Home » Beauty Care » తొక్కే కదా అని పడేస్తున్నారా.. అరటిపండు తొక్కను ముఖానికి రుద్దితే జరిగేది ఇదే..!
తొక్కే కదా అని పడేస్తున్నారా.. అరటిపండు తొక్కను ముఖానికి రుద్దితే జరిగేది ఇదే..!

మనం ఎప్పుడైనా అరటిపండు తిన్న తర్వాత దాని తొక్కను ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేస్తుంటాం. చాలామంది దృష్టిలో అది కేవలం వ్యర్థ పదార్థం మాత్రమే. కానీ కొందరు మాత్రం అరటిపండును అరటి పండు తొక్కను స్కిన్ కేర్ కోసం ఉపయోగిస్తుంటారు. ముఖంపై అరటిపండు తొక్కను రుద్దడం వల్ల చర్మానికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయని అనేకమంది చెప్తున్నారు. అసలు అరటి తొక్కను ముఖానికి రుద్దితే ఏం జరుగుతుంది, దాని వల్ల నిజంగానే ఉపయోగాలు ఉన్నాయా, దానిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వివరంగా తెలుసుకుంటే..
అరటిపండు తొక్క..
అరటిపండు తొక్కలో అనేక రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన పోషణను అందించడంలో సహాయపడతాయి. చర్మాన్ని మెరిపించడానికి, తేమగా ఉంచడానికి చాలామంది ఈ సహజ చిట్కాను పాటిస్తుంటారు. అరటి తొక్కలోని లోపలి తెల్లటి భాగంలో ఉండే సమ్మేళనాలు చర్మానికి సాంత్వన కలిగిస్తాయట.
ఎలా ఉపయోగించాలి?
స్కిన్ కేర్ లో భాగంగా అరటి తొక్కను సరైన రీతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం. మొదటగా అరటిపండును శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత తొక్కను వేరు చేసి, దాని లోపలి వైపు ఉండే మెత్తటి తెల్లటి భాగాన్ని ముఖంపై సున్నితంగా రుద్దాలి. అలా రుద్దిన తర్వాత కొన్ని నిమిషాల పాటు ఆ రసాన్ని చర్మంపై అలాగే ఆరనివ్వాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అయితే దీనిని ముఖానికి నేరుగా ఉపయోగించే ముందు చేతి మీద లేదా చర్మంపై చిన్న భాగంలో రాసి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మానికి ఏమైనా అలర్జీ వస్తుందేమో ముందుగానే తెలుస్తుంది.
మొటిమలు, మచ్చల సమస్య ఉన్నవారు కూడా అరటి తొక్కను ఒక ఇంటి వైద్యంగా ఉపయోగిస్తుంటారు. అయితే తీవ్రమైన మొటిమలు లేదా చర్మంపై మంట ఉన్నప్పుడు అరటి తొక్కను గట్టిగా రుద్దకూడదు. అలా రుద్దడం వల్ల చర్మంపై రాపిడి పెరిగి మంట లేదా ఎర్రబడటం వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దోమలు కుట్టిన చోట దురద లేదా వాపు తగ్గడానికి కూడా కొందరు అరటి తొక్కను రాస్తుంటారు.
జాగ్రత్తలు..
అరటి తొక్కను ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. దుమ్ము, ధూళితో ఉన్న చర్మంపై లేదా గాయాలు, కోతలు ఉన్న చోట అరటి తొక్కను ఎప్పుడూ రుద్దకూడదు. కంటికి దగ్గరగా ఉండే సున్నితమైన భాగంలో దీనిని ఉపయోగించకపోవడమే మంచిది. ఒకవేళ అరటి తొక్క రాసిన తర్వాత చర్మంపై దురద, మంట లేదా ఎర్రబడటం వంటివి కనిపిస్తే వెంటనే నీటితో ముఖాన్ని కడిగేయాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
అరటిపండు తొక్కను చర్మ సౌందర్యం కోసం ఒక సాధారణ ఇంటి చిట్కాగా వాడుకోవచ్చు. కానీ చర్మ సంబంధిత పెద్ద సమస్యలకు ఇది ఉపయోగించి తగ్గించుకోవాలని అనుకోవడం తప్పు. ముఖ్యంగా చర్మంపై తీవ్రమైన సమస్యలు, అలర్జీలు లేదా తగ్గని మొటిమలు ఉన్నప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే మంచిది.
*రూపశ్రీ.

