమ్ వంటి రంగు గల దుస్తులకు రోజ్ గోల్డ్ ఆభరణాలు కొత్తగా, అద్భుతమైన లుక్‌ను ఇస్తాయి.

ఆర్టిఫిషియల్ లేదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ..

కాటన్ కుర్తీలు, కాటన్ చీరలు , ఇండో-వెస్ట్రన్ దుస్తులకు ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ప్రత్యేకమైన ట్రెండీ లుక్‌ను అందిస్తుంది.

సందర్భానికి తగిన జ్యువెలరీ..

ఎక్కడికి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి ఆభరణాల ఎంపిక ఉండాలి.

ఆఫీస్ , కేజువల్ వేర్..

 రోజువారీ వాడకానికి లేదా ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు చాలా సింపుల్ జ్యువెలరీ ఎంచుకోవాలి. చిన్న స్టడ్స్, సన్నటి చైన్, చిన్న పెండెంట్, డిసెంట్ వాచ్ లేదా ఒక సన్నని బ్రాస్‌లెట్ సరిపోతాయి.

పండుగలు , శుభకార్యాలు..

 పట్టు చీరలు, లెహంగాలు వేసుకునే సంప్రదాయ వేడుకలలో టెంపుల్ జ్యువెలరీ, కుందన్, లేదా జుంకాలు చాలా బాగా అమరుతాయి. ఇక్కడ హెవీ లుక్ ఉన్న ఆభరణాలను ధరించవచ్చు.

పార్టీలు , ఈవెనింగ్ ఈవెంట్స్..

 వెస్ట్రన్ గౌన్లు లేదా పార్టీ వేర్ దుస్తులకు మెరిసే డైమండ్స్, క్రిస్టల్స్, లేదా ఒకే ఒక స్టేట్‌మెంట్ పీస్ ధరిస్తే సరిపోతుంది.

డిజైన్ , ప్రింట్లు..

 డ్రెస్ డిజైన్ కూడా జ్యువెలరీ సెలెక్షన్ ను ప్రభావితం చేస్తుంది.

హెవీ వర్క్ డ్రెస్‌లు..

దుస్తులపై ఇప్పటికే ఎక్కువ వర్క్, ఎంబ్రాయిడరీ లేదా జరీ ఉంటే, జ్యువెలరీ చాలా సింపుల్‌గా ఉండాలి. డ్రెస్ , జ్యువెలరీ రెండూ హెవీగా ఉంటే లుక్ గజిబిజిగా అనిపిస్తుంది.

ప్లెయిన్ డ్రెస్‌లు..

 ఒకవేళ  డ్రెస్ ఎటువంటి ప్రింట్లు లేకుండా ప్లెయిన్‌గా ఉంటే,  హెవీ లేదా డిజైనర్ జ్యువెలరీని ఎంచుకుని అట్రాక్షన్ లుక్ సాధించవచ్చు.

బ్యాలెన్స్.. 

జ్యువెలరీ ధరించేటప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైన సూత్రం. నెక్లెస్, ఇయర్ రింగ్స్, గాజులు, రింగ్స్ ఇలా అన్నీ హెవీగా ఉండకూడదు. నెక్లెస్ పెద్దది వేసుకుంటే, చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకోవాలి. ఒకవేళ పెద్ద జుంకాలు లేదా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే, మెడను ఖాళీగా ఉంచడం లేదా చాలా సన్నటి చైన్ వేసుకోవడం మంచిది.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఏ డ్రెస్‌లోనైనా  ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపెంచవచ్చు.

                          *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.