వెబ్ సిరీస్ : వేరే లెవెల్ ఆఫీస్
నటీనటులు: అఖిల్ సార్థక్, శుభశ్రీ రాయగురు, ఆర్జే కాజల్, రీతు చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా, పి. మహేందర్ తదితరులు
ఎడిటింగ్: రామకృష్ణ
మ్యూజిక్: అజయ్ అరసాడ
సినిమాటోగ్రఫీ: చింతపల్లి ప్రదీప్ రెడ్డి
నిర్మాతలు: వరుణ్ చౌదరి గోగినేని
దర్శకత్వం: ఈ. సత్తి బాబు
ఓటీటీ: ఆహా
కథ:
ఓ కార్పొరేట్ ఆఫీసులో రమ్య, ఆదిత్య, సూరి, లవ్ లీ లక్కీ, కిశోర్, సుందరరాజన్ కొత్తగా చేరతారు. రమ్య, ఆదిత్యలిద్దరు మొదటి రోజే పరిచయం అవుతారు. సూరి విలేజ్ నుంచి వస్తాడు. తనకి జాబ్ లేదని అప్పటి వరకు చులకనగా చూసినవారికి తానేమిటనేది చూపించడం కోసమే అతను సిటీకి వస్తాడు. ఇక లవ్లీ లక్కీ యూ ట్యూబ్ వీడియోస్ చేస్తూ కాలక్షేపం చేస్తుంటుంది.ఆఫీసుకి సీనియర్ హెచ్ ఆర్ గా సుబ్రమణ్య శాస్త్రి (మిర్చి కిరణ్) ఉంటాడు. సీనియర్స్ గా సత్య (బిగ్ బాస్ అఖిల్), లీనా ఉంటారు. మిగతావారి విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే సుబ్రమణ్య శాస్త్రి, లీనా విషయంలో మాత్రం మెత్తబడిపోతుంటాడు. ఆమె ఎవరితో మాట్లాడిన తట్టుకోలేకపోతుంటాడు. అది గమనించిన లీనా అతనితో పాటు ఆఫీసు వర్క్ ను కూడా లైట్ తీసుకుంటుంది. ఇక ఆ సంస్థకి బ్రాంచ్ డైరెక్టర్ గా నిషా ( కాజల్) పనిచేస్తుంటుంది. బ్రాంచ్ డైరెక్టర్ గా సంస్థ పనితీరును మెరుగుపరిచే బాధ్యత ఆమెపైనే ఉంటుంది. అయితే తన వైవాహిక జీవితంలోని సమస్యల కారణంగా ఆమె తన పనులపై శ్రద్ధ పెట్టలేకపోతుంది. ఒక వైపున ఆఫీసు పనులు, మరో వైపున తన కొడుకును చూసుకోవడంలో ఆమె సతమతమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది. అదేమిటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ:
అర్థమైందా అరుణ్ కుమార్ సిరీస్ చూసిన వారికి ఈ సిరీస్ అంతగా నచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంతలా ఎమోషన్స్ ఏమీ లేవు. రొటీన్ ఆఫీస్ లో సాగే సీన్లే ఉంటాయి. కథ ఇప్పుడే మొదలైంది కాబట్టి ఆ కథతో ఇంకా ప్రయాణం చేయవలసిన దూరం చాలా ఉంది. ఈ లోగా వచ్చే కొత్త పాత్రలు .. తీసుకునే కొత్త మలుపులు కథను మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశం లేకపోలేదు.
ప్రతీ సిరీస్ లో మొదటి ఎపిసోడ్ చాలా కీలకం అది చూసి నచ్చితేనే ఆడియన్ సెకెండ్ ఎపిసోడ్ కి వెళ్తాడు. ఆ ఫార్ములానే ఫాలో అవుతూ మొదటి ఎపిసోడ్ లో ప్రధానమైన పాత్రలను పరిచయం చేసిన దర్శకుడు.. ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇక ఆఫీస్ లో సహా ఉద్యోగులతో కలిసి చేసే కామెడీ.. సెటైర్స్ అన్నింటితో ఈ సిరీస్ ఫుల్ ఎంగేజింగ్ చేస్తుందని అనుకుంటారంతా కానీ రెండు మూడు ఎపిసోడ్స్ లో ఆశించిన స్థాయి కామెడీ లేదు. డైలాగులు ఎక్కువున్నాయి అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
సిరీస్ లో బేసిక్ కామెడీ లేకపోగా యాక్టర్స్ ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా సెట్ అవ్వకపోవడం.. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం పెద్ద మైనస్. సాప్ట్ వేర్ ఇండస్ట్రీ లో సాగే పాలిటిక్స్, మేనేజర్ పై ఎంప్లాయిస్ వేసే సెటైర్స్.. బ్రేక్ టైమ్ లో ఫన్.. ఇలా చాలా ఉంటాయి. కానీ వాటిని సరిగ్గా ప్రెజెంట్ చేస్తేనే ఆడియన్ సిరీస్ కి కనెక్ట్ అవుతాడు. కానీ దర్శకుడు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడని తెలుస్తుంది. మరీ కొన్ని సీన్లు అయితే యూట్యూబ్ షార్ట్ లలోనివే అనిపిస్తాయి. చింతపల్లి ప్రదీప్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. అజయ్ అరసాడ మ్యూజిక్ ఓకే. రామకృష్ణ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నిషాగా కాజల్, సత్యగా అఖిల్ సార్థక్ ఆకట్టుకున్నారు. శుభశ్రీ రాయగురు, రీతు చౌదరి తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా : రొటీన్ స్టోరీ.. వన్ టైమ్ వాచెబుల్ .
రేటింగ్ : 2.25 / 5