షార్ట్ ఫిలిమ్స్ తో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన సుహాస్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై వరుస సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నాడు. ఓ వైపు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్న సుహాస్ మరోవైపు హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు. సుహాస్ హీరోగా నటించిన మొదటి సినిమా 'కలర్ ఫోటో' నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటించిన సినిమా మొదటిసారి థియేటర్లలో విడుదలైంది. అదే 'రైటర్ పద్మభూషణ్'. ఈరోజు(ఫిబ్రవరి 3న) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన 'రైటర్ పద్మభూషణ్'కి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఇందులో సుహాస్ టైటిల్ రోల్ పోషించాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువ రచయిత ప్రయాణానికి సందేశాన్ని జోడించి.. కొన్ని నవ్వులు, కొన్ని బాధలతో సినిమాని చక్కగా రూపొందించారని అంటున్నారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలు సహజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇక యువ రచయిత పాత్రలో సుహాస్ చక్కగా ఒదిగిపోయాడని.. హీరో అనగానే అనవసరమైన ఫైట్లు, పాటలు జోలికి పోకుండా.. తనకు నప్పే కథలను ఎంచుకొని అలరిస్తున్నాడంటూ సుహాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. చూస్తుంటే మొదటిసారి హీరోగా థియేటర్లలో అడుగుపెట్టిన సుహాస్ హిట్ కొట్టినట్టే ఉన్నాడు.