Home » Baby Care » చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిదేనా!
చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడం మంచిదేనా!
.webp)
భారతీయ కుటుంబాలలో వారసత్వం అనేది పిల్లల ద్వారానే ముందుకు వెళుతుంది. వివాహం తర్వాత ప్రతి జంట తమకు ఒక పాప లేదా బాబు కావాలని ఎంతో తహతహలాడతారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల విషయంలో చాలా సందేహాలు, జాగ్రత్తలు తల్లిదండ్రులను తొలిచేస్తూ ఉంటాయి. పిల్లలకు స్నానం చేయించగానే వారిని అందంగా ముస్తాబు చేయడం చాలా సహజం. ఇందులో భాగంగా పిల్లలకు కాటుక కూడా పెడుతూ ఉంటారు. అయితే.. ఇలా పిల్లలకు కాటుక పెట్టడం మంచిదేనా అనేది ఇప్పుడు చాలామందిలో ఎదురవుతున్న ప్రశ్న. దీనికి వైద్యులు ఏ సమాధానం ఇస్తున్నారో తెలుసుకుంటే..
పిల్లల కళ్లకు కాటుక..
పిల్లలకు స్నానం చేయించి ముస్తాబు చేసేటప్పుడు కళ్లకు కాటుక పెడతారు. అయితే ఇలా కళ్లకు కాటుక పెట్టడం అనేది, పిల్లలకు దిష్టి తగలకుండా నివారించడం మాత్రమే కాకుండా.. కళ్లను కూడా శుభ్రంగా ఉంచుతుందని నమ్ముతారు.
అయితే.. నేటికాలంలో పిల్లల కళ్లకు కాటుక పెట్టడం గురించి వైద్యులు చాలా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కాటుక పెట్టుకునే సంప్రదాయం చాలా ప్రాచీనమైనది. ఇది బారతీయ పద్దతులలో భాగంగా ఉంది. అందంగా అలంకరించుకునే క్రమంలో కళ్లకు కాటుక పెట్టడం ఖచ్చితంగా ఉంటుంది. కానీ వైద్యులు మాత్రం పిల్లల కళ్లకు కాటుక పెట్టడం అవసరం లేదు అంటున్నారు.
ప్రాచీన కాలంలో కాటుకను ఇళ్లలోనే తయారు చేసుకునే వారు. ఇందుకోసం స్వచ్చమైన ఆవు నెయ్యి, స్వచ్చమైన పత్తి లేదా కాటన్ వస్త్రం, ఇతర ఔషద దినుసుల సహాయంతో తయారు చేసేవారు. ఇది కళ్ళకు అందాన్నే కాకుండా.. కంటి సమస్యలను కూడా నివారిస్తుంది. కంటి చూపును సంరక్షిస్తుంది. పైగా ప్రాచీన కాలంలో కాటుకను పిల్లల కోసం ప్రత్యేకంగా, పెద్దల కోసం ప్రత్యేకంగా తయారు చేసేవారు. కానీ నేటికాలంలో అదంచా కనుమరుగైంది. కేవలంమార్కెట్లో లభించే కాటుకను ఉపయోగించాలి. మార్కెట్లో లభించే కాటుకలో రసాయనాలు లేదా సీసం ఉండే అవకాశం ఉంది. ఇధి కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచే అవకాశం చాలా ఉంటుంది.
నవజాత శిశువుల కళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి పిల్లలకు రసాయనాలతో కూడిన కాటుక పెట్టడం వల్ల వారి కళ్లు, కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కంటిలో చికాకు, కంటి అలర్జీలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.
రసాయనాలు ఉన్న కాటుకను వాడితే.. కొన్నిసార్లు కంటి నాళాన్ని మూసివేసే ప్రమాదం కూడా ఉంటుందట. అందువల్ల వైద్యులు.. చిన్న పిల్లలకు కాటుక పెట్టకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు.
*రూపశ్రీ.
