Home » Baby Care » Powerful Lessons Parents Should Teach Their Children
పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు!
పిల్లల ఎదుగుదలను చూసి సంతోషించని తల్లిదండ్రులు ఉండరు. అయితే ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకి కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తుంటారు. మరికొంతమంది .. పిల్లలకు అస్సలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతీ విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్కచేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన యాక్టివ్‌గా లేకపోవడం వంటి దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వలన పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అనే విషయం గురించి తెలుసుకుందాం.
1. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్రతీ విషయానికి వాళ్ల మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది.
2. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి.
3. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలపై కోపాన్ని చూపిస్తాం . ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి.
మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి.
4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి ..
5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.