Home » Baby Care » దంతాలు వచ్చేటప్పుడు పిల్లలకు నొప్పి, చిరాకు తగ్గించాలంటే.. ఈ టిప్స్ పాటించండి..!
దంతాలు వచ్చేటప్పుడు పిల్లలకు నొప్పి, చిరాకు తగ్గించాలంటే.. ఈ టిప్స్ పాటించండి..!

పిల్లలు పుట్టడం ఒక అద్బుతం.. పిల్లలను దేవుడు ఇచ్చిన వరం అని భావిస్తారు తల్లిదండ్రులు. పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్లు చేసే ప్రతి చర్య తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంతో సంతోషాన్ని నింపుతాయి. వారు బోర్లాపడితే ఒక సంబరం, దొగ్గాడితే ఒక సంబరం, ముద్దు మాటలు మాట్లాడితే ఒక సంబరం.. ఇలా పిల్లల జీవితంలో ప్రతిదీ కుటుంబానికి, తల్లిదండ్రులకు చాలా తీపి జ్ఞాపకాలను పోగేస్తాయి. అయితే పిల్లలకు దంతాలు రావడం అనేది వారి జీవితంలో ఒక దశను సూచిస్తుంది. దంతాలు వచ్చేటప్పుడు పిల్లలు ఏదో ఒకటి కొరకడం, ఏడవడం వంటివి చేస్తుంటారు.
పిల్లలకు సుమారు 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య, చిగుళ్ళ నుండి 20 పాలపళ్ళు వస్తాయి. ఒక్కో పన్ను రావడానికి సుమారు వారంన్నర సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియ వల్ల పిల్లలు చిరాకు పడుతూ, నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. పళ్లు రావడం అనే ప్రక్రియను ఎవరూ ఆపలేరు.. కానీ దీని వల్ల పిల్లలకు కలిగే ఇబ్బందిని మాత్రం తగ్గించవచ్చు. అసలు పళ్లు వచ్చేటప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? పిల్లల అసౌకర్యం తగ్గించడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
పళ్లు వచ్చేటప్పుడు కనిపించే లక్షణాలు..
పళ్ళు వచ్చేటప్పుడు కనిపించే సాధారణ లక్షణాలలో చిగుళ్ళు వాపు, తరచుగా ఏడవడం, చిరాకు, ప్రతిదాన్నీ నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నించడం, అధికంగా లాలాజలం కారడం, ముఖంపై దద్దుర్లు, నిద్ర విధానంలో మార్పులు , ఆకలి మందగించడం వంటివి ఉంటాయి. తేలికపాటి జ్వరం రావచ్చు, కానీ అధిక జ్వరం పళ్ళు రావడానికి సంకేతం కాదు. ఒకవేళ రోజుకు మూడు నుండి నాలుగు సార్లు నీళ్ళ విరేచనాలు అవుతుంటే, అది తరచుగా నోట్లో ఏవైనా పెట్టుకోవడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ కారణంగా జరిగే అవకాశం ఉంటుంది.
ఏం చేయాలి?
పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, నొప్పికి చిరాకు, అసహనం కూడా ఫీలవుతుంటారు. అలాంటి సమయంలో బిడ్డకు నమలడానికి చల్లని, సురక్షితమైన వస్తువులను ఇవ్వాలి. పిల్లలు నోట్లో పెట్టుకోవడానికి, దాని వల్ల వారికి ఎలాంటి ప్రమాదం ఉండకుండా ఉండేలా ఏదైనా వస్తువు వంటిది ఇవ్వాలి. ఇది కూడా ఫ్రిజ్ లో ఉంచి కాస్త చల్లగా ఉన్నప్పుడు ఇస్తే వారి చిగుళ్లకు ఉపశమనం ఉంటుందట.
పిల్లలకు తినడానికి పండ్లు ఇవ్వడం, ఇంట్లో తయారు చేసిన తేలిక పాటి ఆహారాలు, వారు నమిలే విధంగా ఉండే ఆహారాలు ఇవ్వాలి. అలాగే వేలికి శుభ్రమైన చల్లని, తడి గుడ్డను చుట్టి బిడ్డను నమలనివ్వాలి, ప్రతి వస్తువును పూర్తిగా శుభ్రం చేసి, క్రిమిరహితం చేయడం ముఖ్యం. భోజన సమయంలో, చల్లని పెరుగు, అన్నం, మెత్తటి పండ్లు లేదా బిడ్డ మెల్లగా నమలగలిగే ఆహార పదార్థాలను ఇవ్వాలి. ఈ సమయంలో ఆకలి మందగించడం సాధారణం, కాబట్టి బలవంతంగా ఏదీ తినిపించకూడదు.
రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఆకలి మందగించడం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించాలి. వయస్సుకు తగిన భోజనాన్ని టైమింగ్ ప్రకారం ఇస్తుండాలి. తల్లి పాలు మాత్రమే కాకుండా అదనపు పాలు, ద్రవ పదార్థాలు వంటివి కూడా ఇస్తుండాలి.
*రూపశ్రీ.
