![]() |
![]() |

ప్రముఖ నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’ (Dark Night). ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. వివాహేతర సంబంధాలు, నమ్మకద్రోహం, మానవ సంబంధాల మధ్య ఉండే సున్నితమైన గీతను ఈ చిత్రం ఆవిష్కరించింది. మరి ఈ ‘డార్క్ నైట్’ మూవీ ఎలా ఉందంటే..?
కథ:
అలెక్స్ (విధార్థ్) ఒక పేరున్న లాయర్. అతని భార్య హేమ (పూర్ణ) హౌస్ వైఫ్. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, అలెక్స్ తన వృత్తిలో ఎంత బిజీగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలో తన భార్యకు అంత దూరంగా ఉంటాడు. పైగా తన ఆఫీసులో పనిచేసే సోఫియా (శుభశ్రీ రాయగురు)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంటాడు.
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన హేమ, ఒంటరితనంతో కుమిలిపోతుంది. ఈ క్రమంలో ఆమెకు రోషన్ (త్రిగుణ్) అనే యువకుడు పరిచయమవుతాడు. ఒక రోడ్డు ప్రమాదం వీరిద్దరినీ దగ్గర చేస్తుంది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారుతుంది. అయితే, ఇది కరెక్ట్ కాదని భావించి రోషన్ కు దూరంగా ఉండాలని హేమ నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఒక షాకింగ్ సంఘటన వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది. అసలు హేమ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? అలెక్స్ తన తప్పు తెలుసుకున్నాడా? రోషన్ నేపథ్యం ఏమిటి? అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
‘డార్క్ నైట్’ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా, మానవ సంబంధాల మీద దృష్టి పెట్టిన చిత్రం. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా, ఎవరి విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ఇందులో చూడవచ్చు.
దర్శకుడు ఆదిత్య ఈ సినిమాను వైవాహిక జీవితంలోని చీకటి కోణాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. భార్యాభర్తల మధ్య నమ్మకం సడలినప్పుడు మూడో వ్యక్తి ప్రవేశం వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూపడానికి ప్రయత్నించారు.
ఫస్టాఫ్‌లో హేమ-రోషన్ మధ్య సాగే సీన్లు ఎమోషనల్ గా సాగుతాయి. సెకండాఫ్ లో భర్త పాత్ర ప్రవేశంతో కథలో ఉత్కంఠ పెరుగుతుంది. వైవాహిక బంధానికి కట్టుబడి ఉండాలా? లేక తనకు దక్కని ప్రేమ కోసం మరో దారి వెతుక్కోవాలా? అనే సందిగ్ధంలో ఉన్న మహిళ పరిస్థితిని సహజంగా చూపించారు.
కథ ప్రారంభంలో సాధారణంగా అనిపించినా ముందు వెళ్తున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతుంది. అయితే, కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ లో కొంత గందరగోళం ఉండటం సినిమాకు మైనస్ పాయింట్లు. అలాగే కొన్ని సన్నివేశాల్లో హద్దులు దాటినట్టు అనిపించే బోల్డ్ కంటెంట్ కుటుంబ ప్రేక్షకులకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు.
ఈ సినిమాలో చూపించిన 'రీసెట్ బటన్' కాన్సెప్ట్ ఆకట్టుకుంది. జీవితంలో జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి ఒక అవకాశం లభించినట్టుగా ఇందులో చూపించారు. అయితే, నిజ జీవితంలో "రీసెట్ బటన్ ఉండదు" అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ చిత్రానికి పూర్ణ నటన ప్రధాన ఆకర్షణ. హేమ పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. భర్త వల్ల మోసపోయిన భార్యగా, మానసిక సంఘర్షణకు గురయ్యే మహిళగా హేమ అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. భార్యను నిర్లక్ష్యం చేసే భర్తగా విధార్థ్ తన పాత్రకు న్యాయం చేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన సహజంగా ఉంది. రోషన్ పాత్రలో త్రిగుణ్ చక్కగా ఒదిగిపోయారు. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగా సోఫియా పాత్రలో శుభశ్రీ ఆకట్టుకుంది.
కార్తీక్ ముత్తుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మూడ్ కు తగినట్లుగా లైటింగ్, కలర్ గ్రేడింగ్ ఉన్నాయి. మిస్కిన్ అందించిన సంగీతం కథలోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడంలో తోడ్పడింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే..
‘డార్క్ నైట్’ ఒక మంచి సందేశంతో కూడిన ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. వివాహ బంధంలో నమ్మకం ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి, సోషల్ మెసేజ్ కోరుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
![]() |
![]() |