Home  »  News  »  మై డియర్‌ శ్రీతేజ్‌.. ఇప్పటికైనా నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు!

Updated : Dec 15, 2024

ఒక సినిమా హీరో పట్ల నీకున్న పిచ్చి నీ తల్లిని బలిగొంది. రెండు వారాలుగా నిన్ను ఇలా మృత్యు కుహరంలో ఉంచింది. నువు ప్రాణాలతో బయటపడతావని గానీ, ఒకవేళ బయటపడినా ఆరోగ్యంతో అన్ని అవయవాలు పనిచేస్తూ నువు మామూలు మనిషివి అవుతావనిగానీ నీకు చికిత్స అందిస్తున్న ఖరీదైన డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేకున్నారు. నీ పట్ల ఒక నిట్టూర్పును విడిచే ఖాళీ ఈ సంఘంలో మాతో సహా ఎవరికీ లేదు. 

నీలాంటి సినిమా పిచ్చోళ్ళు, అభిమానులు వెర్రి ఎత్తినట్టు అక్కడ పోగుపడి పోవడానికి కారణమైన దైవాంశ సంభూతుడు అదే నీ హీరో ఈ కారణంగా (అతనే ప్రత్యక్షంగా మీ కుటుంబ ఈ స్థితికి కారణమని ఎవరం అనలేం, అది వేరే సంగతి) ఒకరోజు అరెస్ట్‌ అయి, రిమాండ్‌కు వెళితే ఆ ఒక్కరోజు అందునా ఆ కొద్ది గంటలు అతను ఆ జైలు గోడల మధ్య ఎలా కాలం గడపగలడోనని నిఖిల లోకం తలడిల్లిపోయింది. అంతెందుకు నీ తండ్రి కూడా అతని మీద పెట్టిన కేసులు వాపసు తీసుకుంటానని(చట్టపరంగా ఆ సాంకేతిక విషయాలు వేరే) టీవీ గొట్టాల ముందు నిలువెల్లా నీరైపోయి ఆవేదన చెందాడు. 

నీ హీరో తాలూకు మామ ఆ శిబిరం మొత్తానికి మూలవిరాట్టు మెగాస్టార్‌ చిరంజీవి ఎక్కడో తన షూటింగును(జరుగుతోందా?) రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. అల్లుడిని ఆగమేఘాల మీద ఎలా విడిపించుకు తేవాలా అని ఆగమైపోయాడు. అతని తల్లి అయితే ఆ కొద్దిగంటల ఆలస్యానికే పాపం తల్లడిల్లిపోయింది. తండ్రి నిజంగా అంతటి మహానటుడికి తండ్రిననిపించాడు. ఏ రకమైన ఇబ్బంది జరగదు, ఏదో ఒక పూట కొద్దిపాటి అసౌకర్యం తప్ప అనే భరోసా ఉన్నప్పటికీ వాళ్లంతా ఎంత చలించిపోయారో, చలించి పోయినట్టు టీవీ తెరల ముందు కనబడ్డారో లోకానికి అగుపించింది. కె. రాఘవేంద్రరావు ప్రభృత మహాదర్శకులు, స్టార్లు, సూపర్‌ స్టార్లు, ప్రిన్సులతో సహా నీ హీరో ఇంటి ముందు క్యూ కట్టేశారు అతను ఎన్ని వేల టన్నుల ఎర్రచందనపు చెక్కల్ని తరలించుకుపోయినా కూడా పోలీసులకు చిక్కడనే భరోసా ఉన్నప్పటికీ అతనికి కలిగిన అసౌకర్యానికి ఆంధ్ర, తెలంగాణలోని పార్టీల అధినేతలంతా తమ ఆగ్రహాలతో తమ  (ట్విట్టర్‌) అకౌంట్లను ఖాళీ లేకుండా నింపేశారు.

అదీ ఒక సెలబ్రిటీ జీవితానికి, వాళ్ల కోసం పడిచచ్చే సామాన్య కీటకాల వంటి సాధారణ మానవ జీవితాలకి ఉన్న తేడా. మొదటి వారం రోజులు సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు అదేదో పవిత్ర కార్యంగా భావించి చేస్తున్నాయి అంటేనే వాటి పాలిత ప్రజ ఎంత నికృష్టమైందో చెప్పకనే చెబుతుంది. అల్లు అర్జున్‌ ఈ ప్రాణ నష్టానికి ప్రత్యక్షంగా కారకుడా కాదా అనేది ఎడ తెగని చర్చ. కానీ అతనికి కలిగిన, అంతటి విఐపి అసౌకర్యానికి ప్రపంచం అంతా నీళ్లు తాగడం మానేసింది చూడండి అదీ ఇక్కడ సమాజ బానిసత్వపు ఛాయ. మేరా భారత్‌ మహాన్‌.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.