ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 28 అనే చిత్రం రూపొందుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్‌లో 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రూపొందుతున్న ఈ చిత్రం హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇక ఈ తాజా చిత్రంలో పూజా హెగ్డే, శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ కోసం పెద్ద పోటీ నెలకొని ఉంది. నైజాం ఏరియాలో పంపిణీ కోసం దిల్ రాజు నిర్మాత ఎస్ రాధాకృష్ణకు 50 కోట్ల ఆఫర్ ఇచ్చాడట.
అదే సమయంలో ఏషియన్ సునీల్ అండ్ సిండికేట్ 48 కోట్లకి అడుగుతున్నారు. ఈ ఇద్దరితోనూ నిర్మాత ఎస్ రాధాకృష్ణకు, సూర్యదేవర నాగవంశీకి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. అయితే మొదటినుంచి వారు తమ చిత్రాలను దిల్ రాజుకే ఇస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు చిత్రం విషయానికి వస్తే మహేష్ బాబు ఏషియన్ సునీల్ తో కలిసి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏషియన్ సునీల్ తెరపైకి వచ్చారు. మహేష్ బాబుతో వ్యాపార భాగస్వామి కావడం వల్ల ఈ చిత్రం హక్కులు దిల్ రాజుకు కాకుండా ఏషియన్ సునీల్ కు వెళ్లిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
అయితే ఏషియన్ సునీల్ కంటే దిల్ రాజు రెండు కోట్లు ఎక్కువ అంటే 50 కోట్లకు తీసుకుంటానని ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహేష్ మాట కోసం రెండు కోట్ల నష్టాన్ని భరించడానికి చిన్న బాబు సిద్ధంగా ఉన్నాడా? మహేష్ ఏషియన్ సునీల్ కి ఇవ్వమంటే ఇస్తాడా? అనేది అసలు ప్రశ్న. మొత్తానికి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంది.