Home  »  News  »  బుట్టబొమ్మ.. హిట్టుబొమ్మ!

Updated : Feb 3, 2023

సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ 'బుట్ట బొమ్మ'. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.."ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. సితార అనేది నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. బుట్టబొమ్మ గురించి చెప్పాలంటే కథే ఈ సినిమా హీరో. ఈ సినిమా ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్ గా ఉంటుంది. అసలు ఈ సినిమా నేను చేయాలి.. కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఈ సినిమా చూశాక 'అట్లుంటది మనతోని' అని ఈ సినిమా అంటుంది మీతో. ఈ సినిమా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి.. ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే దర్శకుడు రమేష్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారని అర్థమవుతుంది.ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సితార నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది. డీజే టిల్లు చూసినవాళ్లు అందరూ ఈ సినిమా కూడా చూసి ఆదరించండి. చాలా బాగుంటుంది." అన్నారు.

చిత్ర దర్శకుడు రమేష్ మాట్లాడుతూ.. "నాకు ఈ అవకాశమిచ్చిన చినబాబు గారికి, వంశీ గారికి ధన్యవాదాలు. అలాగే నన్ను వారికి పరిచయం చేసిన నవీన్ నూలి గారికి ధన్యవాదాలు. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. కథాకథనాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని తెలుగులో తీస్తే బాగుంటుంది అనిపించించింది. అదే సమయంలో సితార బ్యానర్ రైట్స్ తీసుకున్నారని తెలిసి.. నవీన్ గారి ద్వారా చినబాబు గారిని, వంశీ గారిని కలిశాను. నేను తీయగలనని నమ్మి వారు నాకు ఈ అవకాశమిచ్చారు. ఈ సినిమా కోసం వంశీ గారు నాకు మంచి నటీనటులను, గొప్ప టెక్నిషియన్స్ ని ఇచ్చారు. గోపిసుందర్ గారు, స్వీకర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ వంశీ గారి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసి త్రివిక్రమ్ గారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. సుకుమార్ గారితో కలిసి చాలాకాలం పనిచేశాను. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే ఈ సినిమా కోసం శాయశక్తులా కష్టపడ్డాను. థియేటర్ కి వెళ్లి ఈ సినిమా చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది." అన్నారు.

అనిఖా సురేంద్రన్ మాట్లాడుతూ.. "నాకు ఇంతమంచి అవకాశమిచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ కి, నాగవంశీ గారికి, దర్శకుడు రమేష్ గారికి ధన్యవాదాలు. సూర్య, అర్జున్ దాస్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

సూర్య మాట్లాడుతూ.. "నాకు చిన్నప్పటి నుంచి ప్రేక్షకుడిగా ఇలాంటి సినిమా వేడుకలు చూడటం అలవాటు. అలాంటిది ఇప్పుడు నేను ఈ వేదిక మీద ఉండి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి కారణం మా నాన్నగారు సత్యం గారు. రెండున్నరేళ్ల క్రితం మా నాన్నగారు ఈ సినిమా మలయాళ వెర్షన్ చూపించి.. ఈ ఆటో డ్రైవర్ పాత్ర నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. తర్వాత సితార బ్యానర్ ఈ రైట్స్ తీసుకొని సిద్ధు అన్న, విశ్వక్ అన్నతో తీయాలి అనుకుంటున్నారని తెలిసింది. కొంతకాలానికి అనుకోకుండా మా నాన్నగారు కోవిడ్ వల్ల చనిపోయారు. ఆయనతో నేను చివరి మాటలు మాట్లాడకపోయినా.. ఆయన నన్ను ఈ పాత్రలో చూడాలనుకున్నారు అనేది ఒక్కటి నాకు బాగా గుర్తుంది. ఆయన చనిపోయాక చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నన్ను చూసి నువ్వు ఈ పాత్రకు సరిపోతావు అనుకుంటాను, ఒకసారి వెళ్లి ఆడిషన్ ఇవ్వు అన్నారు. ఆడిషన్ ఇచ్చాక దర్శకుడు రమేష్ గారు నన్ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. మా నాన్న కోరిక నెరవేరేలా చేసిన.. త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి, వంశీ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. రమేష్ గారి దర్శకత్వంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా ఆయనకు ఎన్నో అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. అనిఖా, అర్జున్ దాస్ గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "ఈ సినిమాకు బుట్టబొమ్మ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుంది. నాకు బాగా నచ్చిన సినిమాల్లో కప్పేల ఒకటి. వంశీ గారు ఇంతమంచి టీమ్ తో తెలుగులో రూపొందించడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. గణేష్ రావూరి గారి సంభాషణలు ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు మరో మంచి రచయిత దొరికాడు అనిపించింది. మంచి సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కృషి చేశారు. నా 'లవర్స్' సినిమా సమయం నుంచి వంశీ గారిని గమనిస్తున్నాను. నిర్మాతగా ఆయన ఎదిరిగిన తీరు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఒక వైపు పెద్ద సినిమాలు తీస్తూ, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహించడం అభినందించదగ్గ విషయం. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో వచ్చే వరకు ఎదురుచూడకుండా.. ఇలాంటి మంచి సినిమాలకు థియేటర్లలో చూసి ఆదరించండి" అన్నారు.

దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. "బుట్టబొమ్మ విజువల్స్ చూసినప్పుడు ఉయ్యాల జంపాల లాంటి ఒక అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు సినిమా గుర్తొచ్చింది. ప్రేమమ్, భీమ్లా నాయక్, ఇప్పుడు బుట్టబొమ్మ.. ఏదైనా మంచి కంటెంట్ ఉంటేనే వంశీ గారు ఆ సినిమా మనకు అందిస్తారు. వంశీ గారికి ఇది మరో ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దర్శకుడు రమేష్ గారిని చాలారోజుల తర్వాత కలుస్తున్నాను. నేను చేసిన రచ్చ సినిమాకు ఆయన సహకారం చాలా ఉంది. అప్పుడు ఆయన దగ్గర నేను ఎన్నో మెళకువలు కూడా నేర్చుకున్నాను. ఈ బుట్టబొమ్మ హిట్టుబొమ్మ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు శైలేశ్ కొలను మాట్లాడుతూ.. " సితారతో, వంశీ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. నా 'హిట్' సినిమా విడుదల కాకముందే.. టీజర్, ట్రైలర్ చూసి నా మీద నమ్మకంతో నాకు అడ్వాన్స్ ఇచ్చారు. నన్ను అంతలా నమ్మిన వంశీ గారికి ధన్యవాదాలు. ఈ మూవీ ట్రైలర్ నన్ను ఆశ్చర్యపరిచింది. నేను ఈ సినిమా మలయాళంలో చూసినప్పటికీ, కథ తెలిసినప్పటికీ.. ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా మళ్ళీ చూడాలనే ఆసక్తి కలిగింది. ట్రైలర్ లో కొత్తదనం కనిపించింది. ఈ కథ చాలా బాగుంటుంది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. "నాగవంశీ గారి కథల ఎంపిక చాలా బాగుంటుంది. ఈ చిత్రంతో ఆయన మరో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను" అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.