Home » Beauty Care » నో మేకప్ లుక్.. ఈ 5 వస్తువులు వాడితే చాలు..నేచురల్ బ్యూటీ లాగా కనిపిస్తారు..!
నో మేకప్ లుక్.. ఈ 5 వస్తువులు వాడితే చాలు..నేచురల్ బ్యూటీ లాగా కనిపిస్తారు..!
.webp)
మనలో చాలామందికి రోజూ ఆఫీసుకైనా, కాలేజీకైనా లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ముఖం తాజాగా, అందంగా కనిపించాలని ఉంటుంది. అయితే రోజూవారీ పనుల్లో భాగంగా ఎక్కువ సమయం కేటాయించి రకరకాల మేకప్ ఉత్పత్తులను కొనడం, వాటిని అప్లై చేయడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. అందుకే అందరూ తక్కువ మేకప్ తో సహజమైన అందాన్ని అందించే నో మేకప్ లుక్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ స్టైల్ లో ముఖం మీద మేకప్ వేసినట్లు కాకుండా చాలా ఫ్రెష్ గా, సహజంగా కనిపిస్తుంది. దీనికోసం పెద్ద పెద్ద మేకప్ కిట్లు లేదా చాలా రకాల వస్తువులు అవసరం లేదు. కేవలం ఐదు రకాల ముఖ్యమైన వస్తువులతోనే ఎంతో సులభంగా ఆకర్షణీయమైన , సహజమైన గ్లో పొందవచ్చు. అవేంటో వివరంగా తెలుసుకుంటే..
స్కిన్ టింట్ లేదా బీబీ క్రీమ్..
ముఖానికి ఎలాంటి బరువైన ఫౌండేషన్ వేయాల్సిన అవసరం లేకుండా ఇది చాలా చక్కగా సహాయపడుతుంది. ఇది చర్మం రంగును ఒకేలా కనిపించేలా చేస్తుంది , మన చర్మం యొక్క సహజత్వాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉంచుతుంది. మన చర్మం రంగుకు సరిపోయే సరైన షెడ్ ను ఎంచుకుని, ముఖం మధ్య భాగం నుంచి బయటి వైపునకు వేళ్లతో లేదా స్పాంజ్ తో మెల్లగా రుద్దుకోవాలి. దీనివల్ల ముఖం మీద ఎటువంటి మచ్చలు లేదా అసమానతలు లేకుండా కాంతివంతంగా మారుతుంది.
కన్సీలర్..
ముఖం మీద చిన్న చిన్న మచ్చలు లేదా కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నట్లయితే వాటిని కవర్ చేయడానికి కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ముఖం అంతటా రాయకుండా కేవలం ఎక్కడైతే మచ్చలు లేదా అవసరం ఉందో అక్కడ మాత్రమే పూయాలి. వేళ్లతో లేదా మేకప్ స్పాంజ్ సహాయంతో దానిని చర్మంలోకి సరిగ్గా కలిసిపోయేలా చేయాలి. దీనివల్ల సహజమైన రూపం చెడిపోకుండా ముఖం శుభ్రంగా కనిపిస్తుంది.
క్రీమ్ బ్లష్..
బుగ్గలకు తేలికపాటి గులాబీ రంగును జోడించడం ద్వారా ముఖం క్షణాల్లో ఎంతో ఫ్రెష్ గా మారుతుంది. దీనికోసం పీచ్, సాఫ్ట్ పింక్ లేదా రోజ్ షెడ్ లో ఉండే క్రీమ్ బ్లష్ ను ఎంచుకోవచ్చు. బుగ్గలపై కొద్దిగా రాసుకుని వేళ్లతో సున్నితంగా అద్దాలి. ఎక్కువ మోతాదులో రాసుకోకుండా చాలా తక్కువగా వాడితేనే రంగు చాలా సహజంగా , అందంగా కనిపిస్తుంది.
బ్రో జెల్..
కనుబొమ్మలను చక్కగా , నీట్గా సెట్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. కనుబొమ్మలు గజిబిజిగా లేకుండా సరిగ్గా ఉండేలా చూసుకోవడం వల్ల ముఖం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
మస్కారా..
కళ్లను మరింత అందంగా , పెద్దవిగా కనిపించేలా చేయడానికి మస్కారా చక్కగా పనిచేస్తుంది. కనురెప్పలకు తేలికపాటి మస్కారా అద్దడం వల్ల కళ్ల చూపు చాలా ఆకర్షణీయంగా మారుతుంది.
ఈ విధంగా కేవలం ఈ ఐదు వస్తువులను సరైన పద్ధతిలో, తక్కువ మోతాదులో వాడడం ద్వారా ఎంత బిజీ డేస్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సులభంగా సహజమైన గ్లో సొంతం చేసుకోవచ్చు. ముఖం మీద ఎలాంటి బరువైన పొరలు లేకుండా రోజంతా ఉల్లాసంగా , తాజాదనంతో కనిపించవచ్చు.
*రూపశ్రీ.

