Home » Beauty Care » డీ-టాన్ లేదా బ్లీచ్.. చర్మానికి ఏది మంచిది.!
.webp)
పండుగలు , ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే చాలు, ప్రతీ ఒక్కరూ తమ సౌందర్యాన్ని మరింత పెంచుకోవడానికి ఎంతో ఆరాటపడతారు. కొత్త బట్టలు, రకరకాల ఆభరణాలు, మేకప్ ఇలా ప్రతీ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీటన్నింటితో పాటు ముఖం మెరిసిపోవాలని చాలామంది బ్యూటీ పార్లర్ బాట పడతారు. పార్లర్లో ఫేషియల్స్, డీ ట్యాన్, బ్లీచ్ వంటి రకరకాల పద్ధతులు అందుబాటులో ఉంటాయి. అయితే, పార్లర్‌కు వెళ్లినప్పుడు డీ ట్యాన్ చేయించుకోవాలా లేక బ్లీచ్ చేయించుకోవాలా అనే చిన్నపాటి గందరగోళం అందరిలోనూ ఏర్పడుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటే చర్మానికి మంచిది, ఎవరికి ఏది సెట్ అవుతుంది అనే విషయాలు తెలుసుకుంటే చర్మానికి హాని జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
డీ-ట్యాన్, బ్లీచ్ మధ్య తేడాలు..
డీ ట్యాన్ , బ్లీచ్ అనేవి రెండూ వేర్వేరు పద్ధతులు. ఇవి రెండూ వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. ఎండ వల్ల చర్మంపై ఏర్పడే నలుపుదనాన్ని, మృతకణాలను తొలగించి చర్మానికి సహజమైన కాంతిని అందించడానికి డీ ట్యాన్ ఉపయోగపడుతుంది. ఇది చర్మం అసలు రంగును తిరిగి డవలప్ చేయడానికి తోడ్పడుతుంది.
ఇక బ్లీచ్ విషయానికి వస్తే, ఇది ముఖంపై ఉండే చిన్న చిన్న వెంట్రుకల రంగును బంగారు రంగులోకి లేదా తేలికపాటి రంగులోకి మారుస్తుంది. దీనివల్ల ఆ వెంట్రుకలు చర్మ రంగులో కలిసిపోయి, ముఖం వెంటనే తెల్లగా , ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంటే డీ ట్యాన్ ట్యాన్ తీసేస్తే, బ్లీచ్ ముఖం మీది చిన్న వెంట్రుకల రంగును మారుస్తుంది.
వివిధ రకాల స్కిన్ టైప్ లు ఉన్నవారు ఈ పద్ధతులను ఎంచుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. చర్మం జిడ్డుగా ఉంటే.. కేవలం జిడ్డుగా ఉందని ఏదో ఒక పద్ధతిని గుడ్డిగా ఎంచుకోకూడదు. అందులో ఉపయోగించే ఉత్పత్తుల వివరాలు తెలుసుకోవడం మంచిది. అలాగే పొడి చర్మం ఉన్నవారు చర్మాన్ని మరింత పొడిగా మార్చే లేదా చర్మాన్ని గుంజినట్లుగా చేసే ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. బ్యూటీ కేర్ పూర్తయిన తర్వాత మంచి మాయిశ్చరైజర్ వాడటం చాలా అవసరం.
సున్నితమైన చర్మం ఉన్నవారు , మొటిమలు, మచ్చలతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన చర్మంపై రసాయనాలు ఉన్న బ్లీచ్ లేదా తీవ్రమైన డీ ట్యాన్ ఉత్పత్తులు వాడటం వల్ల చికాకు, ఎర్రబడటం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి వారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే డీ-ట్యాన్ లేదా బ్లీచ్ చేయించుకోవడం మంచిది. ముఖంపై దెబ్బలు, తెగిన గాయాలు లేదా తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు ఎలాంటి కెమికల్ ట్రీట్మెంట్ చేయకూడదు.
ఏదైనా పండుగ లేదా ఈవెంట్ కోసం రెఢీ అవుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం..
ఏదైనా కొత్త ఉత్పత్తిని ముఖానికి రాసేముందు తప్పనిసరిగా చేతిపై లేదా చెవి వెనుక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఒక్కోసారి అలర్జీ లేదా రియాక్షన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి టెస్ట్ చేసిన తర్వాత కనీసం ఒక రోజు వెయిట్ చేయడం మంచిది.
ఏవైనా మెయిన్ పండుగలు లేదా ఈవెంట్లకు సరిగ్గా ఒక రోజు ముందు లేదా లాస్ట్ మినిట్ లో కొత్త రకం బ్లీచ్ లేదా డీ ట్యాన్ చేయించుకోకూడదు. చర్మం సాధారణ స్థితికి రావడానికి , ప్రశాంతంగా మారడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి రెండు మూడు రోజుల ముందే ఇవి పూర్తి చేసుకోవాలి.
బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మంచి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది.
ఒకే సమయంలో బ్లీచ్, డీ ట్యాన్, స్క్రబ్బింగ్ వంటి అనేక రకాల పద్ధతులను ఒకదాని వెనుక ఒకటి చేయకూడదు. దీనివల్ల చర్మంపై తీవ్రమైన ఒత్తిడి పడి మంట లేదా మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ఏదైనా ప్రాసెస్ చేస్తున్నప్పుడు చర్మంపై తీవ్రమైన మంట, వాపు లేదా ఎరుపుదనంతో కూడిన అలర్జీ కనిపిస్తే వెంటనే ఆ ప్రోడక్ట్ ను కడిగేసి, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
చర్మాన్ని మెరిపించుకోవడం ఎంత ముఖ్యమో, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ చర్మ తత్వానికి తగ్గట్లు సరైన పద్ధతిని ఎంచుకుని జాగ్రత్తలు పాటిస్తే అందంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా భద్రంగా ఉంటుంది.
*రూపశ్రీ.
