Home » Beauty Care » పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట బుద్దిగా వినాలంటే ఇలా చేయండి..!

పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట బుద్దిగా వినాలంటే ఇలా చేయండి..!

పిల్లలు మాట విననప్పుడు చాలామంది తల్లిదండ్రులు వెంటనే కోపంతో అరవడం లేదా రెండు దెబ్బలు వేయడం చేస్తుంటారు. ఒకప్పుడు అలా చేసినా పిల్లలు పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ, ఇప్పుడు కాలం మారింది. చిన్నప్పటి దెబ్బలు, భయపెట్టడాలు పిల్లల మనసులో లోతైన గాయాలుగా మిగిలిపోతున్నాయి. అసలు పిల్లలను కొట్టడం,  భయపెట్టడం సరైనదేనా? పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట బుద్దిగా వినాలంటే ఏం చేయాలి? పేరెంటింగ్ నిపుణులు ఇస్తున్న సలహాలు తెలుసుకుంటే..

కొట్టడం వల్ల కలిగే నష్టాలు..

నిజంగా పిల్లలను కొట్టి వాళ్ల సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతీసే తల్లిదండ్రులు కొందరు ఉంటారు. కానీ  పిల్లలను కొట్టకుండానే మన మాట వినేలా ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకోవాలి. కొట్టడం వల్ల పిల్లలు మరింత మొండిగా మారే ప్రమాదం ఉంది. నాలుగు సార్లు కొట్టాక మహా అయితే కొడతాడులే ఏం కాదులే అని పిల్లవాడు ఫిక్స్ అయిపోతే, ఇక తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఆ స్థాయి వరకు తీసుకెళ్లకుండా మెల్లగా విషయాన్ని పరిష్కరించుకోవాలి.

పిల్లల మెదడు ఎలా పనిచేస్తుంది?

పిల్లలకు మనం చెప్పే తర్కం లేదా విశ్లేషణ వెంటనే అర్థం కావడానికి సమయం పడుతుంది. కానీ వారిలో ఎమోషనల్ బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుంది. మనం మాటలతో తిట్టినా లేదా అరవకపోయినా, అమ్మానాన్న కోపంగా ఉన్నారని వారు వెంటనే గ్రహిస్తారు. వారి ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి దెయ్యం వస్తుందని, భూతం పట్టుకుంటుందని, ఎవరో ఎత్తుకుపోతారని లేదా చీకటి గదిలో వేస్తానని భయపెట్టడం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రతి పిల్లవాడి మనసు చాలా మృదువుగా, ఎటైనా మలుచుకునే విధంగా ఉంటుంది. వాళ్ల భావోద్వేగాలను సరైన విధంగా అర్థం చేసుకుని నడిపించడం తల్లిదండ్రులకు రావాలి.

చూసి నేర్చుకునే స్వభావం..

పిల్లలు మాటల కంటే చూసి చాలా వేగంగా నేర్చుకుంటారు. మనం ఎంత ప్రశాంతంగా, నిలకడగా ఉంటామో, పిల్లలు కూడా అంతే ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆపుకుంటే సరిపోదు, మన ప్రవర్తనను పిల్లలు ఎప్పుడూ  గమనిస్తూ ఉంటారు. మనకు కూడా తెలియని ఎన్నో విషయాలను వాళ్లు పసిగడతారు. ఇంట్లో ప్రశాంతత కావాలంటే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి. పిల్లవాడు ఎంత అల్లరి చేసినా మనం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటూ మన మాట తీరును ఒకేలా ఉంచుకోవాలి. అప్పుడు అమ్మ సంతోషంగా లేదు, నాన్న సంతోషంగా లేదు అనే విషయం పిల్లలకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ నియంత్రణ తల్లిదండ్రుల వద్ద ఉండాలి.

మాస్టర్ స్విచ్ మన చేతిలోనే ఉంది..

కొంతమంది మొండి పిల్లలు ఎంత చెప్పినా వినరు, ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఇలాంటి సమయంలో మాస్టర్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉందనేది గుర్తుంచుకోవాలి. ఏది జరిగినా మాస్టర్ స్విచ్ తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. మనం తల్లిదండ్రులం అనే విషయం తెలిస్తే ప్రతిదానికీ ఆవేశపడిపోం. పిల్లలు ఎక్కడికి పోయినా చివరకు ఇంటి నియమాలకు లోబడే ఉండాలి. ఒక రోజు లేదా రెండు రోజులు డ్రామా చేసినా మూడో రోజు తిరిగి రావాల్సిందే. మనం చేతులెత్తేస్తున్నామని పిల్లలకు తెలిసినప్పుడే వాళ్లు మనల్ని ఆడించడం మొదలుపెడతారు. అందుకే ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండాలి.

కీ హోల్డింగ్ పాయింట్స్..

