![]() |
![]() |
.jpg)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల గొడవ పుణ్యమా అని నటుల మధ్య ఉన్న విభేదాలు బయటపడుతూ, ఇండస్ట్రీని రోడ్డుమీదకు ఈడుస్తున్నాయి. 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నవాళ్లు ఒకరినొకరు దెప్పిపొడుస్తూ వస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఆరోపణలు, బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా క్యారెక్టర్ నటి, అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించిన హేమ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
"ఇప్పట్లో కుర్చీ దిగకూడదనీ, మా ఎన్నికలను వాయిదా వేయాలనీ నరేశ్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను వాయిదా వేయించే ఉద్దేశంతో ఇండస్ట్రీలోని కొంతమందితో ఆయన మాట్లాడుతున్నారు." అని ఆమె అన్నారు. మా కోసం నరేశ్ సంపాదించిందేమీ లేదని ఆమె అన్నారు. మాలో ఇప్పటికే ఉన్న నిధులను ఆయన ఖర్చు పెడుతున్నారు. "అదనంగా ఒక్క రూపాయి కూడా ఆయన సంపాదించలేదు. మాలో 5 కోట్లు ఉంటే 3 కోట్లను ఖర్చు పెట్టేశారు. మా అధ్యక్ష పదవి నుంచి దిగడానికి ఆయన సుముఖంగా లేరు." అని ఆమె ఆరోపించారు.
గతంలోని మెడి క్లైయిమ్స్‌కు, రానున్న మెడిక్లెయిమ్స్‌కు కలిపి రెండున్నర కోట్లకు పైగా ఖర్చయ్యాయని తెలిపారు. నటులందరూ కలిసి సేకరించి తెచ్చిన నిధులను నరేశ్ హాయిగా కూర్చొని ఖర్చు పెడుతున్నారనన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఏడాది కల్లా మా నిధులన్నీ ఖాళీ అయిపోతాయని ఆమె హెచ్చరించారు. ప్రకాశ్‌రాజ్ కోసమో, మంచు విష్ణు కోసమో తాను ఈ ఆరోపణలు చేయడం లేదని తన వాయిస్ మెసేజ్‌లో హేమ వివరణ ఇచ్చారు.
శనివారం ఉదయం మా ఎన్నికల కోసం ఒత్తిడి చేయాల్సిందిగా కోరుతూ 200 మంది మా సభ్యులకు హేమ వాయిస్ మెసేజ్ పంపారు. ఆ 200 మంది సభ్యుల సంతకాలతో మా ఎన్నికలు జరిపించాల్సిందిగా మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు ఆమె లేఖను అందించనున్నారు. అయితే ఇటీవలే కృష్ణంరాజు మా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అందులో ఏం నిర్ణయం తీసుకున్నారనేది బయటకు రాలేదు.
![]() |
![]() |