English | Telugu
యూవీ క్రియేషన్స్ తో అఖిల్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
Updated : Feb 1, 2023
'మిర్చి'తో కొరటాల శివను, 'రన్ రాజా రన్'తో సుజీత్ ని, 'జిల్'తో రాధాకృష్ణ కుమార్ ని దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం చేసింది యూవీ క్రియేషన్స్. అలా కొత్త దర్శకులతో సినిమాలు చేసినప్పుడు యూవీ మంచి ఫలితాలనే అందుకుంది. ఇక ఇప్పుడు మరో కొత్త దర్శకుడిని పరిచయడం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నాడని సమాచారం.
2015 లో హీరోగా పరిచయమైన అఖిల్ ఇప్పటిదాకా హీరోగా నాలుగు సినిమాలు చేయగా.. అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఏజెంట్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఈ వేసవిలోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత అఖిల్ చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చినట్లేనని అంటున్నారు. ఆయన ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.
అఖిల్ ఇప్పటిదాకా ఐదుగురు దర్శకులతో పని చేయగా అందులో ఒక్కరు కూడా కొత్తవారు లేరు. వీవీ వినాయక్, విక్రమ్ కుమార్, బొమ్మరిల్లు భాస్కర్, సురేందర్ రెడ్డి వంటి సీనియర్ దర్శకులతో పనిచేశాడు. 'మిస్టర్ మజ్ను' తీసిన వెంకీ అట్లూరి యువ దర్శకుడే అయినప్పటికీ అప్పటికే 'తొలిప్రేమ' అనే సినిమా చేశాడు. మొత్తానికి అఖిల్ తన ఆరో సినిమాకి ఓ కొత్త దర్శకుడితో పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు వినికిడి. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ మూవీ ప్రకటన త్వరలోనే రానుందంట.