![]() |
![]() |

టాలీవుడ్ టాలెంటెడ్ యాంకర్ తిరువీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పాపం ప్రతాప్’ (Papam Prathap). వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 17) విడుదల కానుంది. ఈరోజు ప్రీమియర్లు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే చివరి నిమిషంలో ప్రీమియర్లు రద్దు అయినట్లు తెలుస్తోంది.
యానిమల్ బోర్డ్ సర్టిఫికెట్
సినిమా విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రావాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో కొన్ని జంతువులకు సంబంధించిన దృశ్యాలు ఉండటంతో, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి అయ్యింది. అయితే, ఆఖరి నిమిషంలో ఈ సర్టిఫికెట్ రావడంలో జాప్యం జరగడంతో, సాంకేతికంగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాలేదు. దీనివల్ల ఈ రోజు రాత్రి పడాల్సిన ప్రీమియర్ షోలను మేకర్స్ నిలిపివేయాల్సి వచ్చిందట.
రేపు తిరువీర్ ‘ప్రతాపం’
చిత్ర యూనిట్ ఈ సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. రేపు (ఏప్రిల్ 17) ఉదయం షోల నుంచి సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది.
‘పాపం ప్రతాప్’ సినిమాని తిరువీర్ ఎంతగానో ప్రమోట్ చేశాడు. తన సినిమాలు బాగున్నాయని పేరొస్తున్నా, థియేటర్లలో పెద్దగా ఆదరణ ఉండటం లేదని, ఓటీటీలోనే ఎక్కువ ఆదరణ లభిస్తుందని తిరువీర్ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ‘పాపం ప్రతాప్’తో థియేటర్లలో మంచి హిట్ కొడతానని తిరువీర్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. కానీ, యానిమల్ బోర్డ్ సర్టిఫికెట్ కారణంగా ప్రీమియర్లు రద్దు అయ్యాయన్న వార్తతో 'పాపం తిరువీర్' అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి కాస్త ఆలస్యంగా వచ్చినా ‘పాపం ప్రతాప్’తో తిరువీర్ హిట్ కొడతాడేమో చూడాలి.
![]() |
![]() |