పిల్లలు ఏదో ఒక విషయంలో తప్పనిసరిగా తల్లిదండ్రుల దగ్గరికి రావాల్సిన సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు తిండి కోసం, స్కూల్ ఫీజు కోసం లేదా డబ్బు ఖర్చు పెట్టలేని విషయాల కోసం వాళ్లు మన దగ్గరికే రావాలి. అలాగే ఆడుకునే బొమ్మ రిమోట్ కంట్రోల్ మన దగ్గర ఉందనుకుందాం. ఆ రిమోట్ కావాలంటే పిల్లవాడు మన దగ్గరికి వచ్చి తీసుకోవాలి. అక్కడే మనం చర్చించి సరిదిద్దవచ్చు. నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి ఇది జరగదు అని స్పష్టంగా చెప్పాలి. మంచి తల్లిదండ్రులుగా ఉండటం కంటే సరైన తల్లిదండ్రులుగా ఉండటం ముఖ్యం. రాగానే చాక్లెట్లు, చిప్స్, బిస్కెట్లు, కూల్ డ్రింకులు ఇస్తూ అడిగిందల్లా చేస్తూ, పిల్లల కోసం నా జీవితం ధారపోశాను అంటే రేపు వాడే ఎవరి కోసం పోశావు అని అడుగుతాడు.

ఎమోషన్స్  విషయంలో జాగ్రత్త

పిల్లలకు తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. అందువల్ల వాళ్లు కోపంగా అరుస్తున్నప్పుడు మనం కూడా ఇంకా కోపంగా అరవడం సరికాదు. వాళ్లకు నియంత్రణ తెలియదు కాబట్టి నియంత్రణ ఎలా చేయాలో నేర్పించాల్సిన బాధ్యత మనదే. పిల్లల మనసు మృదువైన బొమ్మ లాంటిది, దాన్ని మనం కోరుకున్న విధంగా మలుచుకోవచ్చు. అయితే వాళ్లతో పాటు మనమూ ఒక ట్రాక్ లో  ప్రయాణించాలి. ఇలా చేస్తున్నానే అని తల్లిదండ్రులు ఎప్పుడూ అపరాధ భావనకు లోనుకాకూడదు. సరైన పద్ధతిలో పెంచడానికి కొంచెం కఠినంగా ఉండటంలో తప్పు లేదు. కఠినంగా ఉండటానికి, మరీ  కొట్టి హింసించడానికి చాలా తేడా ఉంది. ఆ తేడాను గ్రహించి నెమ్మదిగా వారి ఆలోచనలను సరిదిద్దాలి.

చదువు, ఆటలు, ప్యాషన్ విషయంలో ఆవేశం వద్దు..

ఇప్పుడు చదువు కంటే అన్ని రంగాల్లో అభివృద్ధి ముఖ్యమని, చిన్నప్పటి నుంచే క్రీడల్లో పెట్టాలని,  చాలామంది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఎవరి ఇష్టం వారిది అయినా, ఒకే విషయానికి ఫిక్స్ అయిపోయి పిల్లవాడు సరిగ్గా ఆడకపోతే బాధపడకూడదు. చదువుకునే రోజుల్లో చదవలేదని బాధపడటం, ఇప్పుడు ఆట సరిగ్గా ఆడలేదని బాధపడటం జరుగుతోంది. అలాగే ప్యాషన్ పేరుతో పిల్లలకు నచ్చింది చేయనివ్వాలి అంటుంటారు. కానీ ఏది నచ్చిందో పిల్లలకు ఎలా తెలుస్తుంది, మనం మార్గనిర్దేశం చేస్తేనే కదా వారికి నచ్చేది, నచ్చనిది తెలుస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి.

మనసులో ఇమేజిన్ చేసుకుని పోరు పెట్టకూడదు..

మనసులో ఒక ఊహ చిత్రం పెట్టుకుని అలా జరగాలని అనుకుంటే జరగదు. క్రీడలు అనో, అన్ని రంగాల్లో అభివృద్ధి అనో పిల్లల కోసం నేను అన్నీ చేయాలి అని అనవసరంగా ఆవేశపడకూడదు. ముందు మనం ప్రశాంతంగా ఉంటూ పిల్లలు మానసికంగా ఎమోషన్ పరంగా బలంగా ఉండేలా  పెంచాలి. అడవిలో వదిలేసినా హాయిగా ఉండేంత ధైర్యం, బలం వారికి ఇవ్వాలి.

చదువు లేకుండానే గొప్పవారైన వారు ఉన్నారు, పెద్ద చదువులు చదివి ఇంట్లో ఇబ్బంది పెట్టేవారూ ఉన్నారు. సినిమాలు చూసో, షార్ట్ వీడియోలు చూసో ఇతరుల పిల్లలను చూసి మన పిల్లలను అటు ఇటు తిప్పకూడదు. వారిని వాళ్లుగా ఎదగనివ్వాలి. పదో తరగతి వరకు అన్ని రంగాలను పరిచయం చేయాలి కానీ ఇదే కెరీర్ అని ముందే నిర్ణయించకూడదు. ఐదో తరగతిలో బాగా ఆడినవాడు పదో తరగతి తర్వాత ఆటను మర్చిపోవచ్చు. అందుకే అన్నింటినీ రుచి చూపిస్తూ నచ్చిన దాని వైపు నెమ్మదిగా నడిపించాలి. వారి రాత, పరిస్థితి బాగుంటే ముందుకు వెళ్తారు, లేదంటే అనవసరంగా మనసు కట్టుకుని బాధపడకుండా ఉండటమే మంచిది.

                                                                                                                                       *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.